పుట:సత్యభామాసాంత్వనము.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

సత్యభామాసాంత్వనము

     మల్లాడం దగునిండుపైడికడవల్ మౌళిస్థలిం బూనుచున్
     చల్లో చల్లని చల్ల యమ్ముదురు నిచ్చల్ గొల్లచాన ల్పురిన్.

ఉ. ఆపుర మేలు యాదవకులాగ్రణి దిగ్రణితోగ్రభూరిభే
     రీపటలామరారినగ రీయుగరీణశరీరవీరని
     ర్వాపణగర్వనిర్వహణరంగదభంగరథాంగవిక్రమో
     ద్దీపనభూష్ణుఁ డాహవవధిష్ణుఁడు కృష్ణుఁడు సర్వజిష్ణుఁడై.

శా. ఆకంసాసురవైరి యష్టమహిషీవ్యాపారజాపారలీ
     లా[1]కూపారనిమగ్నమాసససముద్యత్కామవిద్యాపరీ
     పాకంబు ల్మెఱయంగ రం గయినమేల్బంగారపున్ సజ్జలో
     లోకాతీతవిహారుఁడై మదవతు ల్గొల్వంగఁ గొల్వుండఁగన్.

వ. తదనంతరకథావిధానం బెట్టిదనిన.

మ. సరసాసంగర సంగరస్ఫుటమహాసంధాన సంధానతా
     దిరమాభూషిత భూషితస్తుతిగతాదృకర్ణ దృక్కర్ణకుం
     జరవాగానన గాననవ్యసుయశఃసామ్రాజ్య సామ్రాజ్యసి
     క్తరసాస్యందన స్యందనర్ధరిపుభాక్కాంతారకాంతారసా.

క. రూక్షాలాపవిరక్షణ
     కుక్షింభరఖలవిపక్షకుంజరసమ్రా
     డ్వక్షశ్శీర్షక్షేపణ
     దీక్షాహర్యక్ష పాండ్యదేశాధ్యక్షా!

క. అద్వైతమతాధారా
     మృద్వంగీనుతవిహార మేదురసారా
     సద్విజయకీర్తిధారా
     విద్వన్మందార ముద్దువీరకుమారా!

  1. కూపారసమగ్న