పుట:సత్యశోధన.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

152

తిరుగు ప్రయాణం

వున్నారేమోనని విచారించాను. ఒక మున్షీ దొరకగా ఆయన వద్ద మా ఉర్దూ చదువు బాగానే సాగింది. నాతోబాటు ఒక ఆంగ్ల ఉద్యోగి కూడా ఉర్దూ నేర్చుకోవడం ప్రారంభించాడు. అతడి జ్ఞాపకశక్తి గొప్పది. ఉర్దూ అక్షరాలు గుర్తించటం నాకు కష్టమైంది. కాని అతడు ఒక్క సారి అక్షరం చూచాడో యిక దాన్ని మరచిపోడు. నేను చాలా కష్టపడ్డాను, కాని అతణ్ణి మించలేకపోయాను.

అరవం నాకు బాగానే వచ్చింది. గురువులేడు. అయినను గురువు అవసరం లేనంతగా ఆ తమిళ భాషా శిక్షణ వ్రాయబడింది. ఇండియాకు వచ్చిన తరువాత తమిళం బాగా నేర్చుకోవాలని భావించాను. కాని సాధ్యం కాలేదు.

1893వ సంవత్సరం దాటిన తరువాత నేను పనులన్నీ జైళ్లలోనే చేశాను. అరవం దక్షిణ ఆఫ్రికా జైల్లో నేర్చుకున్నాను. ఉర్దూ యరవాడ జైల్లో నేర్చుకున్నాను. అరవం మాత్రం మాట్లాడే అభ్యాసం నాకు కలుగలేదు. చదవడం వచ్చినా వాడకం లేనందున అది తుప్పు పట్టినట్లు అయింది. ఇందుకు కడు విచారంగా వుంది. దక్షిణ ఆఫ్రికాయందలి మద్రాసు సోదరులకు నేనంటే ప్రాణం. నాకు వారెల్లప్పుడూ గుర్తుకు వస్తూ వుంటారు. ఎక్కడైనా తమిళుడుగాని, తెలుగువాడు కాని కనిపించితే వారిశ్రద్ధ, వారి స్వార్ధ త్యాగం గుర్తుకు రాకుండా వుండవు. వారంతా నిరక్షరులు. అక్షరం రానివారే అక్కడి పోరాటంలో పాల్గొన్నారు. ఆ పోరాటం బీదల కోసం సాగింది. పోరాటం జరిపినవారు పూర్తిగా బీదవారే.

అమాయకులు, యోగ్యులగు భారతీయుల హృదయాన్ని చూరగొనడానికి నాడు వారి భాష రాకపోవడం అడ్డంకి కాలేదు. వారికి హిందుస్తానీ ఇంగ్లీషు కొద్దికొద్దిగా వచ్చు. అందువల్ల మా పనికి అడ్డంకి కలుగలేదు. వారి ప్రేమకు బదులుగా అరవం నేర్చుకోవాలని భావించాను. నాకు అరవం కొంత కొంత అర్ధం అవుతుంది. ఇండియాలో తెలుగు నేర్చుకుందామని ప్రయత్నించాను. కాని తెలుగులో అక్షరాలు దాటి చదువు ముందుకు సాగలేదు.

ఈ విధంగా అరవం, ఆంధ్రం చక్కగావచ్చే భాగ్యం నాకు కలుగలేదు. బహుశా యిక నేర్చుకోలేనుకూడా. కనుక ద్రావిడులు హిందుస్తానీ, నేర్చుకోగలరని ఆశ పెట్టుకున్నాను. దక్షిణ ఆఫ్రికాలోని మద్రాసు ద్రావిడులు కొద్దిగానో, గొప్పగానో హిందీ మాట్లాడతారు. అయితే దేశభాషాపఠనం వల్ల తమ ఆంగ్ల భాషా జ్ఞానానికి ఇబ్బంది కలుగుతుందేమోనని ఇంగ్లీషు వచ్చినవాళ్లు మాత్రమే భావిస్తున్నారు. దేశ భాషల్ని వారే ఆదరించడం లేదు.