Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొలిపలుకులు

సంగ్రహాంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటమును ఆంధ్రప్రజానీకమున కర్పించుట సంతోషదాయకమైన కర్తవ్యముగా భావించుచున్నాను. ఈ విజ్ఞానకోశ ప్రచురణ విషయము 1953 ప్రాంతములందు ఉస్మానియా విశ్వవిద్యాలయ మహా భవనమున నొకమూల చిన్న గదిలో తళుక్కుమని మెరసినది. ఐదు సంవత్సరము లలో నీ విధముగా నవతరించినది. దీని ధ్యేయమును ప్రకాశకు లొకచోట ఈ విధముగ చెప్పినారు : "విశ్వ విజ్ఞానమును సంక్షేపరూపములో ఆంధ్రకుటీరప్రాంగ ణములకు గొని వచ్చుటే ఈ కోశముయొక్క లక్ష్యము." కనుక గ్రంథపఠనము వంటి నిర్మాణ కార్యములకు అవకాశము చాలని ఈ దినములలో విజ్ఞాన సారమును సంగ్రహముగా తెలుపుటకూడ గొప్ప సేవగనే భావింపవలెను. ఇట్టి లక్ష్యముతో ఆరంభింపబడిన ఉద్యమము ఆంధ్రమహా జను లందరకును ఆదరణీయమే కాగలదు. ఇంకొకవిధముగాకూడ ఈ యుద్యమము సంభావ్య మగుచున్నది. ఈ శతాబ్దా రంభము నుండియు తెలంగాణములో విద్య, భాష, సంస్కృతి విషయములందు నవచైతన్యము కలిగి ఒకప్పుడు మందముగను, మరొకప్పుడు వేగముగను పురోగ మించుట మేమందరము గమనించి సంతోషపడుచుంటిమి. ఆంధ్రభాషలో సంపూర్ణ విజ్ఞానసర్వస్వము . లేని లోపమును పూరించవలె నని తెలంగాణ సాహిత్యకులు కోరుటయు, నడుము కట్టుటయు, కొంత విజయమును సాధించుటయు యావ దాంధ్రమునకును మోదకారణము.

ఈ యుద్యమమును ప్రథమమున హైద్రాబాద్ ప్రభుత్వమువారును, ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమువారును ప్రోత్సహించి ఆర్థికముగా సహాయ వడుట అభినందింపదగిన విషయము.