Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/667

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర వాఙ్మయ చరిత్రము-II


పురమును, రాజగృహమునందలి నిత్యజీవిత విధానమును విపులముగా వర్ణించియున్నాడు. రఘునాథుడు వాహ్యాళి కరుగుచుండగా చిత్రలేఖ యను వార కాంత యొక్కతె ఆతని వలచి తనకోరిక తీర్పుమని చిలుకచే వర్తమాన మంపుటయు, రఘునాథుడా రాత్రి ఆమె యింటి కరిగి కేళిసల్పుటయు నిందలి ఇతివృత్తము. రస దృష్టి కీ కావ్యమంత ఉత్తమముగా కనబడకపోయినను చారిత్రక దృష్టితో చూచినచో మిక్కిలి ఉత్కృష్టముగా గోచరించును. ఆనాటి రాజకీయ సాంఘిక విషయములును, రాచనగరి మర్యాదలును, సంగీత నాట్య విద్యా వినోదములును ఇందు చక్కగా వర్ణితములై యుండుటచే నాయకయుగ చరిత్ర నిర్మాణమున కీ గ్రంథ మెన్నియో విధముల తోడ్పడజాలును.

ఈ పై ద్విపద కావ్యములే కాక విజయరాఘవుడు రచించితినని చెప్పుకొన్న లఘుకావ్యములలో గోపికా భ్రమర గీతముల తెనిగింపులును, ఫాల్గుణోత్సవ గోపాల దండకములును, వీరశృంగార సాంగత్యమును, సంపంగి మన్నారు సాంగత్యమును ముఖ్యములైనవి. పై గీతములు పద్యరూపమున తెనిగింపబడినవో, ద్విపద రూపమున తెనిగింపబడినవో తెలియదు. ఫాల్గుణోత్సవము రగడలో వ్రాయబడినది. చివరి రెండు సాంగత్యములును కర్నాటక సాంగత్య చ్ఛందమున రచింపబడినవి. ఆంధ్రమున ఈ ఛందములో రచన సల్పినవా డిత డొక్కడే.

విజయరాఘవుని ప్రతిభ అతడు రచించిన యక్ష గానములలో ఎక్కువగా గోచరించును. వాని సంఖ్య సుమారు ఇరువది వరకుండును. అవి అన్నియు నాటకము లనియే పేర్కొనబడినవి. వానిలో రఘునాథాభ్యుదయ విప్రనారాయణ చరిత్రలుమాత్రము ముద్రితము లైనవి. మిగిలినవి కొన్ని అముద్రితములు; కొన్ని నష్టములు. విజయరాఘవుడు వైష్ణవ మతాభిమాని. వైష్ణవాపచార మాతనికి గిట్టదు. అందుచేతనే కాబోలు వైష్ణవకథలలో చోళరాజు విప్రనారాయణుని శిక్షింప నాజ్ఞాపించెనని యుండగా అతడు విప్రనారాయణుని కథ తన రాజ్య మందలి మన్నారు గుడియందే జరిగినట్లును, తాను వైష్ణవాపచారముచే విప్రనారాయణుని శిక్షించు టెట్లని సందేహించుచుండగా శ్రీ రాజగోపాలస్వామి ప్రత్యక్షమై, సత్యమెరిగించి, విప్రనారాయణుని గౌరవించి తన్ను మెచ్చుకొనె ననియు వ్రాసియుండెను. ఇట్లే ఈ నాటకమున ఆత డితర సందర్భములందు సైత మధిక స్వాతంత్య్రము ప్రదర్శించినాడు.

విజయరాఘవుడు సంస్కృతాంధ్ర భాషలందు మేటి పండితుడు. అతడు సంస్కృత నాటకములు బాగుగా చదివి అందలి రచనా పద్ధతులను చక్కగా అవగాహనము చేసికొన్నవాడు. ఆ కారణముచే అతడు తననాటి యక్ష గానములందున్న కొన్ని పద్ధతులను మార్చి నూతన పద్ధతులను ప్రవేశ పెట్టి వానికెంతో వన్నె చేకూర్చినాడు. యక్షగానముల ఆరంభమున కవియే కృతిపతిని ప్రస్తుతించి, షష్ఠ్యంతములు చెప్పి, కథాక్రమమును వివరించినట్లు చెప్పబడియుండును. ఈ పద్దతి ప్రబంధోచితమైనదే కాని నాట కోచితమైనది కాదని గుర్తించి విజయ రాఘవుడు తన యక్షగానములందు దేవతా స్తోత్రానంతరము మేళ గాండ్రచే కైవారము చెప్పించి, వారి మూలముననే కథాక్రమమును ప్రకటింపజేసినాడు. ఇది కొంచె మించు మించుగా సంస్కృత నాటకములందలి నాందీ ప్రస్తావనలను పోలియుండును. ఇట్లే విజయ రాఘవుడు తన నాటకములలో కొన్నింటి చివర భరతవాక్యమును ప్రవేశ పెట్టినాడు.

విజయ రాఘవుడు తన యక్ష గానములలో త్రిపుటాది తాళములను గేయములతో కూడ వ్రాసియుండినను, రగడలను విడిచి వాని స్థానమున దరువు పదము మున్నగ నూతన రచనలను ప్రవేశ పెట్టినాడు. అతడు ప్రవేశ పెట్టిన మరియొక ముఖ్యమైన మార్పు సంభాషణ పద్ధతి అంతకుముందున్న యక్షగానములలో మధ్యమధ్య ఈ పాత్ర ఈ పాట పాడుచున్నదను కవి వచనములు కానబడుచుండును. ఇదియును ప్రబంధ పద్ధతియే. విజయ రాఘవు డీ పద్ధతిని విడిచి సంస్కృత నాటకములందువలె పాత్రోచితమైన భాషలో ఆ యా పాత్రముల నొండోటితో సంభాషింప జేసినాడు. తరువాతివారు పలువురి ముఖ్యముగా రంగాజమ్మ తమ యక్షగానములలో ఈ విధానము నవలంబించినారు.

విజయ రాఘవుని కొలువు నలంకరించిన విదుషీమణులలో రంగాజమ్మ అగ్రగణ్య. ఆమె అష్టభావ