పుట:సత్యశోధన.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రయోగాలను వివరించడమే నా లక్ష్యం. నా గుణగణాలను వర్ణించుకోవాలనే కోరిక నాకు తిలమాత్రమైనా లేదు. ఏకొలబద్దతో నన్ను నేను కొలుచుకోవాలని భావిస్తున్నానో, ఏ కొలబద్దను మనమంతా ఉపయోగించవలసిన అవసరం వున్నదని నమ్ముతున్నానో ఆ కొలబద్ద ప్రకారం క్రింది సూక్తిని ఉటంకిస్తున్నాను.

మో సమ్ కౌన్ కుటిల్ ఖల్ కామీ?
జిన్ తన్ దియో తాహి బిసరాయో
ఐసో సమక్ హరామీ. (సూరదాసు)

(నావంటి కుటిలుడు, ఖలుడు, కాముకుడు మరొకడెవ్వడుగలడు? ఏ ప్రభువు ఈ తనువును యిచ్చాడో అతనినే మరిచాను. నేను అంతటి కృతఘ్నుణ్ణి) నేను ఎవరినీ నా శ్వాసోచ్చ్వాసలకు ప్రభువని భావిస్తున్నానో, ఎవరి ఉప్పు తిని బ్రతుకుతున్నానో, ఆ ప్రభువుకు యింకా దూరంగా వున్నాననే బాధ ప్రతిక్షణం నన్ను వేధిస్తూవున్నది. అందుకు కారణాలైన నాయందలి వికారాలను చూడగలుగుతున్నానే కానీ ఇంకా తొలగించుకోలేకపోతున్నాను.

ఇక ముగిస్తున్నాను. ప్రస్తావనయందు సత్యశోధనలకధ లో ప్రవేశించను. ఆ కధంతా ముందు ప్రకరణాల్లో వివరిస్తాను.

ఆశ్రమం, సబర్మతి
ది, 26 నవంబరు 1925

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ

XXII