పుట:సత్యభామాసాంత్వనము.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యభామాసాంత్వనము

     సదయునిఁ గనుఁగొని యావిభు
     పదములపై వ్రాలి సోలి భగ్నాశయయై.

తే. మదిని నెలకొన్న రుక్మణిమాయఁ దగిలి
     కలనఁ గై వచ్చుజయలక్ష్మివలనఁ జిక్కి
     మఱియు వేవేలుచెలువలమరులఁ గెరలి
     నన్ను రానిత్తువా నీవు నలిననాభ.

క. కాంతల నందఱ మును శు
     ద్ధాంతమునకు ననిచి నాగృహమునకు నీ వే
     కాంతమున వచ్చి కలియుట
     యెంతయు బలవంత మనుచు నెఱుఁగఁగనైతిన్.

మ. అని ప్రాణేశ్వరునేర మెంచ నవలాలాడన్ జెలుల్ భోజనం
     దన నీక్షింపుము ముంగట న్నగుచుఁ గాంత ల్గొల్వఁగా నున్న దం
     చును చేఁ జూపినఁ జూచి నవ్వి సఖి యంచుం జేయి చేయూఁతగాఁ
     జనుచున్ బంగరుమెట్లవెంబడిని రంజన్మంజుమంజీరయై.

సీ. చెలువునిపై బాళి సెలవుముట్టినజాలి
                    మొలక లెత్తువిరాళిమోహరించ
     వెడనడలహొరంగు విడికమ్మలమెఱంగు
                    గ్రమ్ముగుబ్బలపొంగు ముమ్మరించ
     కలకఁబాఱినయేపు తొలఁకఁబాఱినవైపు
                    తలిరువిల్తునితూపు తారసించ
     చిగురువాతెరటెక్కు చికిలిచూపులచొక్కు
                    చిఱున వ్వొలయుచెక్కు జేవురించ
తే. చెలులు మునుమున్నుగా నేఁగి కలువరేకు
     సెజ్జ హవణించ మెల్లనఁ జేరి శిశిర
     మారుతోదారతుహినకాసారతీర
     చంచదుద్యానసీమ నాసత్యభామ.

వ. తదనంతరకథావృత్తాంతం బెట్టి దనిన.