పుట:సత్యభామాసాంత్వనము.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

7

     విరసించు నెట్టిభూవరు నైన ననిఁ జెండు
                    సాధుగోష్ఠిని ప్రొద్దు జరపుచుండు
తే. నిలను గావునఁ జక్రవర్తులును రాజు
     లార్గురు పదార్గురును గాని యన్యు లెనయె
     యనఁగ సుగుణసమష్టిచే నతిశయిల్లు
     సరససులభుండు ముద్దులళ్ఘరివిభుండు.

సీ. తనదానజలలీల తటవతీతమహాం
                    బుధులకు నెడలేని పొందు గాఁగ
     తనరమ్యతరయశోధవళిమ యామినీ
                    వరునిబింబమునకు మెఱుఁగు గాఁగ
     తనతేజ మిలఁ జుట్టుకొనుగట్టు పెన్నెఱుల్
                    మొగ్గరంబుల విచ్చుమొగ్గ గాఁగ
     తనప్రతిభారూఢి వనజసంభవశేష
                    వాల్మీకులకు మేలుబంతి గాఁగ
తే. తనమనోవర్తనము నెన్నధరణికన్య
     కామణీదాశరథిపాదకమలబంభ్ర
     మద్భ్రమరలీల నలు వొంద మహిని వెలసె
     సరిజనవిదారి ముద్దులళ్ఘరిమురారి.

వ. వెండియు నఖండపాండిత్యమండితఖండపరశుకుండలకుండలి
     కులాఖండలదిఙ్మండలవేదండపాండురకిటికమఠవిభుశుభాపాదనప్రచండబల
     సముద్దండదోర్దండకండుకితతాండవజయరమాకుచకరండహిండమాననవ
     నవప్రవాళమణికాండసమరపరమండలాధిపతిమిరఖండనశౌండమహోచ్చండ
     చండకిరణమండలుండును, పరమర్దనగతమార్దవహృదయదుర్దమమదకర్దమ
     సమ్మర్దవిసృమరసమరహార్దవినర్దమానవిరోధిశిరోధికానిర్దళనదుర్దాంత
     సార్థకపఫణోపమపరుషతరకరఘరట్టఘట్టనతృట్యమానధరణిచత్వర
     తదాత్వవిసృత్వరచక్రికులఫణాక్రాంతనిర్వక్రమణిచూర్ణతాసవర్ణతా
     లబ్ధవర్ణసామంతమహీకాంతగళపరిగళదనర్గళశోణితద్రోణికానిపానసావ