Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/846

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆర్థిక ఖనిజములు


కొన్ని ధాతువులు, ఖనిజములు సాధారణ రాసాయనిక విధానముచే వియోగము (Decomposition) చెందకుండుట వలనను, ఇసుక మొదలగు ఇతర వస్తువులకంటే నెక్కువ విశిష్ట గురుత్వము గలిగియుండుట చేతను నీటిలో కొట్టుకొనిపోయి, కొన్నికొన్ని చోట్ల కేంద్రీకరింపబడును. ఇవి చాలవరకు విఘటన చెందిన (Disintegrated) రాళ్ళ నుండి జనించినవి. ఇట్టి ఖనిజ నిధులను నదీనిధులు (Placer or alluvial) అందురు. బంగారము, తగరపు ఖనిజమైన త్రపుజా రేయిజము (కాసిటరైటు Cassiterite) తిరువాన్కూరు, ఆంధ్రతీరముల దొరకు మోనజై టు (Monozite) మొదలగున వీ జాతికి కొంత వరకు చెందినవి.

వీటియడుగున నేర్పడిన రాళ్ళ (Sedimentary rocks) తో గూడిన ఖనిజములుగూడ చాల గలవు. ఇవి సాధారణముగా రకరకములైన రాతిపొరలలో (Sedimentary rocks) నిధులుగా నేర్పడియుండును. వెయిన్ నిధులవలె నివి యెక్కువ యేటవాలుగా నుండవు. కొన్ని నిధులు (మన్ను, ఇసుక ఖనిజములు) నీటిలో కొట్టుకొని వచ్చి యేర్పడినవి. మరికొన్ని నీటిలో రాసాయనిక అవ షేపము (Precipitation) వలన గలిగినవి. (ఉదా: కొన్ని సున్నపురాళ్ళు, లోహఖనిజములు మొదలైనవి.) మరికొన్ని సముద్రజలము ఎండవేడిమిచే ఇగిరిపోయి నందున ఆ జలములో ఇమిడియున్న లవణములు పొరలు పొరలుగా నేర్పడిన నిధులు. ఇట్టి లవణనిధులుగూడ ననేకములున్నవి. సాధారణముగా రాతియుప్పు నిధులు ఎక్కువగా నున్నను, ఒకేచోట అనేక లవణములు పొరలు పొరలుగా నుండుటగలదు. జర్మనీలో స్టాస్ఫర్టు (Stass_ furt) అనుచోటనుండు లవణ నిధులు చాల ప్రసిద్ధి.

ఆంగారిక ఖనిజములుగూడ నీటియడుగున నేర్పడిన శిలలతోనే గలిసియుండునుగాని వాని పుట్టుకలో కొంత వ్యత్యాసమున్నది. పై చెప్పిన ఖనిజములన్నియు చాల వరకు అదివర కే భూమియందుండిన రాళ్ళు ఛిన్నా భిన్నము లగుటవలన ఏర్పడినవి. కాని బొగ్గు మొదలగు ఖనిజములు కోట్ల సంవత్సరముల క్రితము పుట్టి పెరిగిన చెట్లు చేమలు నీళ్ళలో కొట్టుకొనిపోయి, పెద్ద పెద్ద సరస్సులలో పడి యిసుక, మన్నుపొరలతో కప్పబడుటవలన జనించి నవి. అట్టి చెట్లు చేమలు వేరుచోట్లనుండి కొట్టుకొనివచ్చి యిప్పుడు బొగ్గు ఉన్నచోట పూడ్చ బడినవనియు, అచ్చటనే పుట్టి పెరిగి పూడ్చబడినవనియు రెండు భేదాభిప్రాయములు గలవు, ఒక్కొకచోట ఇసుకరాతి పొరల మధ్య చాల బొగ్గుపొర లుండును. ఈ పొరలలో నార్థికముగా నుపయోగించునవి 2-3 నుండి 100 అడుగుల వరకు మందము గలిగియుండును.

పెట్రోలియం నిధులు అంగారక పదార్థములనుండి యుద్భవించిన వనియు, అట్టి వస్తువులలో చెట్లు చేమలేగాక జంతు సంబంధ మైనవిగూడ గలవనియు తెలియుచున్నది. ఇదిగాక పెట్రోలియం అనంగారక వస్తువులనుండి భూమియందే రాసాయనికముగా నుద్భవించినదనికూడ కొందరి యభిప్రాయము. కాని దీని కెక్కువ ఆధారములులేవు. బొగ్గువలెనే పెట్రోలియం కూడ నీటియందు జనించిన శిలలతోనే కలిసియుండును. కాని దీనితో గూడిన రాతిపొరలు, సరంధ్రములు (Porous) గాను, కొన్ని విధములుగా మడతలు పడి (Folded) వంగియుండవలెను. ఇది నీటికంటే తేలికయగుటచే, భూమిలోపలనే నీటిపై తేలుచుండును. పెట్రోలియం నిధుల పైభాగమున పెట్రోలియం వాయువు (Petroleum gas or natural gas) గూడ కొన్నిచోట్ల నేర్పడియుండును.

ఆర్థిక ఖనిజ నిధుల పరిశీలన - వానిని త్రవ్వి తీయు విధానములు  :- ఆర్థిక ఖనిజములను లాభదాయకముగా త్రవ్వి తీయుటకై మొదట ఆయాచోట్లనున్న పలురకములగు రాళ్లను, వాటి గుణములను భూగర్భశాస్త్రరీత్యా పరిశీలించి, పటములు (maps) తయారు చేయుదురు. ఆర్థిక ఖనిజము లున్నవని తెలిసినను, లేక దొరకవచ్చునని యూహించినను తగు స్థలములందు, చిన్న గోతులు (pits) కందకములు, (trenches) త్రవ్విగాని లేక డ్రిల్లింగ్ (drilling) మూలమునగాని వాటి ఉనికి యొక్క వైశాల్యమును పరిశీలించి, ఖనిజముల నిధులు, వాని నిలువ మొదలగు విషయములను సుమారుగా అంచనా వేసి వాటిని త్రవ్వి తీయుటకై గనులేర్పరుచుదురు. అట్టి గనులు, నీరు, రైలుమార్గము లేక యితరబాటలు మొదలుగా గల వసతులన్నియు సరిజూచుకొనిన వెనుకనే, మొదలు పెట్టబడును.