పుట:సత్యశోధన.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

309

ఆత్మ జ్ఞానం నాల్గవ ఆశ్రమంలో అవసరమను దుర్భ్రమ చాలామందికి వుంటుంది. కాని నాకు కలిగిన అనుభవం ప్రకారం ఆత్మజ్ఞానాన్ని వాయిదా వేసే వ్యక్తులు ఆత్మజ్ఞానం పొందలేరని, వృద్ధాప్యం వచ్చినప్పుడు దయకు పాత్రులై, దీనావస్థను పొంది భువికి భారంగా జీవిస్తూ వుంటారని నేను గ్రహించిన సత్యం. నా యీ భావాలను 1911-12 మధ్య ప్రకటించియుండలేదు. అప్పుడు యీ విషయమై నాకు గల అభిప్రాయాలు యివేనని జ్ఞాపకం.

ఆత్మశిక్షణ ఎలా గరపాలి? అందుకోసం పిల్లల చేత భజనలు చేయించేవాణ్ణి. నీతి పుస్తకాలు చదివి వినిపించేవాణ్ణి. అయినా తృప్తి కలిగేది కాదు. వాళ్లతో సంబంధం పెరిగిన కొద్దీ గ్రంధాలద్వారా వాళ్లకు ఆత్మజ్ఞానం కలిగించడం కష్టమని గ్రహించాను. శరీర సంబంధమైన శిక్షణ యివ్వాలంటే వ్యాయామం ద్వారా యివ్వాలి. బుద్ధికి పదును పట్టాలంటే బుద్ధిచేత వ్యాయామం చేయించాలి. అలాగే ఆత్మజ్ఞానం కలగాలంటే ఆత్మవ్యాయామం అవసరం. ఆత్మశిక్షణ ఉపాధ్యాయుని నడత, శీలం వల్లనే విద్యార్థులకు అలవడుతుంది. అందువల్ల ఉపాధ్యాయులు కడు జాగరూకులై వ్యవహరించడం అవసరం. ఉపాధ్యాయుడు తన ఆచరణ ద్వారా విద్యార్థుల హృదయాలను కదిలించగలడు. తాను అబద్ధాలాడుతూ తన విద్యార్థుల్ని మాత్రం సత్యసంధులుగా తీర్చిదిద్దాలను కోవడం సరికాదు. పిరికిపందయగు ఉపాధ్యాయుడు తన శిష్యుల్ని నిర్భీకుల్ని చేయలేడు. వ్యభిచారియగు ఉపాధ్యాయుడు తన శిష్యులకు సంయమం నేర్పలేడు. నా ఎదుట వున్న బాలబాలికలకు నేను ఆదర్శ పాఠ్యవస్తువుగా పుండాలి. అందువల్ల నా విద్యార్థులు నాకు గురువులు అవుతారు. నా కోసం కాకపోయినా వారి కోసమైనా నేను మంచిగా వుండితీరాలి. యీ విషయం నేను బాగా తెలుసుకున్నాను. టాల్‌స్టాయ్ ఆశ్రమంలో నేను అలవరుచుకున్న సంయమనానికి కారకులు యీ బాలబాలికలేనని నా అభిప్రాయం. వారికి నా కృతజ్ఞతలు చెప్పాలి. ఆశ్రమంలో ఒక యువకుడు ఎప్పుడూ గొడవ చేస్తూ వుండేవాడు. అబద్దాలాడేవాడు. ఇతరులతో తగాదా పెట్టుకునేవాడు. ఒక రోజున పెద్ద తుఫాను సృష్టించాడు. నేను గాబరా పడ్డాను. విద్యార్థుల్ని ఎప్పుడూ నేను దండించలేదు. ఆ రోజున నాకు చాలా కోపం వచ్చింది. నేను అతని దగ్గరకు వెళ్ళాను. ఎంత చెప్పినా అతడు వినిపించుకోలేదు. నన్ను మోసగించాలని కూడా ప్రయత్నించాడు. దగ్గరే పడియున్న రూళ్ల కర్ర ఎత్తి అతడి భుజంమీద గట్టిగా వడ్డించాను. కొట్టే సమయంలో నన్ను వణుకు పట్టుకుంది. అతడు దాన్ని గ్రహించి యుండవచ్చు. అంతవరకు ఆవిధంగా ఏ విద్యార్ధి విషయంలోను నేను