ఆంధ్ర సాహిత్య పరిషత్తు
గారు, మొక్కపాటి సుబ్బారాయడు గారు, చెన్నా ప్రెగడ భానుమూర్తిగారు మొదలగు పెద్దలతో నాలోచించి 1911 సం. మేనెల 12 వ తేదీన చెన్నపురమున నొక సభ నేర్పాటు చేసిరి. ఆసభకు శ్రీ మహారాజావారధ్యక్షత వహించిరి. ఆ సభలో ఈ పరిషత్తు స్థాపింపబడెను. వంగీయ సాహిత్య పరిషన్నామమునుబట్టి ఈసంఘమునకు “ఆంధ్ర సాహిత్య పరిషత్తు" అని నామకరణము గావింపబడెను. "దేశభాషలందు తెనుగు లెస్స" అను వాక్యము పరిష దుద్దేశ సూచక సంగ్రహవాక్యము (Motto) గను, సరస్వతీ విగ్రహము పరిషల్లాంఛనము (Crest) గను, గ్రహింపబడెను.
నాటినుండి నేటివరకు పరిషత్తు తన యాశయముల నిర్వహించుటకై నిరంతరకృషి సల్పుచున్నది.
పరిషదాశయములలో ప్రధానమైనవి :
- 1. తెలుగుభాషకు సర్వంకషమగు నొక నిఘంటువును రచించి ప్రకటించుట.
- 2. సజాతీయేతర భాషలతో గల సాదృశ్యము నిరూపించుచు నొక వ్యాకరణము రచించుట.
- 3. పారిభాషిక పదములను నిర్ణయించి వివరించు శబ్ద కోశమును సంతరించుట.
- 4. తెలుగుదేశము యొక్కయు, ప్రజల యొక్కయు చరిత్రమును రచించుట.
- 5. తెలుగుభాషకును, వాఙ్మయమునకును సంబంధించిన విషయములను చర్చించు నొకపత్రికను ప్రకటించుట.
- 6. ముద్రితాముద్రిత గ్రంథములతో నొక పుస్తక భాండాగారమును నెలకొల్పుట.
- 7. తెలుగు సాహిత్యమున పరీక్షలు గావించి పారితోషి కాదు లొనగుట.
- 8. ఆంధ్రభాషా వాఙ్మయముల అభివృద్ధికి ఉపకరించు నన్నిపనులు చేయుట.
పరిషత్ప్రథమ వార్షిక మహాసభ 1912 వ సంవత్సరము ఏప్రియల్ 6, 7 వ తేదీలలో చెన్నపురియందు జరిగెను. వాటినుండి ప్రతి సంవత్సరము వార్షికమహాసభలు అచ్చటచ్చట జరుగుచున్నవి.
పరిషత్తు ప్రకటించు సూర్యరాయాంధ్ర నిఘంటు నిర్మాణమునకగు వ్యయమంతయు పరిషత్తునకు యావ జీవాధ్యక్షులగు శ్రీ పిఠాపురము మహారాజావారు భరించి నిఘంటు నిర్మాణమును పూర్తి గావించిరి. ప్రస్తుతము 4 సంపుటములు మాత్రము ముద్రితములయినవి. తక్కిన సంపుటములు ముద్రణమునందున్నవి.
“ఆంధ్ర సాహిత్య పరిషత్పత్తిక" అను పేర నీ పరిషత్తునకు అనుబంధముగ ఆంధ్రభాషా వాఙ్మయ, చరిత్రములను చర్చించు పత్రిక యొకటి వెలువడుచున్నది. ఈ పత్రిక రెండుమాసముల కొకమారు వెలువడుచున్నది. ఆంధ్రభాషా కోవిదులందరు దీనికి వ్యాసముల నంపుచుందురు.
ఈ పరిషత్తున కొక గొప్ప పుస్తక భాండాగారము గలదు. ఇందు ముద్రితములైన గ్రంథములు పదివేలున్నవి. ఈ భాండాగారము నందలి విశేష మేమనిన- అముద్రితము లయిన తాళపత్రగ్రంథములు, కాగితపు బ్రతులు దాదాపు ఆరువేలు గలవు. ఆంధ్రలోక మెరుగని అపూర్వ గ్రంథము లెన్నియో ఇందు గలవు. ఆంధ్రవాఙ్మయ పరిశోధకుల కీ ఖాండాగారము పెన్నిధియని చెప్పవచ్చును. విశ్వవిద్యాలయములనుండి ఆంధ్రభాషా పరిశోధకులగు విద్యార్థులిచటి పరికరములను వినియోగించుకొనుచున్నారు. ఇ య్యముద్రిత పుస్తక భాండాగారము నుండి పరిషత్తు తన పత్రికా ముఖమున డెబ్బది అపూర్వగ్రంథముల నాంధ్రలోకమున కందిచ్చినది.
- 1. కవిజనాశ్రయము - వేములవాడ భీమకవి.
- 2. శివరాత్రిమాహాత్మ్యము - శ్రీనాథ మహాకవి,
- 3. శివత త్త్వసారము - పండితారాధ్యుడు.
- 4. విప్రనారాయణ చరిత్రము - చెదలవాడ మల్లన.
- 5. బాలసరస్వతీయము - బాలసరస్వతి.
- 6. శివలీలా విలాసము-నిశ్శంక కొమ్మనామాత్యుడు.(మొదలగునవి)
ప్రాచీన తామ్రశిలాశాసనములు 38 విమర్శన పూర్వకముగా పరిషత్పత్తికయందు ప్రకటింపబడినవి. ఇందు శాసన ప్రతిబింబములుకూడ గలవు. ఇవి ఆంధ్రదేశ చరిత్రమున కెంతయు నుపయోగించునవి. వివిధ పాఠ భేదము లతో శ్రీ కాళహస్తి మాహాత్మ్యము, పారిజాతావహరణము, క్రీడాభిరామము, భీమేశ్వరపురాణము మొదలగు గ్రంథములు ముద్రణమునకు సిద్ధముగానున్నవి.