Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/726

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రోద్యమము (తెలంగాణములో)


పది మహిళాసభలుకూడ జరిగినవి. ఈ మహాసభలు జరుపుకొనుటకు ప్రభుత్వము వారి అనుమతి తీసికొకుటకై భగీరథ ప్రయత్నాలు జరిపిన నిదర్శనాలు కన్పించుచున్నవి. ఆంధ్రోద్యమము సజీవమయిన ప్రజల ఉద్యమముగ అభివృద్ధి చెంది, మహారాష్ట్ర, కర్ణాటక ఉద్యమాలకు మార్గ దర్శకమై 1946 తరువాత స్టేట్ కాంగ్రెస్ ఉద్యమములో లీనమైనది.

ఆంధ్రోద్యమము యొక్ష క్రమక్రమవ్యాప్తి ప్రభుత్వమునకు అనుమానాలు అధికము కావింపజొచ్చెను. ఈ ఉద్యమము యొక్క పరిణామము ఆంధ్ర తెలంగాణాల ఏకీకరణముగా రూపొందగలదేమో యని 1936 వ సంవత్సరములోనే హైదరాబాదు ప్రభుత్వమునకు అనుమానము కలిగినట్లు అప్పటి హోం సెక్రటరీ నవాబ్ అలీయావర్జంగ్ గారు ప్రసంగ వశమున నాల్గవ ఆంధ్రమహాసభ అధ్యక్షులైన మాడపాటి హనుమంతరావు గారికి తెలిపినట్లు ఆంధ్రోద్యమ చరిత్రలో గ్రంథస్థము కావింపబడినది. (91 వ పేజీ "తెలంగాణ ఆంధ్రోద్యమము" రెండవ భాగము). ఆనాటి ప్రభుత్వము యొక్క అనుమానము తుదకు ఈనాడు సత్యస్వరూపము దాల్చుట గమనింపదగిన విశేషము.

మొట్టమొదటి అయిదు ఆంధ్రమహాసభలు రాజకీయాల జోలికి పోలేదు. ఆంధ్రమహాసభల సమావేశాలలో వ్యాయామ ప్రదర్శనాలు, నాటక ప్రదర్శనాలు, ప్రబోధాత్మకమగు పద్యపఠనము మొదలగు సాంస్కృతిక కార్య కలాపములు ప్రత్యేక స్థానము వహించుచుండెను. ఇట్టి పరిస్థితులలో 1937 వ సంవత్సరమున నిజామాబాదులో జరిగిన ఆంధ్ర మహాసభ అరవ సమావేశమునకు చారిత్రాత్మకమగు రాజకీయ ప్రాధాన్యము కలదు. ఇందులో కారణాలు రెండు. (1) ఆంధ్రమహాసభలలో తెలుగు మాతృభాష కానివారుకూడ పాల్గొనుట జరుగు చుండెను. ఇప్పటివరకు “మహాసభా కార్యక్రమము,చర్యలు, కవిలె ఆంధ్రభాషయందే జరుగవలెనను నియమము ఒకటియుండెను. కాని నిజామాబాదు సభలో కొందరు ఉర్దూభాషలో మాట్లాడుట, దానిపై కొందరు ఆక్షేపణములు తెలుపుట, ఈ ఆక్షేపణములపై తీవ్రవాదోపవాదములు జరిగి ఆంధ్ర ప్రాంతమున నివసించువారందరు వారి మాతృభాష యేమయినప్పటికి ఆంధ్రులేయనియు,

ఆంధ్రభాష మాట్లాడలేనివారు సభావేదిక నుండి ఇతర భాషలలో మాట్లడవచ్చుననియు అధిక సంఖ్యాక ప్రతినిధులు నిర్ణయించిరి. మొదటినుండియు ఆంధ్రోద్యమ వ్యాప్తి కుల, మత, వర్గవిచక్షణములకు అతీతముగా జరుగుచుండెను. అందుచేత మహారాష్ట్రులు, కర్ణాటకులు, ముస్లింలు ఈ సభలలో పాల్గొని ప్రసంగించుట జరుగుచుండెను. కావున భాషా విషయమై పట్టుదల వహించుట సమంజసమును, రాజనీతియు కాకుండెను. కుల, మత, వర్గ, భాషా విచక్షణములను పాటింపక నిజాంరాష్ట్రాంధ్ర ప్రాంతమున నివసించు వారందరి యొక్క అభివృద్ధికై పాటుపడుట యను ఆంధ్రోద్యమము యొక్క విశాల దృక్పథమును అసందిగ్ధముగా స్పష్టీకరించుట యీ సందర్భమున జరిగినది. తత్ఫలితముగ శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి నాయకత్వమున అసంతృప్తులైన కార్యకర్తలు "అభివృద్ధి పక్షము" నొకదానిని స్థాపించిరి. కాని ఈ పక్షము చురుకుగా పని చేసినట్లు అగపడదు. క్రమక్రమముగ ఆంధ్ర మహాసభలలో రాజకీయములు ప్రాధాన్యము వహించి, భాషకు ప్రాధాన్యము తగ్గుటవలన భాషాభిమానులకు కొంత మనస్తాపము, నిస్పృహ కలిగినవి. తరువాత మెల్లమెల్లగా ఆంధ్ర భాషాభివృద్ధికి ప్రత్యేక సంస్థ కావలెనను భావము అంకురించి, వ్యాప్తిచెంది, బలపడి 1943 లో హైదరాబాదు నగరమున ఆంధ్ర మహాసభల సందర్భమున ఆంధ్ర సారస్వత సంస్కృతుల అభివృద్ధి సాధకముగ ఆంధ్ర సారస్వత పరిషత్ స్థాపన జరిగినది. అది యొక ప్రత్యేకచరిత్ర. ఆంధ్రసారస్వత పరిషత్తు యొక్క ఆశయాల మీద విజ్ఞాన చంద్రికా గ్రంథమండలియొక్కయు ఆంధ్ర జనసంఘము యొక్కయు ప్రభావము స్పష్టముగా కప్పడు చున్నదని యీ సందర్భమున గమనించవలసిన సత్యము. (2) ఈ కారణము మొదటిదానికన్న ముఖ్యమైనది. ఆంధ్ర మహాసభ కార్యకర్తలలో పెక్కుమంది కాంగ్రెసు భావాలు, జాతీయ భావాలు కలిగియుండిరి. కాని మొట్ట మొదటిసారి ఆంధ్రమహాసభా వేదిక నుండి ఈ నిజామాబాదు సమావేశములోనే బాధ్యతాయుత ప్రభుత్వము నిజాంరాష్ట్రాంధ్రుల ఆదర్శమని అర్థము నిచ్చు తీర్మానము ఆమోదింపబడినది. ఈ విధముగ ఆంధ్రోద్యమానికి