పుట:సత్యభామాసాంత్వనము.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

సత్యభామాసాంత్వనము

ఉ. సారసనేత్ర లారతు లొసంగ వసంతము చెల్వు కొల్వుసిం
     గారముల న్సడల్చి యట గ్రక్కునఁ దా జలకంబు లాడి క
     న్గోరుల రావిరేకపని గోణము గట్టుచుఁ జల్వఁ దాల్చి యం
     భోరుహనేత్రుఁ డందముగ మోమునఁ గప్రపుబొట్టుఁ బెట్టుచున్.

క. లోలాక్షియుఁ దోడనె హా
     జీలై రా నారగించి చేఁ దొలఁచి రుమాల్
     పూలును కలపము తగ బా
     గాలాకుమ్మడపు లొసఁగఁ గైకొని యంతన్.

శా. శృంగారించుక శౌరి చంద్రముఖిమైసింగారముం జూచి యు
     ప్పొంగున్ డెందముతోడఁ జూపులు నయంబుల్ చాలఁ జేకూర సా
     రంగాక్షుల్ తన సైగ దెల్సి వెలిదేరన్ వేడ్క నాయంగనా
     నంగాయోధనసాధనప్రమదధన్యస్నేహసన్నాహుఁడై.

సీ. పటికపుకీల్బొమ్మ చిటికయొద్దికఁ జిల్
                    గుటికలపల్లకీ గొనుచు నినుచు
     సురటిరెక్కలగాలి సోఁకులనేమొస
                    గొడిగెడు సకినలగుంపు నింపు
     [1]సద్దుసద్దన నారజంపు మంపులనింపు
                    జగజంపుజంత్రంపుజతలకూకి
     కవలకుత్తుక హత్తు కవకవకివకివ
                    రవలతో మరుచివ్వ బవిరి దీర్చ
తే. నవులపుంజెందుచందువాతొవలపొంగు
     తుమ్మెదయెలుంగుశ్రుతి గ్రమ్ము కమ్మపైఁడి
     ఢక్క ఘుమకారముల మేలిగ్రుక్క లీను
     హరువు మురువైన శయ్యాగృహమ్ములోన.

  1. సద్దుముద్దుల నార