పుట:సత్యశోధన.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకధ

11

చెప్పేందుకు సమయం దొరకనేలేదు. ఉపాధ్యాయుణ్ణి పెట్టి చదువు చెప్పిద్దామని చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. ఏతావాతా కస్తూరిబా చదువరి కాలేదు. ఆమె కొద్దిగా జాబులు వ్రాయగలదు. సామాన్యమైన గుజరాతీ అర్థం చేసుకోగలదు. ఆమె యెడ నాకుగల ప్రేమ వాంఛామయం కాకుండా వుండివుంటే యీనాడు ఆమె విదుషీమణి అయివుండేదని నా అభిప్రాయం. చదువు యెడ ఆమెకు గల నిర్లిప్తతను జయించి వుండేవాణ్ణి. శుద్ధమైన ప్రేమవల్ల జరగని పని అంటూ ఏదీ వుండదని నాకు తెలుసు.

భార్య మీద భోగవాంఛ అమితంగా పెంచుకున్నప్పటికీ నన్ను కాపాడిన విషయాల్ని గురించి వ్రాశాను కదా! మరో విషయం కూడా చెప్పవలసిన అవసరం వుంది. ఎవరి నిష్ఠ పవిత్రంగా వుంటుందో వారిని పరమేశ్వరుడు రక్షిస్తూ వుంటాడను సూక్తి మీద అనేక కారణాల వల్ల నాకు విశ్వాసం కలిగింది. అతి బాల్య వివాహం పెద్ద దురాచారం. దానితోబాటు అందలి చెడుగుల్ని కొంత తగ్గించడానికా అన్నట్లు హిందువుల్లో ఒక ఆచారం వుంది. తల్లిదండ్రులు నూతన దంపతుల్ని ఎక్కువ కాలం కలిసి ఒక చోట వుండనీయరు. నూతన వధువు సగం కాలం పుట్టింట్లో వుంటుంది. ఈ విషయంలో అలాగే జరిగింది. మాకు పెండ్లి అయిన అయిదేళ్ళ కాలంలో (13వ ఏట నుండి 18 వరకు) మేము కలిసియున్న కాలం మొత్తం మూడేండ్లకు మించదు. ఆరు నెలలు గడవకుండానే పుట్టింటినుండి కస్తూరిబాకి పిలుపు వచ్చింది. ఆ విధంగా పిలుపు రావడం నాకు యిష్టం వుండేది కాదు. అయితే ఆ పిలుపులే మమ్ము రక్షించాయి. 18వ ఏట నేను ఇంగ్లాండు వెళ్లాను. అది మాకు వియోగకాలం. ఇంగ్లాండు నుండి తిరిగి వచ్చాక కూడా మేము ఆరు నెలల కంటే ఎక్కువ కాలం కాపురం చేయలేదు. అప్పుడు నేను రాజకోట నుండి బొంబాయికీ, బొంబాయినుండి రాజకోటకు పరుగులు తీస్తూ వుండేవాణ్ణి. తరువాత నేను దక్షిణ ఆఫ్రికా వెళ్ళవలసి వచ్చింది. ఈ లోపున నేను పూర్తిగా మేల్కొన్నాను.


5. హైస్కూల్లో

పెండ్లి జరిగినప్పుడు నేను హైస్కూల్లో చదువుతూ వున్నానని ముందే వ్రాశాను. మేము ముగ్గురు సోదరులం ఒకే హైస్కూల్లో చేరి చదువుతున్నాము. మా పెద్దన్నయ్య పెద్ద తరగతిలో వున్నారు. పెండ్లి వల్ల ఒక సంవత్సరం పాటు మా చదువు ఆగిపోయింది. మా అన్న పని మరీ అన్యాయం. ఆయన బడి మానివేశాడు. మా అన్నవలె ఎంతమంది పిన్న వయస్సులో యీ విధంగా చదువు మానివేశారో ఆ భగవంతునికే ఎరుక. ఈనాటి మన హిందూ సమాజంలో విద్య, వివాహం రెండూ వెంట వెంట నడుస్తున్నాయి.