Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/641

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర వాఙ్మయ చరిత్రము ·I


అనగా అతడు క్రీ. శ. 12వ శతాబ్ది ఆరంభమువాడని చెప్పవచ్చును, ఈ కవిరాజ శిఖామణి వ్రాసిన కావ్యము కుమార సంభవము, ఇందు పండ్రెం డాశ్వాసములున్నవి. శివపురాణము, కాశి దాహిద్భటుల కుమార సంభవములు చదివి, అందలి పార్వతీ పరమేశ్వరుల ప్రణయ వృత్తాంతమునకు తారకాసురవధ యను వీర రసప్రధానమైన కధ సంగముగా జేసి యాతడు రసాలంకార వర్ణన పరిపూర్ణముగా నీ కావ్యమును నిర్మించినాడు. ఇందు కాళిదాసాదుల భావము లచ్చటచ్చట గోచరించుచున్నను మొత్తముమీద నిది స్వతంత్ర కావ్యమనియే చెప్పవలెను. ఇందు కన్నడ కవితా సంప్రదాయములు హెచ్చుగా గోచరించును. తిక్కనాదుల రచనలో తరువాత కానవచ్చు షష్ఠ్యంతములను తెలుగున తొలుదొల్త వ్రాసిన వాడీ నన్నెచోడుడే. ఇతనికి వర్ణన ప్రీతి హెచ్చు. ఇతని వర్ణనలు సహజములును, దేశీయ సంప్రదాయానుకూలములునై మనోహరముగా నుండును. తిక్కన యుద్ధవర్ణనల కితని కావ్యము తుదనున్న యుద్ధవర్ణనమే మేలు బంతియై యుండవచ్చును. రతీమన్మదుల సంభాషణము, పార్వతీ కపటవటువుల సంభాషణము ఈతని సరస సంభాషణ రచనాసామర్థ్యమునకు తార్కాణములు. ఈ విధముగా నీతని కావ్య మాంధ్రమందలి తొట్టతొలి ప్రబంధమని చెప్పదగియున్నది. దేశిమార్గములు, వస్తుకవిత మున్నగు పదముల నాంధ్రవాఙ్మయమున వాడినవా డీత డొక్కడే. వాని నీతడు కన్నడ వాఙ్మయమునుండి గ్రహించియుండెను. ఇట్లే ఈతడు తమిళ వాఙ్మయము నుండి గ్రహించిన దేశీయ సంప్రదాయములును కొన్ని గలవు. ఇతడీ గ్రంథమును తన గురువయిన జంగమ మల్లి కార్జునున కంకితము చేసి, అపారమైన గురుభక్తిని ప్రకటించెను. ఈతని శైలి నన్నయ శైలికంటె నించుక భిన్నమైనది. ఇతడు సంస్కృత సమాసములను సాధ్య మయినంతవరకు తగ్గించి జానుతెను గను పేరుతో చమ త్కార గర్భితము లయిన తెలుగు పలుకుబళ్ళ నెక్కువగా ప్రయోగించెను. ఇతని కావ్యమున నర్థశబ్దాలంకార ప్రీతియేకాక బంధకవిత్వమును, ఛందో వైవిధ్యమును గూడ కానిపించుము. అట్లయ్యు నాతని పద్యముల నడకలో భంగపా టెచ్చటను గోచరింపదు. ఇతని రచనలోలాక్షణికులు వ్యాకరణ విరుద్ధములుగా పరిగణించు కొన్ని ప్రయోగము లచ్చటచ్చట కానబడును. కాని పదభావ సంపదను, రచనా ప్రౌఢిమను, ధారాశుద్ధిని పరికించిచూడ నీతనికిగల కవిరాజ శిఖామణి యను బిరుదమస్వర్ధ మనుటకు సందేహింప బనిలేదు.

మల్లికార్జున పండితారాధ్యుడు (1120-1180) శివ తత్త్వసారము, లింగోద్భవ గద్యము, రుద్రమహిమ, గణ సహస్రమాల, అమరేశ్వరాష్టకము, పర్వత వర్ణనము మున్నగు కావ్యములను రచించినట్లు పండితారాధ్య చరిత్రవలన తెలియుచున్నది. ఈతడు కన్నడ సంస్కృతములందు కూడ పండితుడగుటచే నిందు కొన్ని ఆ భాషలలో రచింపబడినవి కూడనై యుండవచ్చును. శివతత్త్వసారము శివా ! అజా ! రుద్రా! మహేశా ! అను సంబోధనములతో కూడిన కందపద్యములలో రచింపబడినది. ఇందలి పద్యముల సంఖ్య కొన్ని వందలున్నను స్వభావమునుబట్టి దీనిని శతకమనియే చెప్పవచ్చును. సోమనాథుడు దీనిని శతకమనియే పేర్కొనెను. మల్లి కార్జున పండితు డిందు శివదీక్షను గూర్చియు, పాశుపతశైవ సిద్ధాంతములను గూర్చియు విపులముగా వర్ణించినాడు. ఇంద ద్వైతుల మాయావాద మనేక యుక్తులచే ఖండింప బడినది. ఇత డచ్చటచ్చట వేదములనుండి కూడ ప్రమాణములను చూపుచు అద్వైత పరములైన వాక్యములకు సైతము ద్వైతపరముగా నర్థము చెప్ప యత్నించెను. శివతత్త్వసారమునందలి శైలి లక్షణానుగుణమై పెక్కు విధముల నన్నయ శైలినే పోలియుండును. వలపలగిలక ప్రాసము, కొన్ని వింతశబ్దములు ప్రయోగము ఈ గ్రంథమున కలవు. కాని మొత్తముమీద పండితుడు మతమున వలెనే రచనమునకూడ సంప్రదాయానురక్తినే యెక్కువగా ప్రకటించెను.

దేశి మార్గమునకు చెందిన ద్విపద కవిత్వమునకే కాక శివకవి సమూహమునకును, వీరశైవమత సిద్ధాంతములకును గురుపీఠ మని చెప్పతగినవాడు పాల్కురికి సోమనాథుడు. (క్రీ. శ. 13 వ శతాబ్ది ఉత్తరార్ధము) ఇతడాంధ్ర సంస్కృత కర్ణాట భాషలు మూడింటను గ్రంథములు రచించెను. అందు బసవపురాణము, పండితారాధ్య చరిత్రము, సోమనాథ స్తవము, అనుభవసారము,