పుట:సత్యశోధన.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

201

ఒక రోజున రెండు గొప్ప కానుకలు వచ్చాయి. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. పిచ్చివానివలె అటుయిటు తిరుగుతూ జాగారం చేశాను. ఏమి చేయాలో పాలుబోలేదు. వేల కొద్ది రూపాయలు తీసుకోకుండా వుందామంటే కష్టంగానే వుంది. తీసుకుందామంటే అంతకంటే కష్టంగా వుంది.

ఈ కానుకలు నేను జీర్ణం చేసుకోవచ్చు. కాని నా భార్యా బిడ్డల పరిస్థితి ఏమిటి? వాళ్ళు కూడా ప్రజాసేవకు అలవాటు పడుతున్నారు. సేవకు విలువ కట్టకూడదని రోజూ వారికి నూరి పోస్తున్నాను. ఇంట్లో ఖరీదైన నగలు వుంచడం మానుకున్నాను. ఇంటిలో మితంగా ఖర్చు పెట్టడం అలవాటు అవుతున్నది. అట్టి స్థితిలో బంగారు గడియారాలు, బంగారు గొలుసులు యింట్లో ఎలా ఉంచడం? వజ్రాల ఉంగరాలు ఎలా పెట్టుకోవడం? అప్పటికే నగల వ్యామోహం కూడదని అందరికీ చెబుతూ వున్నాను. అందువల్ల ఈ నగలు, ఉంగరాలు తీసుకొని ఏం చేయను? చివరికి వీటిని ఇంట్లో వుంచకూడదనే నిర్ణయానికి వచ్చాను. పారసీ రుస్తుంజీ మొదలగు వారిని ధర్మ కర్తలుగా ఏర్పాటు చేసి పత్రం వ్రాసి పెట్టుకొని ప్రొద్దున్నే భార్యాబిడ్డలతో సంప్రదించి బరువు దించుకుందామని నిర్ణయించుకున్నాను.

నా భార్యను ఒప్పించడం తేలికపని కాదని తోచింది. అందుకని నా పక్షాన వాదించుటకు నా పిల్లల్ని వకీళ్లుగా నియమించాను. పిల్లలతో మాట్లాడాను.

వాళ్ళు వెంటనే ఒప్పుకున్నారు. “మాకీ నగలతో పనిలేదు. వాటి ఉపయోగం లేదు. ఎవరివి వారికిచ్చి వేయడం మంచిదని మా ఉద్దేశ్యం, మనకు కావలసివస్తే మనం చేయించుకోలేమా?” అని వాళ్ళు అన్నారు.

నాకు సంతోషం కలిగింది. “అయితే మీ అమ్మను ఒప్పించగలరని అనుకుంటున్నాను” అని వాళ్ళతో అన్నాను.

“తప్పక, అది మాపని. ఈ నగలు మా అమ్మ కెందుకు? ఆమె కావాలనేది ఎవరికోసం? మా కోసమే కదా? మేము వద్దంటే ఆమె ఇక ముట్టదు” అని అన్నారు. అయితే అది అనుకున్నంత తేలిక కాదని నాకు తెలుసు.

“ఇవి మీకు అక్కర లేకపోవచ్చును. మీ పిల్లలకు అక్కరలేక పోవచ్చును. పిల్లలదేముంది? మనం ఎలా ఆడిస్తే అలా ఆడతారు. నాకు పెట్టుకోవాలని వున్నదనుకోవద్దు. రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? జనం ఎంతో ప్రేమతో యీ ఆభరణాలు యిచ్చారు. వాటిని తిరిగి వారికివ్వడం సరికాదు.” అంటూ కస్తూరిబాయి వాగ్ధార జోరుగా ప్రారంభించింది. దానితో అశ్రుధార కూడా కలిసింది. అయితే పిల్లలు చలించలేదు. నేనూ చలించలేదు.