ఆధునిక భారతీయ చిత్రకళారీతులు
బహులక్షణ సమ్మేళనముతోకూడి ఉండుటచే ఆధునిక కళాపరిస్థితికి విలువకట్టుట చాల కష్టము. కాని అది ఒక విధముగా మంచి సూచనయే. నేటి భారతీయ చిత్రకళ పరుల సూచనలను అమోదించు చుండుట యందు విశ్వజనీనమును, స్వాయత్తము చేసికొని వ్యాఖ్యానించుట యందు జాతీయమును అయి కనబడుచున్నది. ఇటీవల చారిత్రక దృక్పథముకూడ పెంపొందింపబడినది. ఆధునిక
కళాభిజ్ఞులు గత చారిత్రక యుగములందలి కళాతత్త్వమును లోతుగా పరిశీలింప జాలి ఉన్నారు. ఆల్తమిరాలోని శిలాయుగపు వర్ణములందలి శక్తి సాక్షాత్కారములును, ఈజిప్టు కుడ్య చిత్రములందలి ఉదాత్తమయిన ఆంగిక చిత్రణమును, అజెటిక్ చిత్రములలోని అప్రకాశయుతత్వమును, ఆదిమ కాప్టిక్ కళయందలి నైశిత్యమును, సుంగ్ ప్రకృతి వర్ణచిత్రములందలి దృష్టి వైశాల్యమును,హిరోషిగె కళలోని రసపరిపూర్ణతయు, టిబెట్టునందలి ధ్వజపట చిత్రములలోని కథానక పద్దతియు, నీగ్రో కళ యందలి సాంకేతికత్వమును - దూర దేశకాలములకు సంబంధించిన ఇవన్నియు ఆధునిక భారతీయ కళపై
తమ ప్రభావమును చూపి ఉన్నవి.
కొందరు భారతీయ చిత్రకారులు పరమతములకు సంబంధించిన వస్తువులను కూడ సమర్థతతో చిత్రింపజాలుటకు ఆధునిక ప్రకృతియందలి విశ్వజనీనతయే కారణము. క్రీస్తు జననము, మాజి (Mogi) యాత్ర, సిలువపై మరణము మున్నగు కథావస్తువులను గ్రహించి భారతీయ చిత్రకారులు వర్ణచిత్రములు రచించియున్నారు. ప్రతి కళయు విశ్వజనీనమయిన అర్థమునకు వైయక్తికమయిన రూపనిరూపణమని చెప్పదగును. మత సంస్థాపకులు మున్నగు మహనీయుల విశ్వజనీనతలోని వింత యేమన వారి సందేశము ఆమోదింపబడిన ప్రదేశములం దెల్ల వారు జాతీయులుగా పరిగణింప బడుచుందురు. క్రైస్తవమత సంబంధమయిన కళను భారతీయముగా నొనరించుటలో క్రైస్తవ చిత్రకారులు చాల తోడ్పడిరి.
నేడు భారతీయుల యెదుట ఉన్న ప్రధాన సమస్య పార్థక్యమును పాటించుటయా లేక పరదేశ ప్రభావ ముల నామోదించుటయా అనునది. జాతి బంధములచే యూరపునకు అంత సన్నిహితముగా కట్టబడియున్న అమెరికాలో గూడ ఇట్టి సమస్య ఉప్పతిల్లె ననుట విస్మయకరముగాఉండును. నిశిత మయ్యు అసంబద్ధమయిన ఆకస్మిక దేశాభిమానముచే అమెరికను విమర్శకులు కొందరు ఆ ప్రాచీన ఖండము నందలి సంస్కృతిని అలవరుచుకోనుట కయి యూరపునకు అరిగిన ఫ్రాంకో, ట్యూటో అమెరికనులను నిరసింప మొదలిడిరి. కాని బాగుగా ఆలోచించిన పిమ్మట సమకాలిక విమర్శక తత్త్వము 1864 లో కళాపార్థక్యమునకు వ్యతిరేకముగా వ్రాసిన జేమ్సు జాక్సను జార్వెసు అను నాతని వాదముతో ఏకీభవించు చున్నది. శాస్త్రము, నీతి, భౌతిక శాస్త్రము అను వాని యందు ఎవ్వరును అట్టి పార్థక్యము ఉండునని కలలో కూడ తలంచి ఉండలేదని జార్వెసు నూచించి ఉండెను.“మనము ఇతర నాగరకతా విధానములందువలెనే మన కళయందుకూడ సమన్వయమునకై యత్నింప వలయును. అన్ని ఆధారములనుండియు గ్రహింపబడినట్టియు, స్థిరమయిన మన ఆత్మీయతచే జాతీయమును సధర్మమును చేయబడినట్టియు ఉదాహరణములు, జ్ఞానము, భావములు మున్నగు వానివలన కళాసంపదను పొందుట, అందు సమగ్రత్వమును సంపాదించుటకు సరియైన పద్ధతి.”
భారతీయ పునరుజ్జీవనమునకు వెనుక నుండి ప్రాక్స్వాతంత్య్ర కాలభావములను ఇంకను విడువక పరదేశ ప్రభావమును అనుమానించువారు ఈ మాటలనుగూర్చి పర్యాలోచన చేయవలెను. కాని సమూల సంస్కరణము వాంఛించు భారతీయులు ఈ దృక్పథము యొక్క విజ్ఞానము తమ ప్రత్యేక సహకారముగా భావించి దానిని భారతదేశమున ఆచరణలో పెట్టుచో వారుకూడ పొరపడినవారే అగుదురు. ఏలయన పెక్కు శతాబ్దుల నుండి భారతీయ సంప్రదాయములకును, ఆసియా సంప్రదాయములకును నడుమ అధికమైన సమ్మేళనము జరుగుచున్నది. భారతీయాదర్శములు సింహళము, చీనా, జపాను, ఇండోచైనా, ఇండొనీషియా మున్నగుచోట్లకు పయనించినవి. మధ్య ఆసియా ప్రభావము మన శిల్పమును చిత్రకళను అధికముగా మార్పు చెందించినది.
అనుకరణము, ' స్వాయత్తీకరణము అను వాని భేదమును గుర్తించినచో మనము సరియైన మార్గమును త్రొక్కినట్లే. బి. ము.