పుట:సత్యశోధన.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

బాల్య వివాహం

మా నాన్నగారికి గట్టి దెబ్బలు తగిలాయి. చేతులకు కట్లు, వీపుకు కట్లు కట్టించుకుని పోరుబందరు చేరారు. దానితో పెండ్లి ఆనందం సగం తగ్గిపోయింది. అయినా వివాహాలు జరిగాయి. పెండ్లి ముహూర్తాన్ని ఆపడం ఎవరితరం? నేను పెండ్లి సంతోషంలో మా తండ్రిగారికి తగిలిన దెబ్బల దుఃఖం మరిచిపోయాను. చిన్నతనం కదా! నేను పితృభక్తికలవాణ్ణి. దానితోపాటు విషయవాంఛలకు కూడా భక్తుణ్ణి అయ్యాను. విషయాలంటే ఇంద్రియాలకు సంబంధించినవని కూడా గ్రహించాలి. తల్లిదండ్రుల యెడ గల భక్తికోసం సర్వమూ త్యజించాలను జ్ఞానం తరువాత నాకు కలిగింది. నా భోగాభిలాషకు దండన విధించడం కోసమనేమో అప్పుడు ఒక ఘట్టం జరిగింది. అప్పటినుండి ఆ ఘట్టం నన్ను బాధిస్తూనే వుంది. ఆ వివరం ముందు తెలుపుతాను. నిష్కలానందుడు చెప్పిన “త్యాగ్ న టకేరే వైరాగవినా, కరీయే కోటి ఉపాయ్ జీ” “కోటి ఉపాయాలు పన్నినా, విషయవాంఛల యెడ వైరాగ్యం కలుగనిచో త్యాగభావం అలవడదు సుమా” అను గీతం చదివినప్పుడు ఆ గీతం ఎవరైనా చదువగా విన్నప్పుడు కటువైన ఆ ఘట్టం చప్పున జ్ఞాపకం వచ్చి నన్ను సిగ్గులో ముంచేస్తుంది.

మా తండ్రి గాయాలతో బాధపడుతూ కూడా నవ్వు ముఖంతో వివాహ కార్యాలు నిర్వహించారు. మా తండ్రి ఏఏ సమయంలో ఎక్కడెక్కడ కూర్చున్నదీ అప్పటికీ నాకు బాగా గుర్తు. నాకు బాల్య వివాహం చేసినందుకు తరువాత నా తండ్రిని తీవ్రంగా విమర్శించాను. కాని పెండ్లి సమయంలో ఆ విషయం నాకు తోచలేదు. అప్పుడు సంతోషంగా, ఆనందంగా ఉన్నాను. అంతా మనోహరంగా కనిపించింది. పెండ్లి ఉబలాటంలో అప్పుడు నా తండ్రి చేసినదంతా మంచే అని అనిపించింది. ఆ విషయాలు యిప్పటికీ నాకు గుర్తు వున్నాయి.

పెండ్లి పీటల మీద కూర్చున్నాం. సప్తపది పూర్తి అయింది. ఒకే పళ్ళెంలో కంసారు అనగా గోధుమరవ్వ, చక్కెర, కిస్ మిస్, ఎండుద్రాక్షలతో తయారు చేసే జావ తాగాం. ఒకరికొకరం తినిపించుకున్నాం. ఇద్దరం కలిసిమెలిసి వున్నాం. ఆ విషయాలన్నీ కండ్లకు కట్టినట్లు ఇప్పటికీ నాకు కనబడుతున్నాయి. ఆహా! మొదటి రాత్రి. అభం శుభం తెలియని యిద్దరు పిల్లలం. సంసార సాగరంలోకి ఉరికాము. మొదటి రాత్రి ఏం చేయాలో, కొత్త ఆడపిల్లతో ఎలా వ్యవహరించాలో మా వదిన బోధించింది. నీ వెవరి దగ్గర నేర్చుకున్నావని ఆ రాత్రి నా ధర్మపత్నిని అడిగినట్లు గుర్తులేదు. యిప్పటికీ అడుగవచ్చు. కాని నాకు అట్టి ఇచ్ఛలేదు. ఒకరిని చూచి ఒకరం భయం భయంగ వున్నామని పాఠకులు గ్రహించవచ్చు. బాగా సిగ్గుపడ్డాం, ఎట్లా మాట్లాడాలో నాకేం