Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/827

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆయుర్వేద గ్రంథములు


సోక్రెటిస్ అనువానికంటె భిన్నుడు కాడనియు, సాహసముగ వ్రాయజొచ్చెను. ఇది చాలా ఆశ్చర్య జనకము. సుమారు 2000 సంవత్సరములకు పూర్వుడుగు బౌద్ధ నాగార్జునుడు తనచే రచింపబడిన 'ఉపాయ హృదయము' అను గ్రంథములో సుశ్రుతాచార్యులను స్మరించి యుండుటచే ఇతడంతకన్న ప్రాచీనుడని తెలియుచున్నది. శాలిహోత్ర సంహితలో వినబడుచున్న సుశ్రుతుడును, ఇతడును ఒకరు కారని నిరూపించుచున్నారు. కనిష్కుని పౌత్రుడొక సుశ్రుతు డుండెను. తంత్రకర్తయగు సుశ్రుతు డతడేయని కొందరందురు. కాని కనిష్కునికి సమకాలికుడగు నాగార్జునునిచే స్మరింపబడి యంతకుమున్నే తంత్రమును రచించిన సుశ్రుతుడు నాగార్జునునకు పిమ్మట జనించు సుశ్రుతు డగుట యెట్లు పొసగును ? కనుక వీరుభయులును భిన్నులని ధ్రువపరచవలసి యున్నది. వృద్ధ సుశ్రుతుడగు వ్యవహారమున్నది కాని అతని పుట్టుక మొదలగు వివరములు ఎచ్చటను కానరాక పోవుట చేత అతనిని నమ్ముటకు వీలులేదని చెప్పుచున్నారు, ఇది ఆలోచనీయమైన యంశము.

సుశ్రుతసంహితను సంస్కరించినది నాగార్జునుడను విషయము డల్హణుడు వ్రాసినను, సంశయింపవలసిన విషయముగ నున్నదని శ్రీ హేమరాజశర్మగారు తాము కాశ్యప సంహితకు వ్రాసిన యుపోద్ఘాతములో వెల్లడించు చున్నారు. సుశ్రుత సంహిత శకారంభమునకు పూర్వము 1000 సం. కాలమునందు రచింపబడినట్లు శ్రీ శంకర బాలకృష్ణ దీక్షితులు తమ భారతీయ జ్యోతిశ్శాస్త్రేతి హాసమునందు వివరించిరి. దీనియందు సూత్ర, నిదాన, శారీరక చికిత్సా, కల్ప-ఉత్తరము లను వారు స్థానములు కలవు. సూత్రస్థానమున 46, నిదానస్థానమున 16, శారీర స్థానమువ 10, చికిత్సా స్థానమున 40, కల్పస్థానమున 8, ఉత్తరస్థానమున 66, అధ్యాయముల చొప్పున మొత్తము 186 అధ్యాయములు, కలవు.

అష్టాంగ హృదయము:- కాలక్రమమున మనుజుల యల్ప మేధాశక్తులను గమనించి బహుతంత్ర పరిశ్రమ చేయజాల రను అనుకంపచే ఆతి మేధానిధులును, సర్వతంత్ర పారగులును అగు వాగ్భటాది పండితవరేణ్యులు ఆయుర్వేద గ్రంథములను రచించి లోకోపకారము

కావించిరి. ఇవి అనార్షములయ్యు సూక్తి భరితము లగుటచే విద్వజ్జనోపాదేయములై సంప్రదాయా౽ విచ్ఛిన్నముగ పఠన పాఠన ప్రచారము నందుచు, వేనోళ్ళ శ్లాఘింపబడుచున్నవి. ఇట్టి గ్రంథములలో అగ్రస్థానము వహించునది అష్టాంగ సంగ్రహము. దానికంటె సార తరోచ్చయముగ వ్రాయబడిన అష్టాంగ హృదయము గూడ సంగ్రహముకంటె నెక్కువ పండిత వాల్లభ్యము నందుచున్నది. ఈ రెండును సింధుదేశమునందు జన్మించిన సింహగుప్తుడను వైద్యుని కుమారు డగు వాగ్భటునిచే రచింపబడినట్లు తెలియుచున్నది. కాని కొందరు అష్టాంగ సంగ్రహమును హృదయకర్తయగు వాగ్భటుని పితామహుడగు వాగ్భటుడు రచించె నని చెప్పుచున్నారు. ఈ ఉభయమతములకును పండితవరేణ్యుల యండకలదు. శ్రీ కవిరాజు గణనాథ సేనుగారు వీరుభయులు నొకరే యనియు గ్రంథగత శైలి సరిపోవుచున్నదనియును నిర్ణయించి యున్నారు.

వాగ్భటుని జన్మకాలమునుగూర్చి మతభేదములు కలవు. ఇతడు వరాహమిహిరునికి పూర్వకాలికుడని కొందరు (క్రీ. శ. 505 సం. వరాహమిహిరుని కాలము) అంతకు పూర్వము ఒక శతాబ్దమునకాని, సార్ధ శతాబ్దమునగాని వాగ్భటుడుండేనని చెప్పుదురు. గణనాథ సేన్ క్రీ. శ. 5వ శతాబ్దమువాడని నిరూపించుచున్నాడు. యాదవజీత్రికంజీ ఆచార్యగారు క్రీ. శ. 6 వ శతాబ్దములోని వాడని యూహించుచున్నారు. ఇతడు వైదికాచార నిరతుడని చెప్పుటకును, బౌద్ధుడని చెప్పుటకును, గూడ ఈ గ్రంథములో నాధారములు కలవు. ఇతడార్య మతానువర్తియయ్యు రాజశాసన భీతిచే ప్రచ్ఛన్న బౌద్ధుడుగా నుండె నవి కొందరందురు.

ఇతని తంత్రమగు అష్టాంగ హృదయమందును, సంగ్రహమునందును గూడ సూత్ర, శారీర, నిదాన, చికిత్సా, కల్ప, ఉత్తర స్థానము అని యారుస్థానములు కలవు.

అష్టాంగ హృదయమునందు సూత్రస్థానమున 30, శారీర స్థానమున 6, నిదాన స్థానమున 16, చికిత్సా స్థానమున 22, కల్పస్థానమున 6, ఉత్తరస్థానమున 40, అధ్యాయముల చొప్పున "మొత్తము. 120 అధ్యాయ