పుట:సత్యభామాసాంత్వనము.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

101

చ. ఎఱుక గలట్టివానివలె నే పని కడ్డము వచ్చి తూఱి లో
     గరువము హెచ్చి నిచ్చలును గామిడివై మమువంటివారితోఁ
     బరుసపుమాట లాడెదవు బాఁపని కేనుఁగుబుద్ధి చాలదో
     గరితల నెన్నువేళ వెలకన్నెలవన్నెల నెన్నఁ బాడియే.

క. జాలము మందులపొందుల
     జాలిం బడఁజేసి తాళజాల మటంచున్
     తేలింతురు [1]వెలజంతలు
     గోలింతురు చేతి సొమ్ము గడెవడిలోనన్.

క. వల పొకచోఁ బిలు పొకచో
     బలుకులు వేఱొక్కచోట భావం బొకచో
     వెలయించువెలమిటారుల
     వల కగపడి [2]మోసపోవువారలు గలరే?

క. మే లెంతురు కులకాంతలు
     తేలింతురు రతులఁ గొంకు దీర్చినకొలఁదిన్
     పాలింతురు కులధర్మము
     తాలిమి పచరింతు రెంత తహతహ యైనన్.

చ. అహరహరేధమానశుభ మన్వయవృద్ధికి సాధుబుద్ధికిన్
     విహితము ప్రేమభావనకు విశ్రుతకీర్తికి నున్కిపట్టునై
     యిహపరసాధకం బగుకులేందుముఖీసుఖ మెంతవానికిన్
     బహుతరజన్మపుణ్యపరిపాకమునన్ ఫలియించు నెంచఁగన్.

సీ. దాక్షిణ్యములగీము లక్షణంబులదీము
                    వ్రతముల యొరగల్లు రహికి నిల్లు
     నెఱితనమ్ములతావు నిక్కువమ్ములప్రోవు
                    కలిమికి దాపు భాగ్యములకోపు

  1. వెలయింతులు
  2. మోసపోవువారు గలరే