పుట:సత్యశోధన.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

303

కూడా వెళుతూ ఉండేవారు. శ్రావణమాసంలో ప్రతివారూ ఏదో వ్రతానుష్టానం చేస్తూ ఉండేవారు. అది చూచి నేను కూడ శ్రావణమాసాన్ని ఎంచుకున్నాను.

ఈ ప్రయోగం టాల్‌స్టాయి ఆశ్రమంలో ప్రారంభించాను. సత్యాగ్రహాల కుటుంబాల వారిని పిలిపించి వారిని అక్కడ వుంచి నేను, కేలన్‌బెక్ వారితో బాటు ఉన్నాం. వారిలో పిల్లలు, నవయువకులు కూడా ఉన్నారు. వాళ్ళ కోసం పాఠశాల స్థాపించాం. నవయువకుల్లో అయిదారుగురు మహ్మదీయులు ఉన్నారు. ఇస్లాం మత విధుల్ని నిర్వహించుటకు నేను వారికి సహాయం చేశాను. నమాజు చేసుకునేందుకు వాళ్ళకు సౌకర్యం కల్పించాను. ఆశ్రమంలో పారశీకులు, క్రైస్తవులు కూడా ఉన్నారు. వారందరినీ మీమీ మత విధుల్ని పాటించమని ప్రోత్సహించాను. ముస్లిం యువకుల్ని ఉపవాసాలు చేయమని ప్రోత్సహించాను. నేను ఉపవాసాలు చేస్తున్నాను. హిందువులు, క్రైస్తవులు, పారశీకులను కూడా ముహమ్మదీయ యువకులతో బాటు ఉపవాసాలు చేయమని ప్రోత్సహించాను. సంయమంతో అందరికీ తోడ్పడవలెనని నచ్చ చెప్పాను. చాలామంది ఆశ్రమవాసులు నా సలహాను పాటించారు. అయితే హిందువులు, పారశీకులు మాత్రం పూర్తిగా మహ్మదీయులకు సహకరించలేదు. వాస్తవానికి అట్టి అవసరం కూడా లేదు. మహ్మదీయులు సూర్యాస్తమయం కోసం ఎదురు చూస్తుండేవారు. కాని మిగతా వారు ముందే భోజనం చేసి మహ్మదీయులకు వడ్డన చేసేవారు. వీరికోసం ప్రత్యేకించి పదార్థాలు తయారు చేసేవారు. మహ్మదీయులు సహరీ అంటే ఒకపూట భోజనం చేస్తూండేవారు. ఆ విధంగా ఇతరులు చేయవలసిన అవసరం లేదు. మహ్మదీయులు పగలు మంచినీళ్ళు త్రాగేవారు కారు. ఇతరులు మంచినీళ్ళు త్రాగవచ్చు.

ఈ ప్రయోగం వల్ల ఉపవాసాల, ఒక పూట నిరాహారదీక్ష యొక్క మహత్తు అందరికీ బోధపడింది. ప్రేమ, ఆదరాభిమానాలు ఒకరికొకరికి కలిగాయి. ఆశ్రమంలో ఆహారం విషయమై నియమాలు ఏర్పాటు చేశాం. ఈ విషయంలో నా మాటను అంతా అంగీకరించారు. అందుకు నేను కృతజ్ఞత తెలుపవలసిన అవసరం ఉన్నది. ఉపవాసం నాడు మాంసాహార నిషేధం మహ్మదీయులకు ఇబ్బంది కలిగించి ఉండవచ్చు. కాని నాకు ఎవ్వరూ ఈ విషయం తెలియనీయలేదు. అంతా కలిసి మెలిసి ఆనందంగా ఉన్నారు. హిందూ యువకులు ఆశ్రమ నియమాలకు అనుకూలంగా కొన్ని రుచికరమైన వంటకాలు చేసి అందరికీ తినిపిస్తూండేవారు.