Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/727

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రోద్యమము (తెలంగాణములో)


రాజకీయాలతో సంబంధము లేదను పరిస్థితి తొలగిపోయినది. క్రమక్రమముగ బాధ్యతాయుత ప్రభుత్వస్థాపనమే ఆంధ్రమహాసభ ఉద్దేశమనునది స్థిరపడిపోయినది. ఆంధ్ర మహాసభలో మితవాద నాయకుల పలుకుబడి తగ్గసాగినది. ఈ సమావేశము తరువాత బాధ్యతాయుత ప్రభుత్వ స్థాపనకొరకు అప్పటి స్టేటు కాంగ్రెసు సత్యాగ్రహము నడిపినది. ఈసత్యాగ్రహములో ఆంధ్రమహాసభకు ప్రత్యేక సంబంధము లేకపోయినప్పటికిని ఆంధ్రమహాసభ కార్యకర్తలు వ్యక్తిగతముగ ఈ సత్యాగ్రహములో పాల్గొనిరి. అప్పటి ఆంధ్ర నాయకులలో ప్రముఖులుగానుండిన శ్రీ రావి నారాయణ రెడ్డి, శ్రీ మందుముల రామచంద్రరావు, శ్రీ జమలాపురము కేశవరావుగార్లు సత్యాగ్రహము కావించి జైలుకు పోయిరి. తరువాత 1940 లో జరిగిన మల్కాపురం ఆంధ్రమహాసభకూడ రాజకీయముగా ముఖ్యమైనది. అప్పటి హైదరాబాదు ప్రభుత్వము ప్రవేశ పెట్టిన రాజ్యాంగ సంస్కరణములను బహిష్కరింపవలెనను తీర్మానము ఈ మహాసభలో అతివాదులైన శ్రీ రావి నారాయణ రెడ్డి గారు ప్రవేశపెట్టిరి. దీనిని మితవాదు లైన శ్రీమందుముల నరసింగరావు, శ్రీ మాడపాటి హనుమంతరావు, శ్రీ కొండా వేంకట రంగారెడ్డిగార్లు ప్రతిఘటించిరి. అయినప్పటికి తీర్మానము నెగ్గినది. ఈసందర్భమున “ఏడవ ఆంధ్రమహాసభ నాటికి యువనాయకత్వము బలపడినది" అని ఆంధ్రోద్యమ చరిత్రకారులు గ్రంథస్థము కావించి యున్నారు. (తెలంగాణ ఆంధ్రోద్యమము రెండవభాగము పుట 142)

1942 లో ఓరుగల్లు సమీపమున ధర్మవరము గ్రామ మందు జరిగిన ఆంధ్ర మహాసభకూడ రాజకీయముగ చాల ముఖ్యమైనది. ఇందులో శ్రీ రావి నారాయణ రెడ్డిగారు క్రొత్త ఆదర్శములచే ప్రేరేపితులై ముందునకు వచ్చిరని 'ఆంధ్రోద్యమ చరిత్ర' కారులు వ్రాసి యున్నారు. క్రమక్రమముగ ఆంధ్ర మహాసభలో శ్రీ నారాయణ రెడ్డిగారొక నూతన వర్గమునకు నాయకత్వము వహించిరి. తత్ఫలితముగా తరువాత జరిగిన సభలలో జాతీయ పక్షమనియు, కమ్యూనిస్టు పక్షమనియు రెండు ప్రస్ఫుటమైన వర్గాలు ఏర్పడినవి. భువనగిరిలో జరిగిన పదునొకొండవ ఆంధ్రమహాసభలో రావి నారా యణరెడ్డిగారి పక్షము ప్రాబల్యము వహించినది. మితవాదులు జాతీయ వాదులు ఇందు పాల్గొనలేదు. భువనగిరి మహాసభ తరువాత ఆంధ్ర మహాసభ రెండు మహాసభలుగా చీలిపోయినది. ఒకటి జాతీయాంధ్ర మహాసభ, రెండవది శ్రీ రావి నారాయణ రెడ్డిగారి ప్రాబల్యము కలిగిన ఆంధ్ర మహాసభ. భువనగిరి మహాసభను బహిష్కరించిన ఆంధ్ర నాయకులు 1945 వ సంవత్సరమున మడికొండలో శ్రీ మందుముల నరసింగరావుగారి అధ్యక్షతన పండ్రెండవ మహాసభ కావించిరి. ఈ మహాసభకు శ్రీకొండా వేంకట రంగారెడ్డిగారు పెట్టనికోటయై యుండిరి. ఆంధ్రపితామహ మాడపాటి హనుమంత రావు పంతులుగారి ఆశీస్సులు ఈసభకు లభించినవి. శ్రీ బూర్గుల రామకృష్ణారావు పంతులుగారి సానుభూతికూడ ఈ మహా సభకు లభించినది. కీ. శే. జమలాపురం కేశవరావుగారు కూడ ఈ మహాసభనే బలపరచిరి. శ్రీ రావినారాయణ రెడ్డి వర్గమువారు పండ్రెండవ ఆంధ్ర మహాసభను ఈ సంవత్సరమే ఖమ్మం పట్టణములో జరిపిరి. ఈ విధముగ ఆంధ్ర మహాసభ రెండుగా చీలిపోయినది. తరువాత 1946 లో కీ. శే. జమలాపురం కేశవరావుగారి అధ్యక్షతన పదుమూడవ మహాసభ మెదకు జిల్లాయందలి కందిగ్రామమున జరిగినది. ఇదియే తుట్టతుది ఆంధ్ర మహాసభ. వైజ్ఞానికోద్యమముగ ప్రారంభమైన ఆంధ్రోద్యమము బాధ్యతాయుత ప్రభుత్వమే తన ఆదర్శముగా నిర్ణయించుకొన్న ఉద్యమముగ పర్యవసించినది.

కందిమహాసభ తరువాత ఆంధ్రమహాసభ స్టేటు కాంగ్రెసులో లీనమయి, స్టేటు కాంగ్రెస్ ఆంధ్రప్రాంత సంఘముగా రూపొందినది. ఈ స్టేటు కాంగ్రెస్ ఆంధ్రప్రాంత సంఘము యొక్క మొదటి సమావేశము 1947 లో జడ్చర్లలో జరిగినది. హైదరాబాదులో పోలీసుచర్య జరిగిన తర్వాత స్టేటు కాంగ్రెసు హైదరాబాదు ప్రదేశ్ కాంగ్రెసుగా రూపొందినతరువాత ప్రత్యేకముగ హైద్రాబాదులొ ఆంధ్రప్రాంతమునకు కాంగ్రెసు కమిటీకి అవకాశము లేక పోయినది.

పదునారు సంవత్సరాల వయస్సుకలిగిన ఆంధ్రోద్యమ చరిత్రలో మొత్తము పదుమూడు ఆంధ్ర మహా సభలు జరిగినవి. వీని కధ్యక్షతవహించిన పెద్దలు (1) కీ.శే