పుట:సత్యశోధన.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

7

అందువల్ల గందరగోళం జరిగినా, ఎంగిలిమంగలం అయినా, మురికి పేర్కొన్నా పట్టించుకోరు. సహించి వూరుకుంటారు. ఇంత గొడవ, గందరగోళం మూడుసార్లు జరిపేకంటే ఒక్క పర్యాయమే జరిపితే సౌకర్యం కదా! డబ్బు ఖర్చు తగ్గినా దర్జాకు లోటు వుండదు. మూడు వివాహాలు ఒకే పర్యాయం జరపడం వల్ల డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేయవచ్చు. మా తండ్రి, పినతండ్రి ఇద్దరూ వృద్ధులు. మేము వారి చివరి బిడ్డలు. అందువల్ల మా వివాహాలను పురస్కరించుకొని హాయిగా ఆనందించి తమ వాంఛల్ని నెరవేర్చుకోవాలని వారు అనుకోవడం సహజం. ఈ విషయాలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ముగ్గురి వివాహాలు ఒకేసారి చేయాలనే నిర్ణయానికి మా పెద్దలు వచ్చారు. ఇంతకు ముందు వివరించినట్లు కొన్ని మాసాల ముందునుంచే ఏర్పాట్లు ప్రారంభమైనాయి.

వాటిని చూచి మా వివాహాలు జరుగుతాయను విషయం ముగ్గురు సోదరులం తెలుసుకున్నాం. కొత్త బట్టలు ధరించడం, మేళతాళాలు మ్రోగడం, గుర్రం మీద ఎక్కడం, రకరకాల పిండిపంటలు తినడం, ఆటలకు, వినోదాలకు ఒక క్రొత్త పిల్ల దొరకడం ఇవి తప్ప మరోరకమైన వాంఛ మాకు వున్నట్లు నాకు గుర్తులేదు. భోగవిలాసాన్ని గురించిన భావం తరువాత కలిగింది. ఎలా కలిగిందో సవివరంగా తరువాత చెబుతాను. కానీ అట్టి జిజ్ఞాస పాఠకులు తగ్గించుకొందురు గాక. నాకు కలిగిన బిడియాన్ని కొంతవరకు దాచుకుంటాను. చెప్పదగిన కొన్ని విషయాలు చెబుతాను. ఆయితే ఆ వివరాలు వ్రాస్తున్నప్పుడు నా అభిప్రాయాన్ని గమనిస్తే అందు విషయవాసనలు తక్కువేనని తేలుతుంది.

మా అన్నదమ్ములిద్దరినీ రాజకోట నుంచి పోరుబందరు తీసుకువెళ్ళారు. అక్కడ మా ఒంటికి నూనె రాశారు. పసుపు మొదలుగా గలవి పూశారు. నలుగు పెట్టారు. మనోరంజకంగా వున్నా అవి వదిలివేయదగినవి. మా తండ్రి దివాను అయినప్పటికీ నౌకరే గరా! రాజుగారికి విశ్వాసపాత్రుడు. అందువల్ల మరింత పరాధీనుడన్నమాట. చివరి నిమిషం వరకు రాజుగారు మా తండ్రికి వెళ్ళడానికి అనుమతి నీయలేదు. రెండు రోజుల తరువాత అనుమతించారు. మా ప్రయాణానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కానీ విధి నిర్ణయం మరో విధంగా వుంది. రాజకోట పోరుబందరుకు మధ్య 60 క్రోసుల దూరం. ఎడ్లబండి మీద అయిదురోజుల ప్రయాణం, రాజుగారు గుర్రపు బగ్గి ఏర్పాటు చేశారు. అందువల్ల ప్రయాణం మూడురోజుల్లో ముగుస్తుంది. కాని చివరి మజిలీ దగ్గర గుర్రం బగ్గీ బోర్లపడిపోయింది.