పుట:సత్యశోధన.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

174

ఒరిపిడి

నేను అందుకు సమ్మతించాను. నా భార్యాపిల్లలు ఏ బాధలేకుండా రుస్తుంజీ సేఠ్ గారింటికి చేరారు. నేను కెప్టెన్‌గారి దగ్గర సెలవు తీసుకొని లాటన్ గారితో పాటు ఓడదిగి రుస్తుంజీసేఠ్ గారి ఇంటికి బయలుదేరాను. వారి ఇల్లు అక్కడికి రెండు మైళ్ళ దూరాన వున్నది.

మేము ఓడనించి దిగేసరికి కొంతమంది తెల్లదొరల పిల్లలు గాంధీ గాంధీ అంటూ అరుస్తూ చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. అయిదారుగురు చుట్టూ మూగి గాంధీ గాంధీ అని పెద్దగా అరవడం ప్రారంభించారు. లాటన్‌గారు గుంపు పెరుగుతుందేమోనని భావించి రిక్షావాణ్ణి పిలిచారు. రిక్షా ఎక్కడం నాకు యిష్టం లేకపోయినా రిక్షా ఎక్కడానికి సిద్ధపడ్డాను. కాని తెల్లవాళ్లు రిక్షావాణ్ణి చంపివేస్తామని బెదిరించేసరికి అతడు పారిపోయాడు. మేము ముందుకు సాగుతూ వుంటే గుంపు పెరిగి పోసాగింది. నడవడానికి చోటు లేదు. ముందుగా వాళ్ళు నన్ను, లాటన్ గారిని విడగొట్టి వేరుచేశారు. తరువాత నామీద రాళ్ళు, మురిగిపోయిన గ్రుడ్లు విసరడం ప్రారంభించారు. ఎవడో నా తలపాగాను ఎగరగొట్టాడు. కొందరు నన్ను కొట్టడం ప్రారంభించారు. నన్ను క్రిందికి పడత్రోశారు. నాకు స్మృతి తప్పింది. దగ్గరలోనేగల ఇంటి చువ్వలు పట్టుకొని నిలబడ్డాను. అలా నిలవడం కూడా కష్టమైపోయింది. ఇంకా దెబ్బలు తగులుతూనే వున్నాయి.

ఇంతలో అటు పోలీసు సూపరింటెండెంట్ గారి భార్య హఠాత్తుగా వచ్చింది. ఆమె నన్ను ఎరుగును. ఆమె ధైర్యవంతురాలు. త్వరగా వచ్చి నా దగ్గర నిలబడింది. అప్పుడు ఎండలేదు. అయినా ఆమె గొడుగు తెరిచి నాపై పట్టింది. దానితో గుంపు కొంచెం ఆగింది. నన్ను కొట్టాలంటే ముందు ఆమెను కొట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆవిధంగా నన్ను ఆమె కమ్మి వేసింది.

ఇంతలో ఒక భారతీయుడు ఇదంతా చూచి పరుగెత్తుకొని పోలీసు ఠాణాకు వెళ్లి సమాచారం అందజేశాడు. పోలీసు సూపరింటెండెంటు నన్ను రక్షించడంకోసం కొంతమంది పోలీసుల్ని పంపించాడు. వారు త్వరగా అక్కడికి చేరుకున్నారు దారిలోనే పోలీసుఠాణా వున్నది. నన్ను ఠాణాలో ఆశ్రయం పొందమని సూపరింటెండెంటు అన్నాడు. నేను అందుకు అంగీకరించలేదు. వారి తప్పు తెలుసుకొని వారే మౌనం వహిస్తారు. వారికి న్యాయబుద్ధికలుగగలదను విశ్వాసం నాకు వున్నది.” అని కృతజ్ఞతతో బదులు చెప్పాను.