Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/788

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆనకట్టలు : నిక్షేప జలాశయ నిర్మాణము


పోవుటయు జరుగును. అట్టి సందర్భములలో వర్షాకాలములలో అధికముగా లభించి సముద్రమునకు నిరుపయోగముగా చేరుచున్న నీటిని నిలువ చేసి పైర్లు పెరుగుటకు అనుకూలముగా నీరు అందజేయుటకు నిక్షేప జలాశయములు (Storage reservoirs) నిర్మించబడును. ఇట్టి జలాశయములనుండి కాలువలద్వారా నీరు పొలములకు అంద జేయబడును.

దేశములో ప్రవహించేడు పెద్ద పెద్ద నదులలో తరచుగా వర్షాకాలమునందు వరదలు వచ్చును. వీటివలన అనేక గ్రామములు అనేక చదరపు మైళ్ళ విస్తీర్ణము గల పంటభూములు చెల్లాచెదరై పోవును. జలాశయ నిర్మాణము వలన ఈ వరదల ఉధృతమును తగ్గించి, దేశమునకు కలుగు అరిష్టములను పోగొట్ట వచ్చును.

కర్మాగారములను నడపుటకు కావలసిన శక్తిని బొగ్గు, పెట్రోలు, డీజలు నూనె సప్లయి చేయును. కాని ప్రపంచములో ఇవి లభించెడు ప్రదేశములు మిగులు తక్కువ. వాటి నిక్షేపములు కూడ దినదినము తగ్గిపోవు చున్నవి. ఇందువలన క్రమముగా పారిశ్రామిక పరిస్థితులు క్షీణించవచ్చును. ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనుటకు జలాశయములు ఉపయోగ పడును. వీటిద్వార ఒక ఎత్తైన ప్రదేశములో నీటిని నిలువజేసి, దానిని క్రమవిధమున క్రింది ప్రదేశములకు వదలినచో ఏర్పడు జలపాతమునుండి శక్తిని పుట్టించవచ్చును. దీనినే జలవిద్యుత్ అందురు. దీని ద్వారమున కర్మాగారములకు చౌకధరలో శక్తి దొరకును. సరకులు ఒక ప్రదేశమునుండి ఇంకొక ప్రదేశమునకు రైళ్ళు, బస్సులు, ఎద్దులబండ్లు మొదలైన వాటి మీదకన్న పడవలు, లాంచీల ద్వార చాల తక్కువ ఖర్చులో రవాణా చేయవచ్చును. జలాశయముల వలనను, వాటి నుండి ప్రవహించు కాలువల వలనను దేశములో నీటి రహదారులను కల్పింపవచ్చును.

2. జలాశయపు కట్టడముయొక్క నిర్మాణము  :- ఏదైన ఒక నదిమీద జలాశయ నిర్మాణము కావించుటకు ముందు నదినుండి ఎంత నీరు లభించును? ఈ నీటిద్వార ఎంత భూమి సేద్యము కాగలదు? జలాశయముద్వార జల విద్యుత్తును ఉత్పత్తిచేయుటకు అవకాశ మున్న దా? జలాశయ నిర్మాణమునకు అవసరమగు కట్టడమునకు తగిన పునాది ఉన్నదా? మొదలగు విషయములను పరిశీలించవలసి యుండును. ఆనకట్ట నిర్మాణమునకు అనువగు స్థలము నిర్దేశించిన తరువాత ఏరకమైనకట్ట, ఎంత ఎత్తున కట్టవలెను అను విషయములను నిర్ధారణ చేయవలెను. జలా శయములు కట్టలను మట్టితోగాని, రాతిగచ్ఛుతో గాని, సిమెంటు కాంక్రీటుతోగాని, నిర్మింపవచ్చును.

3. మట్టి కట్టడములు  :- మనదేశములో మట్టితో కట్టలు వేయుట పూర్వకాలము నుండి ఆచరణలో నున్నది. పాకాల, రామప్ప మొదలగు తటాకములను మట్టికట్టడముల తోనే నిర్మించి యున్నారు. మట్టికట్టలు యితర విధములైన కట్టలకంటే చాల తక్కువ ధరతో తయారగుటయు, ఈ కట్ట నిర్మించుటకు అవసరమగు మన్ను ఎచ్చటైన సులభముగా దొరకుటయు వీటిని నిర్మించుటకై ప్రత్యేకమైన నేర్పరితనముగల పనివాండ్రు అవసరము లేకపోవుటయు, మట్టి కట్టలు విరివిగా కట్టబడుటకు కారణములై యున్నవి. సుమా రేబది అడుగుల ఎత్తువరకు నీటిని అపుటకు మట్టితోనే కట్టలు కట్టవచ్చును.

మనకు సామాన్యముగా లభించు మట్టి రెండు రకములుగా ఉన్నది. ఒకటి ఇసుకమన్ను, రెండవది బంక మన్ను. ఇసుకమన్నులో నున్న మట్టి రేణువులు పెద్దవి గాను, రేగడి, ఒండ్రు మట్టిలోనున్న రేణువులు సూక్ష్మమైనవిగాను ఉండును. మంటి రేణువులు పెద్దవిగా ఉన్నప్పుడు ఆ మట్టికి ఎక్కువ స్థిరత్వముండును. అటువంటి రేణువులు సులభముగా నీటిప్రవాహములో కొట్టు కొనిపోవు. ఎండ తీవ్రతకు పగుళ్ళు పాయవు. కాని రేణువుల మధ్యనున్న సూక్ష్మ రంధ్రములగుండ కొంత నీరు బైటికి ప్రవహించుటకు అవకాశమున్నది.

రెండవరకపు మట్టిలో, మట్టి రేణువులు సూక్ష్మమైనవిగా నుండుట చేత నీటి తేమకు మెత్తబడి తేలికగా తన నిజ స్థానమును వదలి కొట్టుకొనిపోవును. ఎండ తీవ్రతకు పగుళ్ళుబాసి నెట్టెలు విచ్చును. ఈ పగుళ్ళద్వారా ఆపబడిన నీరు వెలువలకు పోవును. కాని అణువుల మధ్య సూక్ష్మ రంధ్రములు బహు చిన్నవిగా నుండుటచేత నీరు సులభముగా జారిపోదు. ఈ మట్టికి జిగట స్వభావముండును. కనుక పై రెండు విధముల మన్నులలో ఏ ఒక్క దాని యందును కట్టలు కట్టుటకు అనుకూలమైన గుణములు