పుట:సత్యశోధన.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

3

కనిపించినప్పుడు గబగబా మా అమ్మ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి “అమ్మా, అమ్మా! సూర్యుడు వచ్చాడు” అని చెప్పిన రోజులు నాకు గుర్తు వున్నాయి. సూర్య దర్శనం కోసం ఆమె పరుగు పరుగున బయటకు వచ్చేది. అంతలో మాయదారి సూర్యుడు మబ్బుల చాటున దాక్కునేవాడు. “ఇవాళ నేను భోజనం చేయడం ఈశ్వరునికి యిష్టం లేదు కాబోలు అని అంటూ ఆమె సంతోషంగా వెళ్ళి ఇంటి పనుల్లో లీనమైపోయేది.

మా అమ్మకు వ్యవహారజ్ఞానం అధికం. సంస్థానానికి సంబంధించిన విషయాలు ఆమెకు బాగా తెలుసు. రాణివాసంలో గల స్త్రీలు మా అమ్మ తెలివితేటల్ని మెచ్చుకునేవారు. బాల్యం తెచ్చిన వెసులుబాటును ఉపయోగించుకుని నేను కూడా మా అమ్మ వెంట తరచు రాణివాసానికి వెళుతూ వుండేవాణ్ణి. రాజమాతకు, మా అమ్మకు మధ్య జరుగుతూ వుండే సరస సంభాషణలు ఇప్పటికీ నాకు గుర్తువున్నాయి. కబాగాంధీ పుత్తలీబాయి దంపతులకు సుదామాపురి అను పోరుబందరులో 1869 అక్టోబరు 2వ తేదీన (శుక్ల సంవత్సరం భాద్రపద బహుళ ద్వాదశి శనివారం) నేను జన్మించాను. పోరుబందర్లో నా శైశవం గడిచింది. నన్ను బడిలో చేర్చడం నాకు గుర్తు ఉంది. ఎక్కాలు వల్లించాలంటే నాకు ఇబ్బందిగా వుండేది. అప్పుడు తోటి పిల్లలతో బాటు మా పంతుల్ని తిట్టడం తప్ప నేను నేర్చిందేమీ గుర్తులేక పోవడాన్ని తలచుకుంటే నా బుద్ధి మందమైనదనీ, నాకు జ్ఞాపకశక్తి తక్కువనీ స్పష్టంగా చెప్పవచ్చు. పిల్లలమంతా అప్పడం పాట పాడేవాళ్ళం. ఆ పాటను ఇక్కడ ఉటంకిస్తున్నాను.

ఒకటే ఒకటి అప్పడం ఒకటి
అప్పడం పచ్చి ... కొట్టో కొట్టు ...

మొదటి ఖాళీ చోట పంతులు పేరు, రెండవ ఖాళీ చోట తిట్టు వుండేవి. వాటిని వ్రాయను.

2. బాల్యం

నా తండ్రి పోరుబందరు వదిలి ప్రభుత్వం వారి స్థానిక కోర్టు సభ్యునిగా రాజకోటకు వెళ్ళినప్పుడు నాకు ఏడేండ్ల వయస్సు. నన్ను అక్కడ ఒక ప్రైమరీ స్కూల్లో చేర్చారు. అక్కడ నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయుల పేర్లు, ఇతర విషయాలు నాకు గుర్తు వున్నాయి. పోరుబందరు వలె ఇక్కడ కూడా నా చదువును గురించి వ్రాయవలసిన విషయాలేమీ లేవు. నేను ఒక సామాన్య విద్యార్ధిగా వున్నాను. ఈ స్కూలు నుండి సబర్బను స్కూల్లోను. అక్కడ నుండి హైస్కూల్లోను చేరాను. అప్పటికి నాకు పన్నెండేళ్ళు. ఈ కాలంలో అటు ఉపాధ్యాయులతో కానీ, ఇటు తోటి విద్యార్థులతో