పుట:సత్యశోధన.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

302

ఉపవాసాలు

రుచుల్ని, భోగాల్ని వెతుకుతుంది. ఆ రుచుల ఆ భోగాల ప్రభావం మనస్సు మీద పడుతుంది. అందువల్ల ఆ పరిస్థితుల్లో ఆహార పదార్థాల మీద అంకుశం తప్పదు.

వికారంతో నిండిన మనస్సు శరీరంమీద, ఇంద్రియాల మీద విజయం సాధించకపోవడమే గాక, వాటికి లోబడి పనిచేస్తుంది. అందువల్ల శరీరానికి విశుద్ధమైన ఆహారం, తక్కువగా వికారం కలిగించే పదార్థాలు, అప్పుడప్పుడు ఉపవాసాలు, నిరాహారాలు అవసరం. కొందరు సంయమం గలవారు ఆహారాన్ని గురించి ఉపవాసాలను గురించి పట్టించుకోనవసరం లేదని భావిస్తారు. మరికొందరు ఆహారం, నిరాహారం ఇవే సంయమానికి మూలాధారాలని భావిస్తారు. ఇద్దరూ భ్రమలో పడి ఉన్నారని నా అభిప్రాయం. నాకు కలిగిన అనుభవంతో చెబుతున్నాను. సంయమం వైపుకు మరలుతున్న మనస్సుకు ఆహారం విషయమై వహించే జాగరూకతతోబాటు, నిరాహారం మొదలగునవి ఎంతో ఉపయోగపడతాయి. వీటి సహాయం లేనిదే మనస్సు నిర్వికార స్థితిని పొందలేదు. 

31. ఉపవాసాలు

పాలు, భోజనం మాని పండ్లు తినడం ప్రారంభించాము. సంయమం కోసం ఉపవాసాలు కూడా ప్రారంభించాను. మి. కేలన్‌బెక్ తాను కూడా నాతో బాటు వీటిని ప్రారంభించాడు. ఇంతకు పూర్వం నేను ఆరోగ్య దృష్ట్యా ఉపవాసాలు చేసేవాణ్ణి. ఇంద్రియదమనానికి ఉపవాసాలు బాగా పనిచేస్తాయని ఒక మిత్రుడు సలహా ఇచ్చాడు. వైష్ణవ కుటుంబంలో జన్మించాను. మా అమ్మ కఠోరవ్రతాల్ని అనుష్టించేది. ఆ ప్రభావం వల్ల నేను మన దేశంలో వున్నప్పుడు ఏకాదశి వ్రతాన్ని అనుష్టించాను. అయితే అప్పుడు మా తల్లితండ్రుల్ని సంతోషపరిచేందుకు చేస్తూ వుండేవాణ్ణి. ఇట్టి వ్రతాలవల్ల ప్రయోజనం ఉంటుందో, ఉండదో ఆ రోజుల్లో నాకు తెలియదు. తరువాత ఒక మిత్రుణ్ణి చూచి, ఆ ప్రకారం బ్రహ్మచర్య వ్రతపాలన కోసం నేను కూడా ఏకాదశి ఉపవాసాలు ప్రారంభించాను. సామాన్యంగా జనం ఏకాదశినాడు పండ్లు పాలు తీసుకొని వ్రతపాలన చేశామని అనుకుంటూ వుంటారు. కాని పండ్లమీద ఆధారపడి నేను ఉపవాసాలు ఇప్పుడు ప్రతిరోజూ చేయసాగాను. మంచినీళ్ళు త్రాగుతూ ఉండేవాణ్ణి. అది శ్రావణమాసం. రంజాను, శ్రావణమాసం రెండూ ఒకేసారి వచ్చాయి. వైష్ణవ కుటుంబాల్లో వైష్ణవ వ్రతాలతో బాటు శైవ వ్రతాల్ని కూడా పాటిస్తూ ఉండేవారు. మా ఇంట్లో వాళ్లు వైష్ణవ దేవాలయాలకు వెళ్ళినట్లే శైవ దేవాలయాలకు