Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/702

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రులు - చిత్రకళ


ధనికులు విలువైన చిత్రములతో గృహములను అలంకరించుకొనుచుండిరి. వాటిని చిత్రాగారము లనుచుండిరి. రాణివాసమునందు శయనాగారములందు చిత్రము లుండెడివి. స్నాన గృహములందు, సూతికా గృహము లందును, కళాఖండములను అలంకారములుగా నుంచు కొనుచుండిరి. గృహములలో శృంగార, హాస్య, శాంతరస సూచకములయిన చిత్తరువు లుండెడివి. నగరులలో, రాజ ప్రాసాదములలో, వేటకు, యుద్ధమునకు, రాసలీలకు, పానగోష్ఠికి సంబంధించిన చిత్రములు పలురకములవి ఉండెడివి. ఆనాటి నాగరక జీవనము, రసికత, చిత్రకళ,క్రీడాభిరామము మొదలైన గ్రంథములలో కనిపించు చున్నవి.

ప్రతాపరుద్రుని ఆస్థాన నర్తకియైన మాచల్దేవి చిత్రశాలలో శివుని దారుకావన విహారము, వాణీ చతుర్ముఖులు, గోపికా కృష్ణులు, అహల్యాపురందరులు, తారాచంద్రులు, దాశక న్యాపరాశరులు, మేనకావిశ్వామిత్రులు మొదలైన చిత్రము లుండెను.

ఉ. "తియ్యని వింటిజోదు రతి
       దేవి చనుంగవ నొత్తిగిల్లి యొ
య్యెయ్యన వంక చక్కఁబడ
       నో త్తెడుఁ జూచితే పుష్పబాణముల్
మయ్యెర వ్రాసెఁ జిత్తరువు
       మాఁగిలి మాఁగిలి ; చిత్రకారుడా!
దయ్యముగాక; నీవి షన
       దానము టిట్టిభ ! వీనికేఁ దగున్ "

అని రతీమన్మథులను రచించిన చిత్రకారుని మంచన శర్మ అనువాడు ప్రశంసించినట్లు క్రీడాభిరామములో వర్ణితమైనది. తత్కర్తయగు శ్రీనాథుడు 15వ శతాబ్దివాడైనను, క్రీడాభిరామమునకు మాతృకయైన ప్రేమాభిరామమును వ్రాసిన సంస్కృత కవి, ఓరుగల్లు ప్రాభవమును కన్నులార చూచియున్నవాడుగనుక, క్రీడాభిరామములో అభివర్ణితమైన విషయములు యథార్థములుగ తీసికొని గ్రహింపవచ్చును.

ఆనాడు నాట్యశాలలందు మనోహరమైన చిత్తరువులు అమర్చబడి ఉండెడివి. 'రాయల రాజధాని యగు విజయనగరమున నాట్యశాలలను వర్ణించుచు అబ్దుల్ రజాక్ ఈ విషయములు పేర్కొని యున్నాడు. రాజకుమారులయు, రాజకుమారిక లయు తస్వీరులు చిత్రకారులు చిత్రించు చుండిరి. వీటివల్ల వివాహములు కూర్చుట జరుగు చుండెను.

పింగళి సూరన రచించిన ప్రభావతీ ప్రద్యుమ్నములో కథకు జీవమైన ఒక చక్కని సన్ని వేశము కలదు. రాక్షసరాజైన వజ్రనాథుని కుమార్తె కలలో, పార్వతి ప్రత్యక్షమై సంకల్పమాత్ర తక్షణ సన్ని ధాపితంబగు చిత్రఫలకంబు నందు నొక్క పురుషు ప్రాయంపువాని వ్రాసి, “ఇతండ వల్లభుండు", అని చెప్పి యా చిత్రఫలక మిచ్చి అంతర్ధాన మందెను, అంత నా ప్రభావతి చెలికత్తియతో నా వృత్తాంతము చెప్పి చిత్రఫలకము చూపును. అప్పలక పావడ యెడలించి--

"కలకల నవ్వినట్ల, తెలికన్నుల నిక్కమ చూచినట్ల తో
బలుకఁ గడంగినట్ల, కడు భావగభీరత లబ్బినట్ల, పెం
పొలయఁదనర్చి జీవకళ యుట్టిపడన్ శివవ్రాసినట్టియా
చెలువున కాభిముఖ్యము భజింపఁ దలంకెను దాను
బోటియున్.

పోతన భాగవతమున ఉషాపరిణయమున చిత్రరచనా విధానముకూడ వర్ణింపబడినది. "ధళధళ మెఱుంగులు దుఱంగలిగొను పటంబు నావటంబు సేసి వజ్రంబున మేదించి, పంచవన్నియలు వేరువేరు కనక రజత పాత్రంబుల నించి; కేలం దూలిక ధరించి " చిత్రరేఖ రచన కుపక్రమించును. ఈ విధానము పశ్చిమ చాళుక్యరాజగు సోమేశ్వరుడు రచించిన అభిలషి తార్థ చింతామణిలో రంగులు, కుంచెలు, వాటి ఉపయోగ పద్ధతులు వర్ణితము లయినవి. గోడలమీద, పలకలమీద, పటములమీద చిత్ర రచనలు చేసెడివారని చెప్పబడినది.

వ్యక్తిగతమైన ఒక దేవతామూర్తిని ఆరాధించుట యనునది మానవ సహజమైన ప్రవృత్తి. అది హిందూమతములో నేకాక బౌద్ధ, జైనమతములలో కూడ గలదు. బౌద్ధములో మౌర్య, సంగ, పూర్వాంధ్ర యుగములలో గొప్పమార్పులు వచ్చినవి. హీనయానములో బుద్ధుడు మహా సంబుద్ధియై నిర్వాణము చెందిన ఒక వ్యక్తి - అంతే! తరువాతవచ్చిన మహా యానములో బుద్ధుడు ఒక ధర్మానికి ఆదర్శమూర్తియై అవతరించి మానవులకు ఎంతగా