పుట:సత్యశోధన.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

153

శాఖాచంక్రమణం చేశాను. సింహావలోకనం చేసి నాప్రయాణ కథను ముగిస్తాను. పొంగోలా స్టీమరు కెప్టెనును గురించి చెప్పడం మిగిలివుంది. మేము మిత్రులం అయ్యాము. అతడు ప్లీమత్ సోదర సంప్రదాయం వాడు. సముద్రయానాన్ని గురించిన ప్రసంగం కంటే ఆధ్యాత్మిక ప్రసంగమే మా మధ్య జరుగుతూ వుండేది. అతడు నీతికి, జ్ఞానానికి (ధర్మానికీ) భేదం కల్పించేవాడు. అతని దృష్టిలో బైబిలు బోధ శిశుక్రీడ వంటిది. భాషా సౌలభ్యాన్ని బట్టి దాని గొప్పతనం అపారం. బాలురుగాని, స్త్రీలుగాని, పురుషులు గాని జీససునందును, అతని బలిదానము నందును విశ్వాసం వుంచితే వారి పాపాలు నశించిపోతాయి. యిది ఆయన మాటల సారం. అతని పరిచయం ప్రెటోరియాలోని ప్లీమత్ సోదరుణ్ణి గుర్తుకుతెచ్చింది. నీతి యెడ విధి నిషేధాలు గల ఏమతమైనా అతని దృష్టిలో పనికిమాలినదే. ఇంత చర్చకు కారణం శాకాహారమే. మాంసం, ముఖ్యంగా గోమాంసం నేనెందుకు తినకూడదు? భగవంతుడు శాకాల వలెనే పశు పక్షుల్ని కూడా మనుష్యుని ఆనందం కోసం, ఆహారం కోసం సృజించలేదా? ఇట్టి ప్రశ్నల వల్ల మేము ఆధ్యాత్మిక ప్రసంగంలోకి దిగక తప్పలేదు.

ఈ విధంగా 24 రోజులు నా ఆనందయాత్ర సాగింది. హుగ్లీనది సౌందర్యం చూచుటకు కలకత్తా రేవులో ఓడదిగాను. ఆనాడే రైల్లో బొంబాయి బయలుదేరాను.

25. హిందూదేశంలో

కలకత్తా నుండి బొంబాయికి వెళ్లేదారిలో మధ్య ప్రయాగ ఉంది. అక్కడ రైలు 45 నిమిషాలు ఆగుతుంది. ఆ సమయంలో పట్నం చూడాలని కోరిక కలిగింది. అదీగాక ఒక మందు కావలసి వచ్చింది. మందులు అమ్మే కెమిస్టు అర్ధ నిద్రావస్థలో వున్నాడు. మందివ్వడానికి బాగా ఆలస్యం చేశాడు. నేను స్టేషను చేరేసరికి రైలు బయలుదేరింది. ఆ స్టేషను మాష్టరు మంచివాడు. నాకోసం ఒక్క నిమిషం సేపు రైలును ఆపివుంచాడు. అయితే నేను రాకపోవడం చూచి నా సామాను క్రిందికి దింపించివేశాడు.

కెల్‌సర్ హోటల్లో ఒక గది తీసుకొని ఆ పట్నంలో వెంటనే నా పని ప్రారంభించాను. ప్రయాగయందలి “పయోనీర్” అను పత్రిక యొక్క ఖ్యాతిని గురించి వినియున్నాను. భారతీయుల కోరికలకు వ్యతిరేకంగా ఆ పత్రిక వ్రాస్తూ వుంటుందని విన్నాను. అప్పుడు డాక్టరు చేజనీగారు ఆ పత్రికకు ఉపసంపాదకులని గుర్తు. అన్ని పక్షాల వారి సాయం నాకు అవసరమని భావించి ఆయనకు ఒక చీటీ పంపించాను. రైలు బండి