Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/715

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రులు - వాణిజ్యము


బండి సుబ్బారావుగారు “గణపతిదేవుని కాలమున, తూర్పు తీరము జయింపబడినతోడనే విదేశములతో వర్తకము విరివిగా సాగనారంభించెను. గుంటూరుజిల్లాలోని మోటుపల్లి గొప్ప రేవు పట్టణమై వరలెను. తూర్పునందు బర్మా,చైనా, తూర్పు దీవులు, సింహళము మున్నగువాటి తోడను, పశ్చిమమునందు అరేబియా, పారశీకము, ఈజిప్టు మొదలగు దేశముల తోడను, వర్తకము సాగుచుండెను. గణపతిదేవుని మోటుపల్లి శాసనమునుబట్టి విదేశ వర్తకమును వృద్ధిచేయుటకై అతడు 'కూఫ' శుల్కము తప్ప తక్కిన పన్నుల నన్నిటిని రద్దుచేసినట్లును, వర్తకులను, వారి యోడలను రక్షించినట్లును తెలియుచున్నది. అతడు ఓడదొంగలను శిక్షించెను; ఆయా వస్తువులపై సుంకముల నిర్ణయించెను. ఆ కాలమున శ్రీగంధము, కర్పూరము, ముత్యాలు, దంతము, లోహము, నూలు బట్టలు, కంబళ్ళు, సుగంధ ద్రవ్యములు, మిరియాలు, రత్నములు ఎగుమతి చేయబడుచుండెను. పట్టు సామానులు, గాజు, చీనాకర్పూరము, పంచదార, గుఱ్ఱములు, దిగుమతి యగుచుండెను. ఇట్లే మచిలీపట్టణముగూడ ఆ కాలమున గొప్ప ఓడరేవుగాను, వర్తక స్థలముగాను ఉండేను."

కాకతీయుల కాలమునాటి పరిస్థితులను మార్కో పోలో అను విదేశయాత్రికుని వర్ణనల వలన తెలిసికొనవచ్చును. మోటుపల్లి రేవునుండి సాలీడు దారమువలె సన్నముగా ఉండెడు గుంటూరు పత్తిదారముతో నేసిన మల్లు సెల్లాలు ఎగుమతి అగుచుండెడివట. మోటుపల్లి వద్ద వజ్రాల గను లుండెడివని 'నికోలో కొంటి' అను ఇంకొక యాత్రికుడు వ్రాసినాడు. ఈ జిల్లాలో దొరకిన రోమను బంగారు నాణెములు విదేశవర్తకములో ఆంధ్రులు సంపాదించుకొన్న వని మనకు తెలియుచున్నది. కాకతీయులు స్వయముగా నాణెములను ముద్రించి వ్యవహారములో ఉంచినట్లు వ్రాయబడి ఉన్నది. ఆనాడు దేశములో వర్తకపు వస్తువులమీద పన్నులను కాకతీయులు విధించినట్లు తెలియుచున్నది. వీటినే ఇప్పుడు మనము "వ్యాపార సుంకములు" (Commercial Taxes) అని అనుచున్నాము. వరంగల్లుకోటకు పోవు మార్గములో, ఖానాసాహెబుతోట వద్దనున్న శాసనములో, దేశవ ర్తకముపై ఆనాడు విధింపబడిన పన్నులు ఈ క్రిందివిధముగా వర్ణింపబడినవి :-- నీలి - మాడకు రెండు వీసాలు, పోకలు లక్షకు పాతిక, కూరగాయలు బండికి పాతిక, మామిడి, కొబ్బరి మొదలయినవి బండికి పాతిక, నూవులు, గోధుమలు,పెసలు, వడ్లు, జొన్నలు - బండికి మానెడు, ఉప్పు- బండికి పది పెరుకల మానెడు- ఆవాలు మొదలగు కొలబండాలు మాడకు పాతిక, తగరము, సీసము, రాగి, తులము 1 కి ఒక పలము, చందనము తులము 1 కి ఫలము ; కర్పూరము వీసెకు 2 చిన్నాలు. జవాది మాడ (కు) పరక, కస్తూరి – 100 చిన్నాలకు 2 చిన్నాలు. పట్టు నూలు - తులం 1 కి చిన్నము, ఇవిగాక మంజిష్ఠము, ముత్యము, రుద్రాక్ష, గాటపూస మున్నగు వాటి యందును, పసుపు, ఉల్లి, జాజు, కంద, పెండలము మొదలగు ధుంపదినుసులయందును వర్తకము జరుగుచుండెడిది.

కాకతీయుల సామ్రాజ్యానంతరము ఆంధ్రదేశములో స్థాపించబడినది విజయనగర సామ్రాజ్యము. ఆ కాలములోనే మధ్యాంధ్ర, ప్రాగాంధ్ర ప్రాంతములలో రెడ్డి రాజులు బలిష్ఠమైన దుర్గములను నిర్మించుకొని రాజ్యము చేసిరి. వినుకొండ, కొండవీడు, ఉదయగిరి, నెల్లూరు, కొండపల్లి, నిడదవోలు మున్నగు దుర్గములకు అధిపతులయిన రాజుల రాజ్యములు అవిచ్ఛిన్నములుగా సాగినవి. వర్తక వ్యాపారాలు విజృంభించినవి. లలితకళలు కొనసాగినవి. చిన్న చిన్న పరిశ్రమలు అనేకములు అభివృద్ధి చెందినవి.

పరిశ్రమలు : గ్రామము పరిశ్రమలకు మూలాధారముగా ఉండెడిది. విశ్వకర్మ పుత్రులగు కంసాలి, కమ్మరి, వడ్రంగి, కుమ్మరి, సాలె, గృహ నిర్మాణకర్త అనువారు బయలుదేరినారు. శివలింగ నిర్మాణములోను, దేవాలయ నిర్మాణములోను ఎక్కువ ప్రతిభ వ్యక్తమగుచుండెడిది. సొమ్ములు చేయుట యొక ప్రత్యేక కళగా వర్ధిల్లెను.రెడ్డిరాజుల వైభవమునకు తగినట్లుగా సొమ్ములు చేయుట విశేష ప్రతిభావంతమైన పరిశ్రమగా తయారయినది విజయనగర సామ్రాజ్యమునందలి సింహాసనమును గురించి అబ్దుర్ రజాకు అను నాతడు "చాల పెద్దదిగా బంగారుతో చేయబడిన ఈ సింహాసనము మణులతో పొదగబడి, ప్రపంచములో ఎక్కడను లేని పనితనముతో కూడినది" ఆ