ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - II
భావౌన్నత్యము ప్రకటించుటకు అంతగా అవకాశ ముండదు. కాని సూరన ఇందు కావించిన కొన్ని వర్ణనములందును, ప్రకటించిన భావములందును సామాన్య కావ్యములందువలెనే కవితా చమత్కార మెంతో కానబడుచున్నది. ఈ కావ్యమును అతడు అకువీటి పెద్ద తిమ్మ రాజునకు అంకితము కావించెను.
సూరన కీర్తిసౌధమునకు మూల స్తంభమని చెప్పదగినది కళాపూర్ణోదయము. ఇది కల్పితకథావస్తుక మైన అద్భుతకథా కావ్యము. ఇంతకు పూర్వము ప్రఖ్యాతవస్తుకములైన కావ్యములనేకాని ఇట్లు కల్పిత కావ్యములను వ్రాసిన కవు లెవ్వరును లేరు. ఇందు కలభాషిణి అను వేశ్య నాయిక. ఇందలి కథాకల్పనాచాతుర్యము అప్రతిమానమైనది. కథాకథనమున నిందు కాలక్రమపద్ధతిని కాక నవలలోవలె కార్యకారణపద్ధతిని సూరన అవలంబించి కథామధ్యవృత్తాంతముతో కావ్యము నారంభించెను. ఇందాతడు శృంగారరసమునకు సంబంధించిన వైవిధ్యమును వివిధమనఃప్రవృత్తులను చక్కగా ప్రదర్శించెను. ఈతడు రచించిన సుగాత్రీశాలీనుల కథ అమలిన శృంగారమున కాలవాలమై అతిరమణీయముగా నుండును మాయాసత్య రంభానలకూబరుల కథలో అతడు చూపిన చమత్కారము అద్భుతావహముగా నుండును. మాయా సత్యరంభల వాగ్వివాద మెంతో సహజమై సవతుల స్వభావమును స్పష్టము చేయుచున్నది. ఇచ్చటి సంఘట నము ఆంగ్లనాటకకవిసార్వభౌముడైన షేక్స్పియరు యొక్క కామెడీ ఆఫ్ ఎఱ్ఱర్సులోని సంఘటనమును పోలియుండు నని విమర్శకుల అభిప్రాయము. పాత్ర నిర్మాణమునను, రసపోషణమునను ఇందు సూరన చూపిన నేర్పు అనన్య సామాన్యమైనది. ఇట్లు కల్పితకథాకావ్యమును అద్భుతముగా సృష్టించియు నతడు చివరి ఆశ్వాసములలో మధురలాలసా కళాపూర్ణుల శృంగారమును వర్ణించుపట్ల సాధారణ ప్రబంధపద్ధతినే అవలంబించెను. ఈ కావ్యము నతడు నంద్యాల కృష్ణరాజునకు అంకితము చేసెను.
ప్రభావతీ ప్రద్యుమ్నమున శ్రీకృష్ణుని కుమారుడగు ప్రద్యుమ్నుడు వజ్రనాభుడను రాక్షసరాజుకుమార్తెయగు ప్రభావతిని వలచి పరిణయమాడిన కథ వర్ణింపబడినది. ఇది శ్రవ్యప్రబంధమే యయ్యును ఇందలి కథ యంతయు పాత్రల సంవాదరూపమున సాగుటచే ఒక దృశ్యకావ్యము వలె కనిపించును. ప్రభావతీ ప్రద్యుమ్నుల నడుమ ప్రణయ దౌత్యము నడపిన శుచిముఖ అను రాజహంసి వాక్చాతుర్యమును కార్యసాధన కౌశలమును వర్ణించుటలో సూరన అప్రతిమానమైన నేర్పు ప్రదర్శించెను. అతడీ చక్కని ప్రబంధమును తన తండ్రి పేర నంకితము కావించి అపూర్వమైన పితృభ క్తిని వెల్లడించెను.
సూరన మహాపండితుడు. కథారసానుగుణముగ ఇతని శైలి ప్రౌఢత్వము నొందుచుండినను అది సాధారణముగా మృదుమధురమైన సరళగతినే నడచుచుండును. జాతీయములను, సామెతలను వాడుటలో ఇతడు కడునేర్పరి. సంభాషణముల నడుపుటయందును, పాత్రల చిత్తవృత్తుల చిత్రించుటయందును ఈతడు తిక్కన సోమయాజికి సాటి కాజాలును. శ్లేషరచనయం దీతడు అద్వితీయుడు. ప్రతిభావంతులైన ఆంధ్రమహాకవుల శ్రేణిలో సూరనకు ఉన్నతమైన స్థానము కలదు.
రామరాజభూషణుడను బిరుద నామముగల భట్టుమూర్తికూడ అష్టదిగ్గజకవులలో నుండెనో లేదో చెప్పజాలము. కృష్ణ దేవరాయల అల్లుడయిన అళియరామరాయల కొలువున కీతడు భూషణమై ఉండుటచే ఇతనికి రామరాజభూషణు డను బిరుధము కలిగినది. ఇతని మొదటి పేరు మూర్తి యనియు బట్టుకులమువా డగుటచే బట్టుమూర్తియను ప్రచారము కలిగె ననియు చెప్పుదురు. ఇతడు గొప్ప పండితుడు, అవధానములందును, ఆశు కవిత్వమునందును ఆరితేరిన వాడు. ఇతడు మొదట హనుమంతునికిని, తరువాత శ్రీరామచంద్రునికిని భక్తుడు. సంగీతకళా రహస్యనిధి. ఇతని రచనలలో ఇతనికి గల బహుశాస్త్రపాండిత్యము వ్యక్తమగును.
ఇతడు నరసభూపాలీయ మను నామాంతరముగల కావ్యాలం కారసంగ్రహమును, హరిశ్చంద్రనలోపాఖ్యాన మను ధ్వ్యర్థికావ్యమును, వసుచరిత్రమను మహాప్రబంధమును రచించెను. ఇందు మొదటిది సంస్కృతమున విద్యానాథుడు రచించిన ప్రతాపరుద్ర యశోభూషణము ననుసరించి వ్రాయబడిన లక్షణ గ్రంథము. ఇందు కావ్య ధ్వని రసాలంకారము లను గూర్చియు నాయికానాయకు