Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/845

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆర్థిక ఖనిజములు


తగురీతి నుండవలెను. అట్టి ఖనిజముల నిధులు దొరకు చోట్లు రాకపోకల కనుగుణ్యముగా నుండు టత్యావశ్యకము.

ఇట్టి విషయములన్నియు నొక సమయమునుండి మరియొక సమయమునకును, ఒక చోటినుండి వేరొకచోటికిని మారుచు నుండవచ్చును గాన ఆర్థిక ఖనిజములుగా నుపయోగింపబడు ఖనిజము అన్ని చోట్లను, అన్ని వేళల యందును లాభకరముగా నుప యోగింపబడజాలక పోవచ్చును. అల్యూమినియం నూటికి 20-25 పాళ్ళు రాసాయనికముగా కలిసియున్న మన్నులు (clays) సాధారణముగా ప్రతిచోటను ఉండునుగాని వానినుండి యా ధాతువును తేలికగా విడదీయు విధాన మింతవరకు కనుగొనబడనందున నవి యార్థిక ఖనిజములు గానేరవు. నూటికి 30 వంతులు లోహము (Iron) గల ఖనిజములు ఉపయోగపడక పోవచ్చునుగాని నూటి కొక్కవంతు ధాతువులున్న తగరపు ఖనిజములను లాభదాయకముగా త్రవ్వి తీయవచ్చును. అట్లే బంగారము, ప్లాటినము, రేడియం, మొదలైన విలువగల ధాతువులు, నిధులలో కొన్ని లక్షలలో నొక వంతు ఉన్నను, అవి లాభదాయకముగ పరిగణింపబడును.

ఇవిగాక, ప్రస్తుత మెందుకు పనికిరావనుకొన్న కొన్ని ఖనిజములు కొంతకాలము తరువాత నెంతో యుపయుక్తము కావచ్చును. ఉదాహరణమునకు మనదేశ మందు అభ్రకపు గనులలో దొరకు బెరిల్ (Beryl) అను ఖనిజము, చాలకాలమువరకు పనికిరానిదిగా పార వేయ బడు చుండెడిది. కాని గత యుద్ధకాలములో దానికి ప్రాముఖ్యము వచ్చినందున, ఇదివరలో త్రవ్విపోసిన రాతికుప్పలనుండి కూడ ఏరితీయుట జరిగినది.

ఆర్థిక ఖనిజవిధులు - వాని నైజములు - పుట్టుక  :- ఆర్థిక ఖనిజనిధులు ప్రకృతిలో పెక్కువిధములుగా నేర్పడి యున్నవిగాని వానిని ముఖ్యముగా రెండు తెగలుగా విభజించవచ్చును. (1) వెయిన్ నిధులు (Vein deposits) (2) పొరల నిధులు (bedded deposits). వీనిలో మొదటివి భూమిలోపలి భాగమునుండి పగుళ్ళద్వారా పైకి ప్రవహించుచు వచ్చిన శిలాద్రవము (magma) మూలమున గాని, చాల వేడిమి, పీడనములతోగూడి అట్లు ప్రవ హించుచు వచ్చిన ద్రావణముల (Solutions) మూలమున గాని యేర్పడినవి. శిలాద్రవము ఘనీభవించునప్పుడు తమతమ విశిష్ట గురుత్వమూలమున వేర్వేరు నిధులుగా నేర్పడిన ఖనిజములలో మాగ్నటైటు (magnetite) క్రోమైటు (Chromite)), ఇల్మెనైటు (Ilmenite) మొదలైనవి.

శిలాద్రవములలో గూడ ననేక విధములయిన ధాతువులు (metals) ఇతర మూలకములు (elements) వాయు రూపమున (gaseous state) గాని, ద్రవరూపమున (fluid state) గాని యిమిడియుండి భూమిలోపల నుంచి కొంత పైకి చొచ్చుకొని వచ్చును చల్లబడుచు నిధులుగా నేర్పడును. ఇట్టి నిధులలో తగరము, టంగ్ స్టన్ (Tungsten) రాగి, సీసము, వెండి, బంగారము మొదలగు ధాతుఖనిములను పేర్కొనవచ్చును. వీటిలో గలసియుండు అనార్థిక ఖనిజము లనేకము గలవుగాని వీనిలో గొన్ని స్ఫటికము (Quartz) చూర్ణిజము (కాల్సైటు - Calcite భూస్ఫటికము (ఫెల్పారు - Felispar) హరిశుల్భిజమ (బేరైట్సు Barytes) మున్నగునవి. ఇదే తెగకు సంబధించిన అలోహ ఖనిజములలో అభ్రకము, మెరుగుమట్టి మొదలగునవి యున్నవి. ఇట్టి వేయిన్ నిధులు సాధారముగా భూమిలోకి చాల యేటవాలుగా నుండును.

భూతలమునకు సమీపముననుండు అంతర్జలము కొంతవరకు ఆమ్లపూరితమై యుండుట వలనను, మరి యితర కారణముల వలనను; అదివరలో నేర్పడిన ధాతు ఖనిజములను కరగించుకొని తిరిగి భూమిలో నుండు పగుళ్ళు మొదలగు వానిలో వేరురూపమున ఖనిజ నిధులనుగా నేర్పరచుట జరుగుచుండును. ఇట్లు కేంద్రీకరింపబడి నిధులు మొదటివానికంటె విలువగలవై యుండును. ఇట్లు రెండవతూరి ఖనిజనిధు లేర్పడుట (Seconda enrichment) అనబడును. ఉదాహరణకు రాగి, వెండి గంధకిదములను చెప్పవచ్చును. మరికొన్నిచోట్ల సున్నపు రాయి (Lime stone) మొదలైన రాళ్ళను కరిగించి వాటిస్థానే వేర్వేరు ఖనిజ నిధులను గూడ జేర్చుట జరుగు చుండును. భూమిలో నుండి పైకివచ్చు నీటితోను, ఇతర ద్రావణములచేతను ఈ నిధులేర్పరుపబడు చుండును. ఇట్టి ఖనిజము లేర్పడుట (Metasomatism) అనబడును.