పుట:సత్యశోధన.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

83


ఇంటికి ఆంగ్ల దొరల గృహ పోలికలు ఏర్పడేలా చూడాలని మా అన్నగారు భావించారు. అందుకోసం ఇంట్లో పింగాణీ సామాను పెరిగిపోయింది. కాఫీ, టీలకు బదులు కోకో, వరిగ పిండి జావల్ని ప్రవేశ పెట్టాను. పేరుకు మాత్రమే యీ మార్పుగాని, యివి కూడా కాఫీ టీలకు తోడయ్యాయి. మేజోళ్లు ముందే ప్రవేశంచాయి. యిక నేను కోటు, ఫాంటు ధరించి మా ఇంటిని పావనం చేశాను.

దానితో ఇంటి ఖర్చు పెరిగిపోయింది. ప్రతిరోజూ ఏవేవో క్రొత్త వస్తువులు రాసాగాయి. తెల్ల ఏనుగు చందాన మా పరిస్థితి మారింది. కాని ఆ తెల్ల ఏనుగుకు మేత కావాలి కదా? అది ఏదీ? రాజకోటలో వృత్తి ప్రారంభించడం నాకు యిష్టం లేదు. వకీలుకు వుండవలసిన జ్ఞానం నాకు లేదని తెలుసు. ఫీజు మాత్రం పెద్ద వకీళ్లంతగా లాగాలని ఉబలాటం. వ్యాజ్యానికి నన్ను కుదుర్చుకునే మూర్ఖుడెవడు? ఒకవేళ ఎవడైనా వున్నా నా తెలివి తక్కువకు తోడు నా అహంకారాన్ని కూడా కలిపి మొత్తం భారం నెత్తిన వేసుకోవాలిగదా !

బొంబాయి వెళ్లి అక్కడ హైకోర్టులో కొంత అనుభవం గడిస్తూ, హిందూలా చదువుతూ, వ్యాజ్యాలతో, కొంతకాలం గడపడం మంచిదని మిత్రులు సలహా యిచ్చారు. ఆ ప్రకారం నేను బొంబాయి వెళ్లాను.

ఇల్లు తీసుకున్నాను. వంటవాణ్ణి పెట్టుకున్నాను. నాకు అతడు తగినవాడే. బ్రాహ్మణుడు. అతణ్ణి నేను నౌకరుగా భావించలేదు. కుటుంబంలో ఒకడిగా భావించాను. అతడు లింగం మీద నీళ్లు పోసినట్లు ఒంటిమీద నీళ్లు పోసుకునేవాడు. ఒళ్లు తోముకోడు. మడిపంచ మురికిగా వుండేది. జందెం మడ్డిగా వుండేది. శాస్త్రజ్ఞానం శూన్యం. నాకు యింతకంటే మంచి వంటవాడు ఎట్లా దొరుకుతాడు?

“ఏమండీ రవిశంకర్‌గారూ! మీకు వంట చేతకాకపోతే మానె. రెండు సంధ్యావందనం ముక్కలైనా రాకపోతే ఎలాగండీ!”

“అయ్యా! సంధ్యావందనమా! నాకు నాగలే సంధ్య. ఫాఆరే నిత్య కర్మ, ఏదో మాదిరి బ్రాహ్మణ్ణి. మీ అనుగ్రహం వల్ల బ్రతుకుతున్నాను. మీరు కాదంటే నాచేతి ముల్లుకర్ర మళ్లీ పుచ్చుకుంటాను.”

నేను రవిశంకర్‌కు గురుత్వం వహించాను. నాకు అంతా తీరికేగదా! సగం వంట నేనే చేసేవాణ్ణి. శాకాహారం తయారుచేయడంలో దొరల పద్ధతిని ప్రవేశ పెట్టాను. ఒక స్టౌ కొన్నాను. ఎవరితోనైనా సరే సహపంక్తి భోజనానికి నేను సిద్ధమే. రవిశంకర్‌కూ యిబ్బంది లేదు. మా యిద్దరికీ జోడు కుదిరింది. అయితే ఒక చిక్కు వచ్చిపడింది.