Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/691

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర సారస్వత పరిషత్తు


వలె పరిషత్తు మన రాష్ట్రము నందలి ప్రతిపల్లెను విజ్ఞానముచే ప్రకాశవంతము గావించుచున్నదని తెలిపిరి. "ఆంధ్ర పితామహ శ్రీ మాడపాటి హనుమంతరావుగారు తమ ఆంధ్రోద్యమ చరిత్రలో పరిషత్తు కృషి ఒక మహోద్యమము వలె తెలంగాణమున వ్యాపించుచున్నదని వ్రాసినారు. పరీక్షలతోపాటు అక్షరాస్యతా వ్యాప్తికి పరిషత్తు కృషి చేయుచున్నది. పోలీసు చర్య తరువాత ఇప్పటివరకు పరిషత్తు 114 రాత్రి పాఠశాలలను జిల్లాలలోని పల్లెటూళ్ల యందును, కొత్తగూడెము వంటి కార్మిక కేంద్రాలయందును నిర్వహించినది. ఈ పాఠశాలలలో సుమారు ఎనిమిది వేల మంది నిరక్షరాస్యులు అక్షరాస్యులు గావింపబడిరి. వయోజనులను అక్షరాస్యులను గావించుటకొరకు ఉపాధ్యాయ శిక్షణ శిబిర మొకటి పరిషత్తు 1950వ సంవత్సరమున నిర్వహించినది. 1951వ సంవత్సరమున ఫిబ్రవరి 17వ తేది నుండి 21 వ తేది వరకు పరిషత్తు తెలంగాణమున వయోజన విద్యా వారమును జయప్రదముగా నిర్వహించినది. 1950 లో జబల్పూరులో జరిగిన వయోజన విద్యా ప్రచార గోష్ఠిలో పరిషత్తు ప్రతినిధులు పాల్గొని యావద్భారతమున జరుగు వయోజన విద్యా ప్రచార పద్ధతిని ఆకళింపు చేసికొనిరి. తరువాత 1953 వ సంవత్సరమున అలహాబాదులో నిర్వహింపబడిన వయోజన శిక్షణాలయమునకు పరిషత్తు ఒక కార్యకర్తను పంపి శిక్షణము నిప్పించినది. భారత ప్రభుత్వమువారు మొదటి పంచవర్ష ప్రణాళిక క్రింద నిరుద్యోగులకు ఉద్యోగము కల్పించు ఉద్దేశముతో ఏర్పాటు చేసిన సాంఘిక విద్యా ప్రణాళిక క్రింద ప్రభుత్వ సహకారముతో పరిషత్తు హైదరాబాదు నగరమున 11 సాంఘిక విద్యా కేంద్రములను రెండు సంవత్సరాలనుండి అత్యంత సామర్థ్యముతో నిర్వహించుచున్నది.

పరిషత్తు ఇప్పటివరకు దాదాపు నలుబది గ్రంథాలను ప్రకటించినది, ఇందులో పండిత సారస్వతము, బాల సారస్వతము, జానపద సారస్వతము చేరియున్నవి. పరిషత్తు ప్రచురణములలో 15 పుస్తకాలు చాల వాఙ్మయమునకు చెందినవి కలవు. ఈ పుస్తకాలలో శ్రీ సన్నిధానము సూర్యనారాయణశాస్త్రిగారి నరసభూపాలీయ వివరణము ఆంధ్ర సారస్వత విద్యార్థులకు పాఠ్యగ్రంథముగా విశేషోపకారకముగానున్నది. పరిషత్తు ప్రచురణములలో స్వర్గీయ శ్రీసురవరము ప్రతాపరెడ్డిగారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర మనకు స్వాతంత్య్రము వచ్చినప్పటినుండి ఇప్పటివరకు విశాలాంధ్రమున ఆంధ్రభాషలో ప్రకటితమైన గ్రంథాలలో ఉత్తమమైనదిగా ఢిల్లీలోని సాహిత్య అకాడమీ వారిచే నిర్ణయింపబడి, కేంద్ర ప్రభుత్వమునుండి అయిదువేల రూపాయల బహుమతి పడసినది.ఇదిగాక జానపద వాఙ్మయమునకు సంబంధించిన స్త్రీల రామాయణపు పాటలు, పల్లెపదాలు అను వేయి పుటలు గల రెండు ఉద్గ్రంథములను పరిషత్తు ప్రకటించినది. తెలుగు మహాభారతము పై ప్రామాణిక పండితులు వ్రాసిన విమర్శనాత్మక వ్యాసాలను సంపుటీకరించి పరిషత్తు ప్రకటించినది.

గ్రంథాలయోద్యమ వ్యాప్తికి పరిషత్తు బలమైన చేయూతనిచ్చినది. 1952 వ సంవత్సరములో హైదరాబాదు నగరమున జరిగిన అఖిలభారత గ్రంథాలయ మహా సభా నిర్వహణమునందు ఈ పరిషత్తు యొక్క అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శులు ఆహ్వానసంఘ కార్యదర్శులుగ పని జేసిరి. మాజీ విద్యాశాఖ డైరెక్టరు శ్రీ సేతు మాధవరావుగారు నిర్వహించిన గ్రంథాలయోద్యమ సందర్భమున ఈ పరిషత్తు రెండు లక్షల తెలుగు పుస్తకాలను, విద్యాశాఖ క్రిందనున్న పాఠశాలలలో చేర్చుటకు పూర్తిగా సహకరించినది.

సాహిత్యముతో పాటు ఇతర కళలను ప్రచారము గావించుటకు పరిషత్తు కృషి గావించినది. 1952 అక్టోబరు నెలలో నృత్యగాన కళాసాహిత్యములనుగురించి హైదరాబాదాంధ్రులకు చక్కని పరిచయము కలుగ జేయుట కొరకై శ్రీ నటరాజ రామకృష్ణగారిని ఆహ్వానించి నగరమందు పలుచోట్ల నాట్యకళా ప్రదర్శనాలను ఏర్పాటు చేసినది. 1955 వ సంవత్సరము సెప్టెంబరు నెలలో తెలంగాణ చిత్రకారుడైన శ్రీ కొండపల్లి శేషగిరిరావు చిత్రించిన చిత్రముల ప్రదర్శనమును హైదరాబాదు నగరమున ఏర్పాటుగావించినది. ఈ ప్రదర్శనమునకు అప్పటి హైదరాబాదు ముఖ్యమంత్రి డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు గారు ప్రారంభోత్సవము గావించిరి.

మన రాష్ట్రమునందలి వివిధ వైజ్ఞానిక కార్యక్రమాలలో పరిషత్తు సహకరించుచున్నది. 1950 వ నవంబరు