పుట:సత్యశోధన.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

82

జీవనయాత్ర

పాటించేవాణ్ణి. మా అత్తమామలుగాని, అక్కబావలుకాని నన్ను భోజనానికి పిలిస్తే వాళ్లను వెలివేయవచ్చు. అందువల్ల నేను వాళ్ళ యిళ్ళలో మంచి నీళ్ళు కూడా పుచ్చుకొనేవాణ్ణి కాదు. మావాళ్లు చాటుమాటుగా మాతో కలుద్దామని చూచేవారు కాని నేను అంగీకరించేవాణ్ణి కాను. ఏది చేసినా బహిరంగంగా చేయాలిగాని చాటుమాటుగా చేయకూడదని నా అభిప్రాయం.

నేను జాగ్రత్తగా వున్నందువల్ల కులం వాళ్లు నా జోలికి రాలేదు. నన్ను వెలివేసిన వారిలో చాలామందికి నేనంటే అమిత ప్రేమ. మా కులానికి ఏదో చేస్తానని భావించకుండానే వారు నా ప్రయత్నానికి ఎంతగానో సహకరించారు. నా పనుల వల్ల యిట్టి సత్ఫలితం కలిగిందని నా విశ్వాసం. వెలివేసిన వారికి వ్యతిరేకంగా నేను వ్యహరించినా, స్వపక్షీయుల్ని కలుపుకొని రగడ ప్రారంభించినా వ్యవహారం ముదిరేదే. ఆంగ్ల దేశాన్నుంచి రాగానే యీ గొడవల్లో పడివుంటే నేను ఏదో కపటవేషం వేయక తప్పేదికాదు.

మా దాంపత్యం యింకా నేననుకున్నట్లు కుదుటపడలేదు. నేను ఆంగ్లదేశం వెళ్లిన తరువాత కూడా నా ద్వేష దుష్ట స్వభావం నన్ను విడిచి పెట్టలేదు. అడుగడుగునా తప్పులెన్నో జరిగాయి. నా స్వభావం యధాప్రకారంగానే వున్నది. అందువల్ల నా కోరిక నేరవేరలేదు. నా భార్యకు చదువు గరపాలి. కాని నా కామోద్రేకం అందుకు అడ్డుగా వున్నది. లోపం నాది. కాని కష్టం అనుభవించింది ఆమె. ఒకసారి ఆమెను పుట్టింటికి పంపివేయడానికి కూడా సిద్ధపడ్డాను. అనేక కష్టాలపాలు చేసిన తరువాతనే ఆమెను దగ్గరకు రానిచ్చాను. కొంత కాలానికి తప్పంతా నాదేనని గ్రహించాను.

మా బాలుర విద్యాభ్యాసాన్ని సంస్కరించాలని పూనుకున్నాను. మా అన్నగారికి పిల్లలు వున్నారు. ఆంగ్లదేశం వెళ్లక పూర్వం నాకు పిల్లవాడు పుట్టాడు. వాడికి యిప్పుడు నాలుగేండ్లు. వీళ్ల చేత కసరత్తు చేయిoచి వీళ్లను వజ్రకాయుల్ని చేయాలని, ఎప్పుడూ నా కనుసన్నల్లో వాళ్లను వుంచుకొని పెంచాలని భావించాను. మా అన్నగారు అందుకు అంగీకరించారు. అందువల్ల యీ విషయంలో నాకు సాఫల్యం లభించింది. పిల్లలతో కలసి వుండటం నాకు యిష్టం. పిల్లలతో ఆడుకోవడం, పిల్లలతో నవ్వులాడటం అంటే నాకు యిప్పటికీ యిష్టమే. నేను పిల్లలకు మంచి ఉపాధ్యాయుణ్ణి కాగలిగానని నా విశ్వాసం.

అన్నపానీయాల విషయంలో సంస్కరణ అవసరమని భావించాను. మా యింట్లో కాఫీ, టీలు ప్రవేశించాయి. నేను ఇంగ్లాండు నుండి తిరిగి వచ్చేసరికి మా