పుట:సకలనీతికథానిధానము.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

సకలనీతికథానిధానము


క.

ప్రత్యక్షంబై కేశవుఁ
డత్యాదరణమున బలికె నచ్యుతు నీశున్
నిత్యుని నను గనుగొనుమా
యత్యుత్తమమైన ఫలము లందెద వనినన్.

48


వ.

సర్వాంగాలింగితోర్వీతలంబగు దండప్రణామం బర్పించి యిట్లని స్తుతియించె.

49


చామరము.

నమో గదాబ్జళంఖచక్రనవ్యబాహుపంకజా!
నమః కృపాకటాక్షలబ్ధనాకరాజ్యవైభవా!
నమ స్సమస్తలోకపాలనప్రశస్తమానసా!
నమో రమాధరాంగనాధినాథ! వేంకటేశ్వరా!

50


క.

అని వినుతించి రమేశ్వరు
ననుమతి నచ్చోటఁ గర్చురాగల్పనికే
తనసౌధసాలగోపుర
ఘనవిశ్రుతమంటపములు గట్టించి తగన్.

51


మత్తకోకిల.

మత్తకోకిలకీరనిస్వనమండితక్షితిజాలియున్
నృత్తగీతకళాప్రవీణవనేరుహస్ఫుటనేత్రలున్
హత్తి సేవయొనర్చుదాసులు నాదియైన నియోగమున్
చిత్తసంభవుతండ్రి కర్పణచేసె భక్తి దలిర్పగన్.

52


ఆ.

కట మనంగ బాస కాష్ఠంబు వెంబన
దహననామ మయ్యె ద్రవిడభాష
బాసకటము వెంబభస్మంబు సేయుట
వేంకటాద్రి యనఁగ వెలసెఁ బేరు.

53