Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/757

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆదిలాబాదుజిల్లా

రీతులు కలవు. దక్షిణ అమెరికా రాజకీయ సంస్థలు "ఇంకాసు" నందలి కేంద్ర నిరంకుశత్వము మొదలుకొని “ఓనా” యందలి సూత్రబద్ధ రాజకీయ విధాన శూన్య పద్ధతివరకు వివిధములుగా నున్నవి. ఓనాలో వృద్ధుల యెడ గౌరవము చూపుట, త్రికరణశుద్ధిగా నుండుట, అను ప్రాతిపదికలనే ఆధారముగా గైకొని స్థానిక సమాజ అధినాయకుడు సిద్ధాచార సంప్రదాయములను ప్రవర్తిల్ల జేయును. కాంగోలోని సభ్యతా ప్రాంతమందు పిగ్మీ (Pygmi హ్రస్వరూపులు) తెగవారిలో నుండు అతి సామాన్యపు కట్టుబాటులకును, లుండా, షాంగో, లూబా రాష్ట్రములందు స్పష్టముగా లక్ష్య లక్షణ సమన్వితమై, క్లిష్టతరమయి ఒప్పుచుండు రాజకీయ విధానములకును చాల వ్యత్యాసము కనిపించును. పోలినేసియాలో రాజకీయ విధాన సౌధమునకు పూర్తిగ మతమే మూలాధార మని చెప్పవచ్చును. ఇచ్చటి అధినాయకులు (లేక గురువులు) దైవాంశసంభూతులనుటనుబట్టియే వారి పదవి స్థిరపడు చుండును. మాలనేసియా ద్వీపములందు యథార్థమును, సుస్పష్టమునైన నాయకత్వము కనబడుచున్నది. పోతారు మండలములోని ఎస్కిమోలు, హైదరాబాదు రాష్ట్రములోని చెంచులు -- అనువారిలో నాయకత్వము వంశ పారంపర్యముగ సంక్రమించునది కాదు. వారు తమ తెగ జనులలో నుండి నాయకుని ఎన్నుకొనెదరు. ఆనాయకుడు శక్తి సామర్థ్యములు, పలుకుబడి, వివేకము గల వాడుగా నుండుట ఎన్నికకు ఒక యోగ్యతగానుండును. హైదరాబాదు రాష్ట్రములో ఆదిమజనుల పంచాయతులు న్యాయ నిర్ణయమునందు చాల ప్రముఖ స్థానమును వహించియున్నవి.

రా. ప్ర.

ఆదిలాబాదు జిల్లా  :- ఆదిలాబాదుజిల్లా ఆంధ్రప్రదేశములో కలదు. ఇది అక్షాంశ రేఖ 18-3° నుండి 19.45° వరకును, తులాంశ రేఖ 77.53° నుండి 80.0° వరకును వ్యాపించియున్నది. క్రీ. శ. 1905 వ సంవత్సరమునకు పూర్వము సిరిపూర్ తాండూరు జిల్లాకు ఆదిలాబాదు సబు జిల్లాగా ఎంచబడు చుండెడిది.

ఎల్లలు  :- ఈ జిల్లాకు ఈశాన్య, పూర్వభాగములందు మధ్య ప్రదేశములోని చాందా జిల్లాయు, దక్షిణమున కరీంనగరము, నిజామాబాదు జిల్లాలును, నైరృతి దిక్కున నాందేడు (బొంబాయి) జిల్లాయు కలవు. పశ్చిమమునందును, ఉత్తరమునందును, మధ్య ప్రదేశము నుండియు, ఈశాన్య పూర్వములందు వార్ధా ప్రాణహితలనుండియు ఈ జిల్లా వేరుపడుచున్నది. ఆదిలాబాదు జిల్లా యొక్క వైశాల్యము 7,358 చ. మైళ్ళు.

ఈ జిల్లాలో పదునొకండు తాలూకాలు, 1796 గ్రామములు, 13 పట్టణములు కలవు.

తాలూకాలు: 1. ఆదిలా బాదు  :- వైశాల్యము 580.48 చ. మైళ్ళు. జనాభా 1,01,611, పురుషులు 49,709; స్త్రీలు 51,902: జనసాంద్రత ప్రతి చ. మైలుకు 175 మంది.

2. ఉట్నూరు : వైశాల్యము 726.40 చ. మైళ్లు. జనాభా 34,404; పురుషులు 17.462; స్త్రీలు 16,942; ఇచట విఠలేశ్వరాలయ మున్నది. ఈ ఆలయ కారణముగనే దీనికి ఉట్నూరు అను పేరు కలిగినది. మొత్తము జనాభాలో ఆదిమవాసులు 8 వ వంతుకలరు. జనసాంద్రత ప్రతి చ. మైలుకు 47 మంది.

3. ఖానాపూరు  : వైశాల్యము 312.96 చ. మైళ్ళు. జనాభా 43,336, పురుషులు 22,391 స్త్రీలు 20,975; జనసాంద్రత ప్రతి చ. మైలుకు 139 మంది.

4. నిర్మల : వైశాల్యము 566.40 చ. మైళ్ళు. జనాభా 1,21,029. పురుషులు 58,306, స్త్రీలు 62,723. జనసాంద్రత ప్రతి చ. మైలుకు 214 మంది.

5. బోధ్  : వైశాల్యము 708.48 చ. మైళ్లు. జనాభా 72,372; పురుషులు, 36,232; స్త్రీలు,36,140, జనసాంద్రత ప్రతి చ, మైలుకు 102 మంది. ఈ తాలూకాలో కుంతల, పోచరా అను జలపాతములు కలవు.

6. కిన్వటు  : వైశాల్యము 608.64 చ. మైళ్ళు. జనాభా 73,118. పురుషులు 36,583 : స్త్రీలు 36,535. జనసాంద్రత ప్రతి చ. మైలుకు 120 మంది.

7. రాజూరా : వైశాల్యము 776.32 చ. మైళ్ళు: జనాభా 75,357 ; పురుషులు 38,025; స్త్రీలు 37,337 జనసాంద్రత ప్రతి చ. మైలుకు 97 మంది.