పుట:సత్యశోధన.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండవ భాగం

1. రాయచంద్ భాయి

బొంబాయి రేవు దగ్గర సముద్రం అల్లకల్లోలంగా వున్నదని గత ప్రకరణంలో వ్రాశాను. జూన్, జూలై మాసాల్లో అరేబియా సముద్రం అల్లకల్లోలంగా వుండటం సహజం. ఓడలో వాళ్ళంతా జబ్బుపడ్డారు. నేను మాత్రం జబ్బు పడలేదు. డెక్ మీద వుండి సముద్రంలో రేగిన తుఫానును చూస్తూ వున్నాను. ప్రొద్దుటి భోజనంలో నాతోబాటు యిద్దరు ముగ్గురు పాల్గొన్నారు. పళ్లాలు జాగ్రత్తగా పట్టుకొని వరిగల పిండితో తయారైన గంజి త్రాగుతున్నాము. పళ్లెం జాగ్రత్తగా పట్టుకోకపోతే అది తన దారి తాను చూచుకొనే స్థితిలో వుంది. తుఫాను అంత తీవ్రంగా వుందన్నమాట.

బయటి తుఫానుకు, నాలో వీస్తున్న తుఫానుకు భయపడని నేను లోపలి తుఫానుకు చలించనని పాఠకులకు బోధపడేవుంటుందని భావిస్తున్నాను. బొంబాయి చేరి ఇంటికి వెళ్లగానే కుల బహిష్కారం సిద్ధంగా వున్నది. ప్లీడరు వృత్తికి నేను తగనని గతంలో వ్రాశాను. నేను సంస్కర్తను. కనుక ఏఏ విషయాలు ఏఏ విధంగా సంస్కరించాలా అని ఆలోచించసాగాను. కాని తర్కానికి కొరుకుడు పడని కొన్ని సమస్యలు నాకోసం ఎదురుచూస్తున్నాయి.

నన్ను కలుసుకునేందుకు మా పెద్దన్నగారు బొంబాయి రేవు దగ్గరకు వచ్చారు. డా. మెహతాగారితోను, వారి పెద్దన్నగారితోను ఆయనకు అదివరకే పరిచయం ఏర్పడింది. డా. మెహతాగారు తమ ఇంటికి రమ్మని గట్టిగా పట్టు పట్టడం వల్ల మేమంతా వారి ఇంటికి వెళ్ళాము. ఆంగ్లదేశంలో ఏర్పడిన మా పరిచయం వృద్ధి అయింది. ఇక్కడ గల వారి కుటుంబానికీ, మా కుటుంబానికీ సంబంధాలు బాగా పెరిగాయి.

మా “అమ్మ”ను త్వరగా చూడాలని తహతహప్రారంభమైంది. కాని ఆమె లోకాన్ని వీడిపోయిందను వార్త మా అన్నగారు ముందు నాకు తెలియచేయలేదు. ఓడ దిగిన తరువాత చెప్పారు. నేను సూతక స్నానం చేశాను. నేను ఇంగ్లాండులో వున్నప్పుడే ఆమె చనిపోయింది. యీ సంగతి తెలిస్తే బాధపడిపోతానని మా అన్నగారు నాకు తెలియజేయలేదు. యి వార్త విన్నప్పుడు నాకు అపరిమితమైన దుఃఖం కలిగింది.

78