Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/701

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రులు - చిత్రకళ


ఆ గుహాకుడ్యాలపైన అపురూపమైన కళాసంపత్తితో, రసస్ఫూర్తితో చిత్రించి వేసిరి. తరువాత వచ్చిన మహా యాన బౌద్ధములో అజంతా చిత్రకారుని రెక్కలు నిజముగా విడివడి అనంతపథ విహారము చేసినవి. అంతవరకు హీన యానములో 4 శతాబ్దులవరకు తూష్టీం భావమును వహించియున్న చిత్రకారుడు ఒక్కసారి తనచుట్టునున్న సుందర ప్రపంచము నంతను అవలోకించెను. రమణీయ పరిసరస్థ ప్రకృతినంతయు తన కళాలోకములో దివ్య కాంతుల మిలమిలలాడించినాడు. వ్యవసాయ దృశ్యములు, మహానగరములు, పల్లెలు - తోటలు, కమలాకరములు - వీటిని ఒక మహాకావ్యముగా సృష్టించివేసినాడు. లేళ్ళు, గుఱ్ఱాలు, ఏనుగులు, హంసలు, కోతులు,పక్షులు, మున్నగున వన్నియు జీవకళలూరుచు చిత్రకారుని ప్రతిభచే దృశ్యములయ్యెను. పూలకారుగా విరిసిన ఇట్టి చిత్రసమున్మేషమును తిలకించియే సర్ విలియమ్ రోథెన్ స్టైన్ ప్రాపంచిక సౌందర్యములో నుండియే అతి లోకమైన ఆధ్యాత్మిక సత్యసౌందర్యమును చూపింప గలిగెడు భారతీయ చిత్రకారుల శక్తి అజంతా గుహలలో సందర్శింపగలిగినా నని అన్నారు.

స్త్రీపురుష శరీరావయవాలలో మిలమిలలాడే తారుణ్యము, వన్యమృగాలలో తూగాడే ఏపు, బలుపు, పూవులలో పక్షులలో వెల్లివిరిసిన పావిత్య్రము, లావణ్యము అజంతా చిత్రకారులు అతిలోకముగా చిత్రించినారు. రంగుల రాళ్ళతో తయారుచేసికొన్న కొలదిపాటి రంగులతో, తాము కట్టుకొనిన తూలికలతో అంత లోకాద్భుతమైన చిత్రసంచయము సంతరించగలిగినా రన్నచో ఆ చిత్రకారులు మహాసమర్థు లని చెప్పవలెను. బుద్ధుని జీవితము, జాతక కథలేకాక సమస్త చరాచర ప్రకృతిని ప్రతిబింబించు అలంకార, భావ, కథాచిత్ర ప్రపంచము, లోకోత్తరముగా, అజంతా గుహలలో విన్యసించబడి ఉన్నది,

చిత్రలేఖనము పల్లవుల కాలములో నరసింహవర్మ కట్టించిన గుళ్ళనిండ ఉండుచుండెను. అయితే అదంతయు కాలగర్భమున మునిగిపోయినది. కాని పల్లవ చిత్రలేఖనము నేటికిని "సీతన్న వాసలు" అను గుహలయందు చూడ గలము. ఆ గుహలు పుదుక్కోట సంస్థానములో ఉన్నవి. అందలి చిత్రలేఖనము అజంతాకు అనుగుబిడ్డ, ఈ చిత్ర ములు కొన్ని నూతన లాలిత్యమునుకూడ పుణికి పుచ్చుకొన్నవి.

పుదుక్కోటదగ్గరనున్న పీతన్న వాసలు అను గుహలు పల్లవరాజైన మొదటి మహేంద్రవర్మ (600-625) కాలము నాటివి. గుహాలయము పైకప్పున నిలచి ఉన్న "పద్మసరోవరము" అత్యుత్తమ చిత్రము. అందు పద్మాల మధ్య చేపలు, హంసలు, మహిషములు, ఏనుగులు, ముగ్గురు పద్మపాణులైన గంధర్వులు చిత్రింపబడినారు. స్తంభాలమీద అచ్చరలేమల చిత్రాలు ఉన్నవి. ఒక దేవదాసి చిత్రము, అర్ధనారీశ్వర చిత్రము గలవు.

ఎల్లోరా కైలాసనాథ దేవాలయము అంతయు చిత్రలేఖనముతో నిండి ఉండినది. దానికి వేసిన వెల్లక్రింద అది మరుగుపడి ఉన్నది. ఈమధ్య నైజాము ప్రభుత్వము కృషి ఫలితముగా వెల్లక్రింద అణగిఉన్న ఈ చిత్రములు బయట పడ్డవి. కాలక్రమముగా వచ్చిన లావణ్యము ఈ రచనలలో గోచరించును.

ఎల్లోరాలో కైలాసనాథ దేవాలయము పైకప్పు మీదనే చిత్రాలున్నవి. దీనిని రాష్ట్రకూటుడైన రెండవ కృష్ణుడు 757-783 సంవత్సరాలమధ్య నిర్మించినట్లు చరిత్రకారుల యభిప్రాయము. ఈ కృష్ణరాజునకు కుష్ఠ రోగమువచ్చి ఎల్లోరా వద్దనున్న ఒక నూతిలోని నీటిని సేవించగా వ్యాధి నయమయినదట. ఆ సందర్భముగా శివభక్తుడైన ఆరాజు కైలాస దేవాలయమును నిర్మించుటకు పూనుకొన్నాడట !

ఈ నిర్మాణమునకు అజంతా, మహాబలిపుర శిల్పుల వంశ్యులైన ఆంధ్ర శిల్పులను రావించి కైలాస పర్వత సౌందర్యానికి ఏమాత్రము దీటుపోని ఒక శిల్ప కైలాసమును కృష్ణరాజు నిర్మింపించెనట. ఎల్లోరా ఆంధ్రశిల్పులు, అజంతా శిల్పులకు చిత్రలేఖన ప్రావీణ్యమున ఎంతమాత్రము తీసిపోవువారు కారు అని కీ. శే. అడవి బాపిరాజు గారు వచించిరి.

మధ్య యుగము  : బౌద్ధ విహారములు, దేవాలయములలోనే కాక జనసామాన్యమునకు విజ్ఞానమును, వినోదమును సమకూర్చుటకు రాజమందిరాలలోను, నగర మధ్య మంధును మేలురకముచిత్రములు సేకరించబడి ప్రదర్శించబడు చుండెడివి. నాగరకులలోని పెద్దలు, సామంతులు,