పుట:సత్యశోధన.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

175

పోలీసులు నా వెంట వచ్చారు. వారి రక్షణ వల్ల మరేమీ హాని కలుగలేదు. రుస్తుంజీ గారి ఇంటికి చేరాను. నిజంగా నాకు పెద్ద దెబ్బలు తగిలాయి. ఒక చోట పెద్ద గాయం అయింది. ఓడ వైద్యులు దాదీ బరజోర్ గారు అక్కడే వున్నారు. వారు ఓపికతో నాకు సేవ చేశారు.

లోపల శాంతిగానే వున్నది. కాని బయట గొడవ ఎక్కువైంది. తెల్లవాళ్ళు ఇంటి ముందు ప్రోగై “గాంధీని మాకు అప్పగించండి” అని గొడవ చేయడం ప్రారంభించారు. పోలీసు సూపరింటెండెంటు అక్కడికి వచ్చాడు. ఇదంతా చూచి గొడవ చేస్తున్న వాళ్లనెవ్వరినీ ఏమీ అనకుండా వాళ్లందరికీ తలా ఒక మాట చెబుతూ వాళ్ళను అక్కడే నిలబెట్టివేశాడు.

అయినా ఆయన చింతాముక్తుడు కాలేదు. లోపలికి తన మనిషిని పంపి “గాంధీ! నీ మిత్రుని ధనం, ప్రాణం, గృహం, నీ భార్య, నీ బిడ్డలు మరియు నీ ప్రాణం దక్కాలంటే వెంటనే మారువేషంతో ఇల్లు విడిచి వెళ్ళిపొండి” అని వార్త పంపాడు

ఒకే రోజున పరస్పర విరుద్ధమైన రెండు పరిస్థితులు నాకు తటస్థపడ్డాయి. ప్రాణభయం కేవలం కల్పితం అని భావించి లాటనుగారు నన్ను బహిరంగంగా రమ్మన్నాడు. అందుకు నేను అంగీకరించాను. కాని యిప్పుడు ప్రాణభయం ఎదురుగా కనబడుతున్నది. మరో మిత్రుడు అందుకు విరుద్ధంగా సలహా యిస్తున్నాడు. దీనికి నేను సమ్మతించాను. నా ప్రాణాలకు ముప్పు వాటిల్లు నను భయంతో, మిత్రునికి అపాయం కలుగునను భయంతో, నా భార్యా బిడ్డలకు ప్రమాదం కలుగునను భయంతో నేను సమ్మతించానని ఎవరు అనగలరు? మొదట నేను ధైర్యంతో ఓడ దిగి గుంపును ఎదుర్కోవడం. తరువాత మారు వేషంలో తప్పించుకొని వెళ్ళిపోవడం రెండూ ఒప్పిదాలే అని ఎవరు అనగలరు? అయితే ఆయా విషయాల యోగ్యతలను నిర్ణయించడం అనవసరం. ఈ విషయాలను పరిశీలించి, యిందువల్ల నేర్చుకోవలసింది ఏమైనా వుంటే నేర్చుకోవడమే మంచిది. ఒకడు ఒక్కొక్క సమయంలో ఎలా ప్రవర్తిస్తాడో చెప్పడం కష్టం. మానవుని బాహ్యాచరణను మాత్రం గమనించి అతని గుణగణాల్ని నిర్ణయించడం సరికాదని, అది అసమగ్రమని మనం గ్రహించాలి.

ఇక నేను పలాయనానికి పూనుకొన్నాను. దెబ్బల బాధ మరచిపోయాను. నల్లపోలీసు వేషం వేశాను. తలపై దెబ్బలు తగులకుండా ఇత్తడి సిబ్బి పెట్టుకొని దాని మీద మద్రాసు ఉత్తరీయం తలపాగాగా చుట్టి బయలుదేరాను. నావెంట యిద్దరు పోలీసు గూఢచారులు వున్నారు. అందొకడు భారతీయ వర్తకుని వేషం వేశాడు లేక