ఆంధ్ర వాఙ్మయ చరిత్రము-I
చెన్నమల్లు సీసములు, వృషాధిప శతకము, ఒనవి దాహరణము అనునవి తెలుగు కృతులు. వీటిలో బసవపురాణ
పండితారాధ్య చరిత్రలకును, వృషాధిప శతకమునకును విశేష ప్రఖ్యాతి కలదు. బసవపురాణము, వీరశైవ మత
ప్రతిష్ఠాపకుడైన బసవేశ్వరుని జీవిత చరిత్రము. ఇందు ప్రసక్తారు ప్రసక్తముగా పలువురు శివభక్తుల చరిత్రలు కూడ వర్ణితములైనవి. సొమనాథు డిందలి వస్తువును వృద్ధులనుండియు, ప్రాచీన భ్యక్తులు బసవేశ్వరుని గూర్చి రచించిన గీతముల నుండియు గ్రహించినట్లు తెల్పి యున్నాడు. శివతత్త్వ సారమున సంగ్రహముగా చెప్పబడిన శివభక్తుల చరిత్రములు బసవపురాణ పండితారాధ్య చరిత్రములందు విపులముగా వర్ణింపబడినవి. బసవేశ్వరుడును, ఇతర భక్తులును ఒనరించిన లోకోత్తరములైన కార్యము లెన్నో ఇందు వివరింపబడినవి. ఇందలి బెజ్జ మహాదేవి కథ, కన్నప్ప కథ, సూరసానమ్మ కథ, చిరు తొండనంబి కథ మిక్కిలి రసవంతములై ఉండును. శ్రీనాథుని హరవిలాసమునందలి సిరియాళుని కథ కిందలి చిరుతొండ నంబి కథయే మాతృక. ఆంధ్రదేశముననే కాక కర్ణాట దేశమునకూడ మత గ్రంధముగా బసవ పురాణమున కమితమైన ప్రచారము కలదు. ఇది కన్నడ, తమిళములలోనికే కాక సంస్కృతమునకు
కూడ పరివర్తనము చేయబడినది. దీనికి తెలుగున మూడు పద్యరూపానువాదములు కలవు. పండితారాధ్య చరిత్రము నందు శైవమతమున కాచార్యుడని చెప్పదగిన మల్లి కార్జున పండితారాధ్యుని జీవిత చరిత్రము వివరింపబడినది. ఇది సోమనాథుని రచనలోని కెల్ల కడపటిదైనను కవితా పాటవమునం దగ్రగణ్యమైనది. పండితుడు వెలనాటి చోడుని సభలో జైన బౌద్ధ చార్వాకాది మతముల ఖండించి వీరశైవమును ప్రతిష్ఠించిన వృత్తాంత మిందలి ప్రధాన విషయము. ఇందు దీక్షా పురాతనవాద మహిమ పర్వత ప్రకరణములు అను నైదు ప్రకరణము లున్నవి. ద్విపదచ్ఛందోబద్ధమైనను మహాకావ్య లక్షణ సమగ్రత యందును, నవరస పరిపోషణమునందును ఈ కావ్యము మిక్కిలి వాసి కెక్కి యున్నది. ఇందు పెక్కు చోట్ల పండితారాధ్యుని కృతులలోని భాగములు యథాతథముగా నుద్ధరింపబడి యున్నవి. సంగీతము, నాట్యము, వైద్యము, రసవాదము మున్నగు విషయములును, వివిధ దేశాచారములును, ఇందు వివరింపబడినవి. దీనిని శ్రీనాథు
డాంధ్ర పద్యకావ్యముగను, గురురాజకవి సంస్కృత కావ్యముగను సంతరించి యుండిరి. వృషాధిప శతకము ఒసవా! బసవా! వృషాధిపా! అను మకుటముతో రచితమైన శతకము. ఇందు బసవేశ్వరాదులగు శివభక్తుల చరిత్రములు సంగ్రహముగా వర్ణింపబడినవి. ఇందున్న తమిళ, కన్నడ, మహారాష్ట్ర మణిప్రవాళ భాషాపద్యము లీతని బహుభాషా పాండిత్యమును వెల్లడించు చున్నవి. మనకు లభ్యమగుచున్న శతకములలో మకుట పద్య సంఖ్యా నియమములతో కూడిన ప్రథమశతక మిదియే. ద్విపదచ్ఛందమును మహా కావ్యోపయోగిగా తీర్చిదిద్దిన మహాకవి సోమనాథుడు. ఇతడును నన్నెచోడునివలె జాను తెనుగును వాడినట్లు చెప్పుకొని యున్నాడు. పాఠకుల భావన కించుకైనను విడిచి పెట్టక ఈతడు దేనినైనను విస్తృత తరముగా వర్ణించుచుండును. అందును శివునో, బసవునో వర్ణించు సందర్భమున ఇతని రచన ఆవేళ పూరితమై గిరినదివలె ఉరవడితో ప్రవహించుచుండును. ఇతడు కొన్ని ద్విపదలలో ప్రాసయతిని వాడెను. ద్విపదకు ద్విపదకు తెగ చెప్పవలెనను నియమమును పాటింపక వాని నేక ధారగా నడపించెను. లాక్షణికులు దోషముగా పరిగణించు పదములును, సంధులును, సమాసములును ఇతని రచనలో నచ్చటచ్చట కాననగును. అయ్యు, వస్తుచ్చందో భాషా విషయముల కనవచ్చు దేశీయతయు, వర్ణనాదుల గోచరించు తన్మయతయు, దాని కొక అసాధారణ
సౌందర్యమును చేకూర్చుచున్నవి. ద్విపదను రోకంటి పాటగా కాక బహుభంగుల వైవిధ్యముతో నడపించి ఆతడా ఛందమున కఖండమైన ప్రతిష్ఠ సంపాదించెను. అందుచేతనే ద్విపద కావ్యకర్తలలో కాలము చేతనేకాక కవితాప్రతిభచే కూడ నీతని కగ్రస్థానము లభించెను.
క్రీ. శ. 12వ శతాబ్దిలో నాంధ్రదేశమున శైవ వైష్ణవ మతములు రెండును వ్యాప్తిచెంది పలువు రనుయాయుల నాకర్షించెను. వారన్యోన్య దర్శన స్పర్శన భాషణాదులను కూడ నుజ్జగించి ఒండొరుల ద్వేషించుకొనుచు సంఘమున కొంత అలజడి కలిగించిరి. అది చూచి ఆ