ఆంధ్ర వాఙ్మయ చరిత్రము II
మను గ్రహించుటకు ముందు చెప్పిన ఉత్పలమాలిక నుబట్టి ఇత డాశుధారాకవిత్వమునకూడ నేర్పరియని తెలియు
చున్నది.
రాయల దేవేరులలో నొకతెయైన తిరుమల దేవితో నందితిమ్మన అరణముగా వచ్చెనని చెప్పుదురు. ప్రస్తుతము వసుచరిత్రలో కనవచ్చు "నానాసూనవితాన వాసనల" అను ముక్కును వర్ణించు పద్యమును భట్టుమూర్తి ఇతని నుండియే గ్రహించెననియు, అందుచే ఇతనికి ముక్కు తిమ్మన అను పేరుకలిగెననియు ప్రవాదముకలదు. కాని ఇం దెంత సత్యమున్నదో చెప్పజాలము. ఇతడు రచించిన ప్రబంధము పారిజాతాపహరణము. ఇం దవతారికలో మనుచరిత్రలో వలెనే కృతిభర్తయైన కృష్ణరాయలయు, తత్పూర్వులయు గుణగణములును పరాక్రమాదులును విపులముగా వర్ణింప బడినవి. ఈ రెండు గ్రంథములలో కావింపబడిన రాయల దిగ్విజయములను బట్టి మను చరిత్రము కంటే పారిజాతాప హరణమే ముందు రచింప బడియుండు నని (క్రీ.శ.1515) విమర్శకులు ఊహించు చున్నారు. పారిజాతాపహరణము నందలి కథ సంస్కృత హరివంశమునుండి గ్రహింపబడినది. తిమ్మన కథలో చేసిన మార్పులు చాలతక్కువ. అందు కృష్ణుడు సత్యభామను అనునయించుచు ఆమెకు నమస్కరింపగా ఆమె తన యెడమ కాలితో నతనితల తన్నుటయు, అట్టి సందర్భమున కూడ కృష్ణుడు కుపితుడు కాక రసజ్ఞుడై ఆమెతో సందర్భోచిత సరససల్లాపములొనరించుటయు ముఖ్యము లైనవి. రాయ లేదో కారణమున తిరుమల దేవిపై కోపించి ఆమెతో మాటాడుట మానివేయగా అతనికి ప్రియానునయ విధానమును ప్రబోధము కావించుటకై తిమ్మన అమూలకమైన ఈఘట్టమును కల్పించెనని చెప్పుదురు. పారిజాతాపహరణమునందలి ప్రథమాశ్వాసము శృంగారరసపూరితమై మిక్కిలి మనోహరముగా నుండును. ఇందు సత్యభామ ప్రౌఢత్వమును, మానినీత్వమును చక్కగా వర్ణింపబడినవి. తక్కిన ఆశ్వాసములలో చంద్రోదయ, సూర్యోదయ, ప్రయాణ, వనవిహార, యుద్ధాదులు ప్రబంధోచితములుగా వర్ణితములై యున్నవి. ప్రకృతి వర్ణనమున తిమ్మన చాల మెలకువ చూపెను. పారిజాతాపహరణ ప్రబంధమున చివర పుణ్యక వ్రత వృత్తాంతము కలుపుట అనావశ్యకమని కొందరందురు. తిమ్మన శైలి మృదుమధురమై, ఎక్కడను కుంటుపడక, మకరంద ప్రవాహమువలె సాగిపోవును. అందుచేతనే 'ముక్కుతిమ్మనార్యు ముద్దుపలుకు' అను నానుడి కలిగినది. ఈతని వర్ణనలు భావగంభీరములును, ఔచిత్య శోభితములునై యొప్పారును. కాని ద్వితీయ తృతీయాశ్వాసములందలి వర్ణనలు అతిదీర్ఘములై కథాగమనమున కించుక ఆటంకమును కలిగించుచున్నవి. మృదువులైన శృంగార భావములను రసానుగుణమైన శైలిలో, మనోహరముగా వర్ణించుటలో తిమ్మన కృత హస్తుడు.
మాదయగారి మల్లనకూడ రాయలవారి ఆస్థానమందుండినట్లు రాయవాచకము వలన తెలియుచున్నది. ఇతడు రాజశేఖర చరిత్రము అను ప్రబంధమును రచించి తిమ్మరుసు మంత్రికి అల్లుడైన నాదెండ్ల అప్పామాత్యునికి అంకితము చేసెను. హేమధన్వుని కుమారుడైన రాజ శేఖరుడు సింధురాజు కూతురైన కాంతిమతిని వివాహమాడుట ఇందలి ఇతివృత్తము. ఇందలి కథాకల్పనలో వైచిత్రి అంతగా కానరాదు, కాని రాజశేఖరునకును కాంతిమతికిని కాళికాదేవి ఇచ్చిన చిలుక నడిపిన రాయభారము రమ్యముగా నుండును. పింగళి సూరనార్యుని ప్రభావతీ ప్రద్యుమ్నమునందలి శుచిముఖ ఈ చిలుకకు శిష్యురాలని చెప్పవచ్చును. రాజశేఖర చరిత్ర పరిమాణమున చిన్నదయ్యును మిక్కిలి రసవంతముగా నుండును. రసవంతముగా కవిత్వము చెప్పజాలనిచో అసలుకవిత చెప్పక యేయుండుట మేలని మల్లన వాక్రుచ్చెను. ఈతని గ్రంథమున వర్ణనలు నాతిదీర్ఘములును ఔచిత్యపూరితములునై యుండును. శృంగారరసవర్ణనమున కూడ ఇతడు చాల నిగ్రహము ప్రదర్శించెను. ఈతని శైలి ప్రసాద గుణ భూయిష్ఠమై ముద్దులొల్కుచుండును. పాత్రోచితముగను సహజముగను భావములను వర్ణించుటలో ఇతడు కడు నేర్పరి.
“స్తుతమతియైన ఆంధ్రకవి ధూర్జటి పల్కుల కేలక ల్గెనో యతులిత మాధురీమహిమ" అని రాయలవారిచే ప్రశంసింప బడిన ధూర్జటి మహాకవి శ్రీ కాళహస్తి మాహాత్మ్యము అను క్షేత్రమాహాత్మ్యమును రచించెను. శ్రీ కాళహస్తీశ్వర శతక మితడు రచించినదా కాదా అని కొందరు