ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - I
రేనాటి చోళులును, తూర్పు చాళుక్యులును పరిపాలనము నెరపుకాలమున మొదటిసారి శాసనములు తెలుగు భాషలో వ్రాయబడినవి. క్రీ. శ. 7,8 శతాబ్దులందలి తూర్పు చాళుక్యుల శాసనములలో ప్రాకృత భాషా సంపర్కము కొంత అధికముగా కానవచ్చును. తరువాత క్రమముగా ఆప్రాకృతపదముల స్థానమును సంస్కృత సమాసము లాక్రమించినవి. క్రీ.శ. 848లో తూర్పు చాళుక్యరాజైన గుణగ విజయాదిత్యుడు వేయించిన అద్దంకి శాసనములో ఒక తరువోజయు, పిమ్మట కొంత వచనమును వ్రాయబడినవి. కొంచెమించుమించుగా ఆకాలమునకే చెందిన కందుకూరు ధర్మవర శాసనములలో
సీసపద్యములు కనబడుచున్నవి. తరువాత క్రీ.శ. 934 నాటి యుద్ధమల్లుని బెజవాడ శాసనములో ఐదు మధ్యాక్కరా పద్యములు చూపట్టుచున్నవి. క్రీ. శ. 1000 ప్రాంతము నాటిదని తలంపబడు విరియాల కామసాని గూడూరు శాసనములో మూడు చంపకమాలలును, రెండుత్పలమాలలును వ్రాయబడినవి. నన్నె చోడుడు కుమారసంభవములో వ్రాసిన
మునుమార్గ కవితలోకం
బున వెలయఁగ దేశికవిత పుట్టించి తెనుం
గును నిల్పి రంధ్రవిషయం
బునఁజన జాళుక్యరాజు మొదలగు పలువుర్.
అను పద్యమంతకు పూర్వమే తెలుగున కవిత్వముండెనను విషయమును వ్యక్తము చేయుచున్నది. ఇరుగు పొరుగు దేశములందు కన్నడము మున్నగు భాషలలో మార్గకవిత్వము వ్రాయబడి ప్రచారము నొందుచుండగా గుణగ విజయా దిత్యుడో, మరేచాళుక్యరాజో తెలుగు దేశమున దేశికవిత పుట్టించి, తెలుగును నిలిపె నని ఈ పద్యమున కర్థము చెప్పవలయును. దీని కనుగుణముగా క్రీ. శ. 9, 10 శతాబ్దులలో వ్రాయబడిన శాసనములలో సంస్కృత వృత్తము లేమియులేక కేవల దేశిపద్యములే గోచరించుచున్నవి. సంస్కృతాభిమానులైన పండితులీ దేశికవిత్వము నంతగా నాదరింపని హేతువున తరువాత తెలుగుదేశమునకూడ మార్గకవితాపద్ధతియే అవలంబింపబడినట్లు తోచుచున్నది. కామసాని గూడూరుశాసనము నందలి పద్యములు ఇందుకు దృష్టాంతములు. లభించిన
ఈపద్యములు రెండుమూడు కంటే నెక్కువగా లేకపోవుట చేతను, పైశాసనములందలి పద్యములు వ్యక్తుల వీరావదానములను, దానములను మాత్రము వర్ణించునట్టి వగుటచేతను వానియందలి సారస్వతగుణమునెత్తిచూపుట కవకాశములేకున్నది. కాని దేశి మార్గములు రెండింట చెప్పబడిన ఏదో యొక రకమైన కవిత్వమును, తరువాత నన్నయ భారతమున నవలంబించిన చంపూ పద్ధతియు అంతకుముందే ప్రచారమున నుండె ననుట కివి నిదర్శన ములుగా నున్నవి. అద్దంకి ధర్మవరము శాసనములు గద్య పద్యములతో కూడియుండుటచే చంపూపద్ధతికి చెందిన వని చెప్పవచ్చును. పైని పేర్కొనబడిన పద్యములేకాక దేశి మార్గమునకుచెందిన పలురకముల పద ములుకూడ నప్పుడు వ్రాయబడుచుండెనని తెల్పుటకు కొన్ని ఆధారములు లభించుచున్నవి. పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రమున భక్తులు, తుమ్మెదపదములు, వెన్నెలపదములు, ప్రభాతపదములు మున్నగు పదములు పాడుచుండి రని వ్రాసియుండెను. మరియు నతడు తాను రచించిన బసవ పురాణమునకు “ఆతతబసవపురాతన భక్తిగీతార్థ సమితీయే మాతృక”యని తెల్పియుండెను. ఆతని నాటి కంతబహుళ ప్రచారములోనుండిన పదములును, గీతములును తత్సదృశములైన యితరపద గీతాదులును అంతకు పూర్వము కూడ ప్రచారములో నుండె ననుకొనుటలో విప్రతిపత్తి ఉండదు. క్రీ.శ. 11వ శతాబ్దిలో రచింపబడిన యాప్పి రంగలమ్' అను తమిళ చ్ఛందోగ్రంథమున తత్కర్త పెంచయ్య వ్రాసిన తెనుగు ఛందమును పేర్కొనెను (వాంచియార్ వడఘుచందవుమ్). అప్పటికే తెలుగున ఛందోగ్రంథ మొకటి వెలువడియుండుట అంతకు పూర్వమే ఆభాషలో ఛందోబద్ధమైన రచన విరివిగా నుండెనని చెప్పక చెప్పుచున్నది. కానీ ఆ కవిత్వము గ్రంథస్థము కాకపోవుటచేతను, గ్రంథస్థమైనను మతవైషమ్యాది కారణములచే నష్టమైపోవుటచేతను దాని గుణగణములను నిర్ణయించుటకు వీలు లేక పోవుచున్నది.
ఇట్లు నన్నయకు పూర్వమే కొంత కవిత్వముండెనని నిశ్చయముగా తెలియవచ్చుచుండ నాతడు రచించిన భారతమే తెలుగున ఆదికావ్యమనుటకు హేతువేమి అను ప్రశ్నకు సమాధానము చెప్పవలసియున్నది. ఆతనికి