పుట:సత్యశోధన.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

భర్తగా

నా గృహ జీవితంలో మాధుర్యం లోపించిందని పాఠకులు అనుకోవద్దు. నా వక్రపోకడకు మూలం ప్రేమయే. నా భార్యను ఆదర్శ స్త్రీగా తీర్చిదిద్దాలని నా భావం. ఆమె స్వచ్ఛంగా, శుద్ధంగా వుండాలనీ. నేను నేర్చుకున్న దాన్ని ఆమె నేర్చుకోవాలనీ, నేను చదివిందాన్ని ఆమె చదవాలనీ, యిద్దరం ఒకరిలో ఒకరం ఏకం అయిపోవాలన్న యోచన తప్ప మరో యోచన నాకు లేదు.

కస్తూరిబాకి కూడా నా మాదిరి యోచన వున్నదో లేదో నాకు తెలియదు. ఆమెకు చదువురాదు. స్వభావం మంచిది. స్వతంత్రురాలు, కష్టజీవి. నాతో తక్కువగా మాట్లాడేది. చదువుకోలేదను చింత ఆమెకు లేదు. చదువుకోవాలనే స్పందన ఆమెలో చిన్నతనంలో నాకు కనబడలేదు. అందువల్ల నా యోచన ఏకపక్షమైనదని అంగీకరిస్తున్నాను. నేను ఆమెను అమితంగా ప్రేమించాను. అలాగే ఆమె కూడా నన్ను ప్రేమించాలని కోరాను. ఆ విధంగా అన్యోన్య ప్రేమ లేకపోయినా, ప్రేమ ఏకపక్షంగా వుండిపోయినా అది మాకు బాధాకరం కాలేదు. నా భార్య మీద నాకు మక్కువ ఎక్కువగా వుండేది. స్కూల్లో కూడా ఆమెను గురించిన ధ్యాసే. ఎప్పుడెప్పుడు చీకటి పడుతుందా, ఎప్పుడెప్పుడు యిద్దరం కలుస్తామా అని ఆరాటపడుతూ వుండేవాణ్ణి. వియోగాన్ని సహించలేని స్థితి. రాత్రిళ్ళు నిరర్ధకమైన మాటలతో నేను కస్తూరిని నిద్రపోనిచ్చేవాణ్ణి కాదు. ఎంతటి ఆసక్తితో బాటు కర్తవ్యనిష్ఠ లేకపోతే నేను అప్పుడు రోగగ్రస్థుడనై మృత్యువు కోరల్లో చిక్కుకుపోయేవాణ్ణి. ప్రపంచానికి భారమైపోయేవాణ్ణి. తెల్లవారగానే నిత్య కార్యక్రమాలు నిర్వర్తిస్తూ వుండేవాణ్ణి. మరొకరిని మోసగించడం ఎరగనివాణ్ణి. కనుకనే అనేక పర్యాయాలు చిక్కుల్లో పడకుండా రక్షణ పొందాను.

కస్తూరిబా చదువుకోలేదని మొదటే వ్రాశాను. ఆమెకు చదువు చెప్పాలనే కోరిక నాకు వుండేది. కాని విషయవాంఛ అందుకు అడ్డుపడేది. ఆమెకు బలవంతంగా చదువు చెప్పవలసిన పరిస్థితి. అది కూడా రాత్రిపూట ఏకాంతంగా వున్న సమయంలోనే సాధ్యపడేది. గురుజనుల ఎదుట భార్యవంక చూడటానికి కూడా వీలు లేని రోజులు. అట్టి స్థితిలో ఆమెతో మాట్లాడటం సాధ్యమా? కాఠియావాడ్ లో పనికిమాలిన మేలిముసుగు అనగా పర్దా రివాజు అమలులో వుండేది. యిప్పటికీ ఆ రివాజు అక్కడక్కడా అమలులో వుంది. ఈ కారణాలవల్ల కస్తూరిబాకు చదువు చెప్పేందుకు అవకాశం చిక్కలేదు. యౌవ్వన సమయంలో భార్యకు చదువు చెప్పడానికి నేను చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్ధమయ్యాయని అంగీకరిస్తున్నాను. విషయవాంఛల నుంచి మేల్కొని బయటపడేసరికి ప్రజాజీవితంలో బాగా లీనమైపోయాను. ఇక ఆమెకు చదువు