ఆఫ్రికా
కార్తజీనియను సంస్కృతి వచ్చినప్పటినుండియు లిఖిత చరిత్రమే లభించుచున్నది. కాని ఆఫ్రికాలో యూరోపియనులు ప్రవేశించినప్పటి నుండియు, క్రీ. శ. 15 వ శతాబ్దిలో పోర్చుగీసువారు పరిశోధించి, ఆక్రమించి స్థిరనివాస మేర్పరుచు కొన్నప్పటి నుండియు ఆఫ్రికా రాజకీయార్థిక నిర్మాణము పూర్తిగా మార్పుచెందినది.
క్రీ. శ. 1500 కును, 1886 కును మధ్యకాలమును అభ్యుదయకాలమని చెప్పవచ్చును. యూరోపియనులు ఆఫ్రికాలో స్థిరపడుటయే ఇందుకు కారణము. ఆది కాలమునందలి సముద్ర పరిశోధనయు, అంతర ప్రవేశమును, ఆ ఖండము నందలి లోహవృక్షాది సంపదను వెలుగునకు తెచ్చెను. ఇది వర్తక సంఘ స్థాపన ము న కు ను, మిషనరీల (మత ప్రచారకుల) ఆగమనమునకును దారచూపెను. పై వర్తక సంఘములు దేశీయ సంపదను కొల్ల గొట్టుటయు, మిషనరీలు ప్రచార కార్యమును చేయుటయు కొనసాగుచుండ, యూరపు నందలి వివిధ దేశముల ప్రభుత్వములు పరస్పర స్పర్ధవహించి ఒండొంటితో యుద్ధముచేయ నారంభించెను. దీనికి ఫలితముగా క్రీ.శ. 1880 -1888 సంవత్సరముల నడుమ ఆఫ్రికా ఖండము పోర్చుగీసు, ఫ్రెంచి, డచ్చి, ఇంగ్లీషు, జర్మను ప్రభుత్వముల నడుమ విభ క్తమగుట సంభవించెను. ఈజిప్టు, ఎథియోపియా, లైబీరియా అనునవి మాత్రమే యూరోపియనుల చేజిక్కకుండ స్వతంత్రముగా ఉండిపోయెను.
ఈ శతాబ్దిలో ఆఫ్రికావాసులకును యూరోపియనులకును నడుమ ఎక్కువ రాజకీయ సామరస్యము ఏర్పడుటయు, ఆఫ్రికా ప్రజలకు కొంతవరకు స్వయం ప్రభుత్వము పరిణమించుటయు సంభవించెను. ఈ కాలమందంతటను 4 మిలియనుల సంఖ్యగల యూరపు దేశములవారు తమ దేశములన్నియు కలిపిన భూ వైశాల్యముకంటే 30 రెట్లధిక విశాలమైన ప్రదేశమున నివసించు 146 మిలియనులు సంఖ్యగల ఆఫ్రికను ప్రజల రాజకీయ భవితవ్యమును, ప్రకృతి సంపదను నిర్ణయించుచుండిరని చెప్పవచ్చును. వారిట్టి అధికారమును చలాయించుటకు వారికి ప్రకృతి సంపదపై గల ప్రాభవమే కారణము. ఉత్తర రొడీషియాలో రాగి, సీసము, తుత్తునాగము, మాంగనీసు మున్నగునవియు, బెల్జియం అధికారమున నుండిన మధ్య కాంగోలో కోబాల్టు, రాగి, బంగారము, యూరేనియము, మున్నగునవియు మరికొన్ని వాణిజ్యపు పంటలును, ఫ్రెంచి వారి అధీనములోని అల్జీరియాలో ఇనుము, సీసము, ఫాస్ఫేట్లు, తుత్తునాగము, తైలములు, మద్యము, ఊలు, కోకో, ప్రత్తి, కఱ్ఱ మొదలగునవియు పైన చెప్పబడిన ప్రకృతి సంపదలలో ముఖ్యములైనవి. దక్షిణాఫ్రికా యందలి వర్ణనృథక్కరణ సమస్యయందును, అల్జీరియా యందలి ఇటీవలి తిరుగుబాటునందును, దక్షిణాఫ్రికా యందలి పెక్కు దేశములలోని రాజకీయ సంక్షోభము లందును (మౌ, మౌ) సూయజు కాలువను ఈజిప్టు జాతీయకరణ విషయమున పడమటి యూరపు దేశములు పొందిన కలవరమునందును ఈ యైరోపియాధి కారము వలన రాజకీయ ప్రతిక్రియలు ప్రతిఫలించుచున్నవి.
ఆఫ్రికాయందలి చాల భాగము బ్రిటను, ఫ్రాన్సు, బెల్జియము, పోర్చుగలు అను నాలుగు దేశముల అధీనమందున్నది. సంయుక్త రాష్ట్రముల యాజమాన్యము (trusteeship) క్రింద మరికొన్ని యితర భాగములున్నవి. ఆఫ్రికాఖండ మంతటికిని మూడేస్వతంత్ర దేశములున్నవి. అందు ఈజిప్టు పురాతన కాలమునుండియు స్వతంత్రమై యుండెను. అమెరికానుండి విముక్తులైన నీగ్రో బానిసల కొరకు లైబీరియా ప్రజాస్వామ్యము ఏర్పరుపబడెను, ఎతియోపియా (అబిసీనియా) క్రీ. శ. 1941 లో ఇటలీ నుండి స్వాతంత్య్రమును సంపాదించెను.
గుడ్ హోప్ అగ్రము, ట్రాన్సువాలు, ఆరెంజి ఫ్రీస్టేటు, నేటాలు అనువానితోగూడిన సంయుక్త దక్షిణ ఆఫ్రికా స్వయంపాలిత మైన ప్రదేశము. ఆంగ్లేయులకును, డచ్చివారికిని నడుమగల స్పర్ధచేతను, బహుముఖము లైన దేశీయ సమస్యలచేతను, ప్రాచ్యులైన భారతీయులు వలసవచ్చుటచే నేటాలులో ఏర్పడిన స్థానిక రాజకీయ సంక్షోభము చేతను అచ్చటి రాజకీయ పరిస్థితి మరింత క్లిష్టతరమగుట సంభవించెను. పశ్చిమాఫ్రికా ప్రదేశములలో బ్రిటిషువారు దేశీయనాయకులద్వారా పరోక్ష మైన పాలనపద్ధతిని అభివృద్ధికావించిరి. పశ్చిమాఫ్రికాలో యూరోపియనులు వచ్చి స్థిరపడుట అంత ముఖ్యమైన సమస్య కాదు కాని తూర్పు ఆఫ్రికాలోని, బ్రిటిషుప్రాంతమున, ముఖ్యముగా కెన్యాలో వలస