Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/694

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర సినిమా పరిశ్రమ

ఇంకను పరిపత్తు చేయవలసిన భాషా సేవయెంతయు గలదు. సజాతీయేతర భాషలతో సాదృశ్యమును నిరూపించు నొక వ్యాకరణమును రచించుట, పారిభాషిక నిఘంటురచనము మొదలగు పరిషత్ప్రయోజనములు సాఫల్యము నొందవలసి యున్నవి.

చ. స.శా.

ఆంధ్ర సినిమా పరిశ్రమ: - పరిశ్రమలలో సినిమా పరిశ్రమ ఏడవది. ప్రపంచములో చిత్రనిర్మాణము చేసెడు దేశాలలో హిందూదేశము మూడవ స్థానమును సంపాదించుకొన్నది. మొన్న మొన్నటి వరకును అమెరికాకు తరువాతిది గానే ఉండెడిది. కాని ఆ రెండవ స్థానమును జపాను సంపాదించుకొనుటవల్ల మూడవ స్థానమునకు మారవలసివచ్చినది.

మూగచిత్రాల నిర్మాణదశ : 1903 వ సంవత్సరమున "క్రీస్తు జీవితము" అను చలనచిత్రము మొదటిసారిగా హిందూ దేశీయులు చూచినారు. అప్పటినుండి 1910 వరకు ఇతర దేశపు చిత్రములు చూపుచు వచ్చినారు. 1911 నాటికి "రాజదర్బారు" అను చిత్రమును, తొలిగా హిందూ దేశీయులు నిర్మించినారు. 1913 లో దున్దిరాజ గోవిందఫాల్కే అను నాయన 'హరిశ్చంద్ర' చలనచిత్రము నిర్మించినాడు.

మద్రాసులో రఘుపతి వెంకయ్యగారు 'గెయిటీ' టాకీసు మొట్టమొదట కట్టించినారు. ఇదే తెలుగువారి మొదటి సినిమా హాలు. ఆ తరువాత ఆయనే గ్లోబు (ఇప్పటి రాక్సి), క్రౌను థియేటర్లు కట్టించినాడు. ఈ సినిమా హాలులవల్ల మంచి లాభాలు రాసాగినవి. అందువలన ఆయన కుమారుడైన సూర్యప్రకాశరావును (ఆర్.యస్. ప్రకాశ్) సినిమా సాంకేతిక విద్యను నేర్చుకొని రమ్మని హాలివుడ్డుకు పంపినాడు, ప్రకాశ్ హాలివుడ్డులో సిసిల్ బి. డి. మిల్లి దగ్గర శిక్షణమును వడసినాడు, సినిమా సాంకేతిక జ్ఞానమును సాకల్యముగ గ్రహించినాడు. 'మెట్రోగోల్డ్విన్ మేయర్సు' చిత్రములో ఒక వేషము గూడ వేసినాడు.

శ్రీ ప్రకాశ్ స్వదేశమునకు వచ్చిన తరువాత 1923 లో "భీష్మ" అనెడు చిత్రమును నిర్మించినాడు. అది విజయ వంతముగా ఆడినది. . ఇతడు "స్టార్ ఆఫ్ యీస్టు ఫిల్ము

కంపెని" అను పేరుతో ఒక శిల్పగృహము (స్టూడియో)ను 1926 లో నిర్మించినాడు. ఇతనితో భాగస్వామిగా మద్రాసు వాసియైన ఆర్. నారాయణ చేరినాడు. "జనరల్ పిక్చరు కార్పొరేషన్" అనెడు సంస్థను స్థాపించి, వీరిరువురు చిత్రాలు దీయ దొరకొన్నారు. ఆర్. యస్. ప్రకాశ్ 'గజేంద్రమోక్షము', 'నందనారు', అను చిత్రాలను తీసినాడు. 1927 నాటికి నారాయణ ఇతర దేశములకు వెళ్లి, పరిశ్రమకు గూర్చి తెలిసికొని తిరిగి వచ్చినాడు. వచ్చిన వెంటనే అతడు ద్రౌపదీ వస్త్రాపహరణము', 'కీచక వధ' తీసినాడు.

1929 లో ఏలూరు వాస్తవ్యులయిన శ్రీ మోతే నారాయణరావు గారు " గ్యారంటీ ఫిలుముసు " అనెడు సంస్థను స్థాపించి, ఆర్. యస్. ప్రకాశ్ దర్శకునిగా నియమించుకొని, "కన్యకా పరమేశ్వరి" అనెడు చిత్రమును దీసినారు. జనరల్ పిక్చరు కార్పొరేషన్ లో శ్రీ వై.వి. రావు శిల్పి (ఆర్టిస్టు), దర్శకుడుగా, నటుడుగా నుండెను. వీరి ఛాయాగ్రాహకుడుగా ( కెమేరా మేన్ జితిన్ బెనర్జి పనిచేసెను.

మద్రాసులో నిట్లుండగా, శ్రీ హెచ్. యం. రెడ్డిగారు బొంబాయి, కొల్హాపూరులలో మూగ చిత్రాలు తీయసాగిరి. ప్రకాశ్ గారి దగ్గరనున్న ఫోటోగ్రాఫరు రంగయ్య తోడ్పాటుతో శ్రీ సి. పుల్లయ్యగారు "మార్కండేయ” తీసినారు. దీనిలో పుల్లయ్యగారే యముని పాత్ర వహించినారు.

ఆనాటి చిత్ర పరిశ్రమ, చిత్ర నిర్మాణములను గూర్చి తలచుకొనినచో నవ్వుగా నుండును. ఆ రోజులలో చిత్ర నిర్మాణ శాలలు పెద్ద భవనముల ఆవరణములలో నుండుచుండెను. ఈ రోజులలో వలె సెట్సు వేసేవారు కాదు. నాటకాలలో వలె తెరలు ఉపయోగించెడువారు. నటీనటులను ఆంగ్లోయిండియనుల నుండి, వేశ్యల నుండి ఎన్నుకొనెడువారు. ఒక చిత్రమునకు నిర్మాణ వ్యయము పదునైదువేల నుండి ఇరువది వేల వరకు ఉండుచుండెను. ఒక్కొక చిత్రమునకు మూడు అచ్చు ప్రతులు (ప్రింట్లు) మాత్రమే తీసెడివారు. అవి నూట యేబది సార్లు ఉపయోగించగానే నిరుపయోగమయి పోవుచుండెను. పంపక దారు (డిస్ట్రిబ్యూటరు) అనువాడు ఆరోజులలో లేనేలేడు.