Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/775

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆధునిక వాస్తువాదములు


అవి లి- కార్ –బిజీయరు యొక్క కార్యాలయము, గ్రోపీ యస్ చే నిర్వహింపబడిన బావుహావుస్ విద్యాలయము అనునవి. ఆధునిక నిర్మాణములందు. చక్కని కల్పనల కీదశాబ్ద మెన్నికగన్నది. ఈ దశాబ్దపు చివర నీయుద్యమము సన్నగిల్లెను. ప్రథమమున జర్మనీలోను, క్రమముగా రష్యా, ఫ్రాన్సు దేశములందును, 1938 లో ఇటలీయందును దీనికి పట్టుతప్పినది. జర్మనీ, ఇటలీ, రష్యా దేశములం దిది క్షీణించుట కాయాదేశముల రాజకీయ పరిస్థితులే కారణము. కాని ఫ్రాన్సులో దీని పతనమునకు హేతువులు భిన్నములు. ఇచట ఆధునిక వాస్తువునకు మూలమని యెంచబడిన ప్రయోజనాత్మక వాదము అసమర్థమని నిరూపింపబడినది, వాస్తవిక వాదమును, ఉపయోగతా వాదమును (utilitarianism) ఉపాసించు వారు ఆభాసభావనలచే కొన్ని పనులు చేయుచుండిరి. ఈ సిద్ధాంతములు, క్షీణించిన రీతుల మట్టు పెట్టుట కుప యోగకారులుగనే యున్నను, సంప్రదాయ వాదము పై విజయము సాధింపబడిన తరువాతను, వాస్తుశాస్త్రజ్ఞులు వాస్తు నిజతత్త్వమును గ్రహించిన పిమ్మటను, ఆధునిక వాస్తుశాస్త్ర వ్యాప్తిని సమర్థించుట కీ వాదములు సమర్థములు గాకుండెను. ప్రయోజనాత్మక వాదమునకు మూలభూతుడైన లీ కార్బుజియర్ కూడ కళనుగూర్చి ఐంద్రజాలిక సిద్ధాంతములను ప్రతిపాదించుచు, అకలంక రూపసౌందర్యమునుగూర్చి గేయప్రశంసలు చేయుట చూచి భావుకులు కళవళపడ జొచ్చిరి. (లీ కార్బుజియరు విశుద్ధతా వాదమును సమర్థించినవాడు) వాస్తుశాస్త్రజ్ఞులు ఆధునిక వాస్తువునకు మూలములని చెప్పుచున్న వివిధ దార్శనిక సిద్ధాంతములను ప్రయోజనాత్మక వాదముతో సమన్వయింప మొదలిడిరి. అందుచేతనే 1930 నుండి లికార్ బిజీయరును J. J. P. జౌడును యూరపులో తమ నిర్మాణకృషి నాపి వేసిరి. గ్రోపియస్, మైస్, మెండెల్ సోహారు, జర్మనీ వదలి అమెరికా దేశమునకు వలసపోవలసి వచ్చెను. ఫిన్లాండు వాడగు సారినేను, స్వీడన్ దేశస్థుడగు రోటెన్ బర్గుకూడ అమెరికాలో ప్రవాస మేర్పరచుకొనిరి. ఆధునిక వాస్తువు స్విట్జర్లాండు లోను, స్కాండినేవియన్ దేశములందును జక్కగా అభివృద్ధి నందినది. ఇది కొంత కాలము ఇటలీలోను, జెకోస్లోవేకియా లోను అభ్యుదయము గాంచినది. ఇంగ్లాండునందుదక్క తక్కిన దేశములందు అంతటను ఆధునిక వాస్తువు క్షీణదశ నెదుర్కొనవలసి వచ్చినది. ఇంగ్లాండునందు ఆధునిక వాస్తువు సిద్ధాంతాత్మకముగా గాక, ప్రయోగ దశాత్మకముగా మాత్రమే గ్రహింపబడుటచే కొంత కాలము నిలుచుటకు సాధ్యమైనది.

ఆధునిక వాస్తుశాస్త్రజ్ఞులలో రెండవ తరము వారి నిర్మాణములలో చక్కని యభివృద్ధి గానవచ్చుచున్నది, ఈ తరమునకు చెందినవారు ప్రయోజనతా వాదపు వాతావరణమున జన్మించిరి. దానిని పునాదిగా స్వీకరించి వీరు పురోగమనము సాధించిరి. విశుద్ధరూపమునకును, సాంకేతిక ప్రక్రియకును సమన్వయము కుదుర్చుట వీరికి ముఖ్య సమస్యయైనది. వీరు వాస్తువును సిద్ధాంతముల బారినుండి తప్పించి, దానికి మానవత్వము నాపాదించుటకు ప్రయత్నించిరి. యువక వాస్తుకారుల యుత్తమ నిర్మాణములం దీ యభిప్రాయము చక్కగా వ్యక్తమగుచున్నది. సామాన్య మానవుని జీవితము నకును, ఆతని నిత్య సమస్యలకును వాస్తువును సన్నిహిత పరచుటకు వీరు ప్రయత్నించిరి. మానవ సంక్షేమమును, మన స్తత్త్వ పరిశీలనమును వీరు దృష్టిలో నిడుకొనిరి. వీరి నిర్మాణములు ప్రయోజనతాభిప్రాయములను విపులీకరించినవి వీరి కట్టడములందు నూతనత్వము, ఉల్లాసము, క్రీడా రతియు కనిపించును. వైవిధ్యములేని చదునైన ఇంటి కప్పులకు, నగ్నకుడ్యముల కీరితి భిన్నమైనది. సాంకేతిక దృష్టిననుసరించియు, ముఖ్యముగా నిర్మాణమునకు సంబంధించిన ఆర్థిక సమస్యలను బట్టియు వాస్తువు సామాన్య ప్రయోజనాత్మకమైనది. కాని కేవల మిదియే పరిపూర్ణ వాస్తువు కాజాలదు. వాస్తువు సామాన్యముగా మానవ కృషి క్షేత్రము నంతయు నాక్రమించును. అందుచే ఆధునిక వాస్తుకారుడు హేతువాద సూత్రములను, సాంకేతిక రంగమునుండి మానవతారంగమునకును, మానసిక రంగములకును, వ్యాపింప జేయుటకు ప్రయత్నించును. ప్రథమ దశయందలి సాంకేతిక తత్త్వదృగ్విషయక నూతనకల్పనలను ఇపుడిది తనలో లీనము గావించుకొన్నది. సిద్ధాంతవాదములతో తృప్తిపడక నిర్మాణాత్మక చైతన్యమును చూపుచున్నది. సరిగా ఇటువంటి పరి