పుట:సత్యశోధన.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

జననం

ప్రభువగు రాజకోటరాజును అసిస్టెంట్ పొలిటికల్ ఏజెంటు ఒకనాడు తూలనాడే సరికి కబాగాంధీ ఆయన్ని ఎదిరించాడు. ఆ ఏజెంటుకు కోపం వచ్చింది. పొరపాటు చేశానని ఒప్పుకొని శరణువేడితే క్షమిస్తానని అన్నాడు. కాని కబాగాంధీ అందుకు అంగీకరించలేదు. తత్ఫలితంగా ఆయన్ని కొన్ని గంటలపాటు నిర్భందించి ఉంచారు. అయినా ఆయన భయపడలేదు. ఆ తరువాత ఆయనను విడిచి పెట్టారు.

మా తండ్రికి డబ్బు నిల్వ చేద్దామనే తలంపు లేదు. అందువల్లనే మాకు బహు తక్కువ ఆస్థి మిగిలింది. మా తండ్రి చదివింది అయిదవ తరగతి వరకే. చరిత్ర భూగోళం ఆయన ఎరగడు. కాని ఆయన గొప్ప అనుభవజ్ఞుడు. వ్యవహారజ్ఞానంలో దిట్ట. చిక్కు సమస్యల్ని తేలికగా పరిష్కరించడంలో మేటి. కనుకనే వేలాదిమంది జనాన్ని పరిపాలించగల సామర్థ్యం ఆయన గడించాడు. మత సంబంధమైన వాదాలు వినడం వల్ల చాలా మంది హిందువుల వలెనే ఆయనకు ధర్మ పరిజ్ఞానం కలిగింది. మా కుటుంబానికి ఆప్తుడైన ఒక బ్రాహ్మణునిచే ప్రేరణ పొంది చివరి రోజుల్లో గీతా పారాయణం ప్రారంభించారు. ప్రతిరోజూ శ్లోకాలు పఠిస్తూ వుండేవారు.

మా అమ్మ పరమసాధ్వి. ఆ విషయం బాల్యం నుంచే నా హృదయంలో నాటుకుంది. ఈమెకు దైవచింతన అధికం. ప్రతిరోజు పూజ చేయకుండా భోజనం చేసేది కాదు. వైష్ణవ దేవాలయం వెళ్లి రావడం ఆమె నిత్య కార్యక్రమం. ఆమె చాతుర్మాస్య వ్రతం (వర్షరుతువునందు నాలుగు మాసాలు ఒక పూట భోజనం చేయు వ్రతం) మానడం నేను ఎన్నడూ చూడలేదు. ఎన్నో కఠినమైన నోములు నోచి వాటిని నిర్విఘ్నంగా నెరవేరుస్తూవుండేది. జబ్బు చేసినప్పుడు దానిని సాకుగా తీసుకొని నోములు మానడం ఎరుగదు. ఒక పర్యాయం ఆమె చాంద్రాయణం చంద్రుని పెరుగుదలను బట్టి భోజన పరిమాణం పెంచడం, తగ్గించడం అనువ్రతం ప్రారంభించి మధ్యలో జబ్బు పడింది. జబ్బు ఏమాత్రం తగ్గలేదని నాకు గుర్తు. రెండు మూడు రోజుల ఉపవాసమంటే ఆమెకు లెక్కలేదు. చాతుర్మాస్య వ్రతపురోజుల్లో ఒక పూట మాత్రమే భుజించడం ఆమెకు అలవాటు. అంతటితో ఆగక ఒక పర్యాయం చాతుర్మాస్య వ్రతం పట్టి ఒక రోజు ఉపవాసం ప్రారంభించింది. మరొక పర్యాయం చాతుర్మాస్య వ్రతం పట్టి రోజు విడిచి రోజు ఉపవాసం ప్రారంభించింది. మరొక పర్యాయం చాతుర్మాస్య వ్రతం పట్టి సూర్యుని చూచిగానీ భోజనం చేయనని నిర్ణయించుకుంది. ఆ రోజుల్లో సూర్యదర్శనం అయిందని మా అమ్మకు చెప్పేందుకై పిల్లలమంతా సూర్యుని కోసం నిరీక్షిస్తూ డాబా మీద నిలబడి హఠాత్తుగా సూర్యుడు