పుట:సత్యశోధన.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకధ

79

ఏడుపు పెల్లుబికింది. కాని యిప్పుడు యిక ఆ గాధ అప్రస్తుతమే కదా! మా తండ్రిగారు గతించినప్పుడు కలిగిన వ్యధకంటే యిది అత్యధికం. నా కోరికలన్నీ గొంతెమ్మ కోరికలే అయ్యాయి. కాని అప్పుడు దుఃఖానికి కళ్ళెం వేసుకున్నట్లు గుర్తు. నేను కంట తడిబెట్టలేదు. మా అమ్మగారు చనిపోనట్లే వ్యవహరించి, నా వ్యవహారాలు నేను చక్కదిద్దుకోసాగాను. డా. మెహతాగారు చాలామందిని నాకు పరిచయం చేశారు. వారిలో దేవాశంకర్ జగజీవన్‌గారు ఒకరు. వారి మైత్రి యావజ్జీవిత మైత్రిగా మారింది. అప్పుడే మెహతాగారు నాకు రాయచంద్ కవి లేక రాజచంద్ర కవిగారిని పరిచయం చేశారు. వీరు డా. మెహతాగారి పెద్దన్న గారి అల్లుడు. దేవా శంకర్ జగజీవన్‌గారి నగల దుకాణంలో భాగస్వామి. నాకు వారితో పరిచయం కలగడం పెద్ద విశేషం. వారికి అప్పుడు ఇరవై అయిదేండ్లు. చూడగానే వారు నిర్మల చరిత్రులని, విద్వాంసులని తెలుసుకోగలిగాను. వారు శతావధానులు. డా. మెహతా గారు రాజచంద్ర కవిగారి ధారణా పటిమను కొంచెం చూడమని చెప్పారు. నాకు వచ్చిన పాశ్చాత్య భాషాపాండిత్యాన్ని అధికంగా ఆయన ముందు ఉపయోగించాను. నేనెట్లా చదివితే రాజచంద్ర కవిగారు అట్లా చదివారు. ఆయన సామర్ధ్యం చూచి నేను తట్టుకోలేకపోయాను. ధారణ, శతావధానం, అను శక్తులకు నేను ముగ్ధుడిని కాలేదు. నన్ను ముగ్ధుణ్ణి చేసిన విశేషం తరువాత బోధపడింది. అది వారి విశాల శాస్త్రజ్ఞానం. నిర్మలమైన వారి నడత. ఆత్మజ్ఞానం యెడ వారికి గల తీవ్రమైన తపన, యీ చివరి దానికోసమే వారు తన జీవితాన్ని వినియోగించారని తరువాత తెలిసింది. శ్రీముక్తానందుడు రచించిన క్రింది ఛందం ఆయన సదా స్మరిస్తూ వుండేవారు. వారి హృదయంలో యీ గేయం అంకితమై పోయింది.

హనుతాం రమతాం ప్రగట హారి దేఖుంరే, మారుం జీవ్యూం సఫల తవ లేఖుంరే,
ముక్తానందనో, నాధ విహారీరే. ఓధా జీవనదోరీ అమారీరే.

(నవ్వుతూ ఆడుతూ పాడుతూ ప్రతిపనిలో హరిని దర్శించితేనే నా జీవితం ధన్యమని భావిస్తాను. నా ప్రభువు భగవంతుడే. ఆయనే నా జీవితానికి సూత్రం. యిది ముక్తానందుని కథనం). ఆయన వ్యాపారం లక్షలమీద సాగుతున్నది. ముత్యాల, వజ్రాల, రత్నాల వ్యాపారమందతని ప్రజ్ఞ అసామాన్యం. ఎంతటి చిక్కు సమస్యనైనా యిట్టే పరిష్కరించగల శక్తి ఆయనకు వుంది. కాని నిజానికి బుద్ధి లౌకిక వ్యవహారాల్లో చిక్కుకొని వుండిపోలేదు.