Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/755

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆదిమజనుల సంస్కృతులు


కోలుకొనుటకు కాబోలు! ఇక జీవిత చక్రములోని రెండవ క్లిష్టపరిస్థితి ప్రౌఢదశా ప్రారంభము, ప్రౌఢత కౌమారమునకు సంధ్యాకాలం; యౌవనమునకు (adulthood) ఉషః కాలము. ఆస్ట్రేలియాలో సున్నతి (circumcision), అంతశ్ఛేదన (Subincision) కార్యముల విషయమున రాతి కత్తులతో బాధాకరమయిన, అపాయకరమయిన శస్త్రచికిత్సలను మోటుగా చేసెదరు. ఆఫ్రికా సూడాన్ లోని పలు ప్రాంతములందు కన్యలపై చేయు అత్యాశ్చర్యకర లైంగిక ప్రయోగములు స్త్రీలుగా వారి పాత్రను (కృత్యము), భార్యలుగా వారి అంతరమును అమితముగను, దృఢముగను తెలుపుటకు అనుకూలించు చున్నవి. మచ్చలుపడునట్లు చేయుట (Cicatrization), ముందటి పంటిని ఆకురాతితో అరగదీయుట లేక విరగ గొట్టుట, అలంకరణము కొరకును, అంతరమును గుర్తించుటకు నుపకరించుచున్నవి. యువకుల జీవిత వికాసోద్యమము నందు సమితులు, రహస్య సంఘములు, యువజన పదనములు, లేక శయనాగారములు మిక్కిలి ప్రముఖ పాత్రను వహించుచుండును. గ్రామశయనాగారముల (Village dormitory) వ్యవస్థాపద్ధతి ఛోటా నాగపూరు పీఠతలము అందలి తెగవా రగు ముండాలు, హోసులు, ఓరోనులు, ఖారియాలవంటి ఆదిమజాతులలో ఎక్కువగా కనిపించుచున్నది. మధ్యప్రదేశములోని' గోండులలో,బ్వియాలలొ (Bhuiyas) కూడ ఇది కనబడుచున్నది.అస్సాములోని నాగజాతులలో ఎక్కువగాను, మలనేషియా, పోలినేషియాలలోని పెక్కు తెగలయందును ఈ వ్యవస్థాపద్ధతి నెలకొని యున్నది.

వ్యక్తి జీవితమునందు మరణము చరమావస్థ. మరణము స్వాభావిక కారణములవల్ల సంభవించునని కొందరును, శత్రుజనుల మంత్రవిద్యా ప్రయోగములవల్ల సంభవించునని మరికొందరును భావించెదరు. మృతులను సాధారణముగా ఖననము చేయుటయో, దహనము చేయుటయో జరుగును. వేర్వేరు సంఘములందు వేర్వేరు విధములయిన మృత క్రియలు (అపరకర్మలు) జరుగును. ఉదాహరణముగా - తోడాలు, తడికర్మ (పచ్చికర్మ), పొడికర్మ (ఎండు కర్మ) చేయుదురు. తడికర్మ మానవులకు మృతిసంభవించగానే చేయునది. పొడికర్మ మృతిసంభవించిన పెక్కు దినములకు చేయునట్టిది. మొదటిదాని విషయములో శవదహనము జరుగును. రెండవదాని విషయములో మృతుని బూడిదను పెద్ద రాతి క్రింద పూడ్చిపెట్టెదరు. గోండుల వంటి కొన్ని ఆదిమజాతులవారు ఈ సమయమున ఆవులను బలియిచ్చె దరు. మధ్యప్రదేశములో కొరుకు జాతి మొదలగువారు సమాధిపయి స్మారక స్తంభములను నిలబెట్టెదరు.

కళావాఙ్మయములు  :- సౌందర్యముకొరకు పాటుపడు నుత్సుకత విశిష్టములును, ఆనందకరములునైన మానవ లక్షణములలో నొకటి. ప్రపంచమునం దంతటను మానవుడు తన పరిసరములను అలంకారభూయిష్ఠముగా నుంచుకొనుట కభిలషించును. ఒకానొక వస్తువు సర్వసాధారణముగా ప్రయోజనకరమై యుండుట ఆతనికి చాలదు. అది తన బాహ్య రూపముతో వాని కానందమునుగూడ కూర్పవలయును. ఆతడు తాను వాడుకొనునట్టి పెక్కు వస్తువులకు అలంకారములు కూర్చును. లేదా వాటికి రంగువేసియో, ఆకారమును గల్పించియో వాటి విశిష్టతకు కడంగును, జుగోస్లావు స్త్రీలు తమ మొలకు జుట్టుకొను ముతకబట్టలమీద చిత్రించిన బొమ్మలును, నార్వేదేశపు పడతుల ముఖభాగములందును, పొగత్రాగెడు కామెటాన్ గొట్టము యొక్క గుంటమీదను చెక్కిన చిత్రములును, సూడాన్ దేశపు న్యూబియన్ స్త్రీలు పిరుదులపై (అలంకారార్ధము) వేసికొను పుంటిమచ్చలు (Cicatrization) ను, జపానీ స్త్రీలును, తోడా స్త్రీలును చేతులమీదను, రొమ్ములమీదను పొడిపించుకొను తీరుతీరు పచ్చబొట్టులును, ఇటలీ దేశములో చర్చిమందిరపు కప్పులపై చిత్రించిన బొమ్మలును - ఇట్టి వన్నియు మానవుని సౌందర్యాసక్తికి నిదర్శనములే. మానవుడు తన సృజనాత్మక భావసిద్ధికి ప్రయత్నించు విశిష్టక ళారూపము లెన్నో ఉన్నవి. చిత్రరచన, రాలపయి చిత్రములు చెక్కుట. క్షేత్రగణిత రేఖా కారములు, దారువు, శిల, లోహములు, ఎముకలు మున్నగువాటిపై స్థాపత్యవిధానరచన, ఎముకలపై, దంతముపై, లోహముపై కుండలపై కళా కౌశల్యము చూపుట, వర్ణచిత్రములు గావించుట, తట్టలల్లుట, బుట్టలల్లుట, వేషధారణకళ, దేహాలంకరణకళ - ఇట్టివే కళావిధానములయి యున్నవి. ఇవేకాక సంగీ