Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/637

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రలిపి పరిణామము


మూడుచోట్ల నున్న వానికంటే విలక్షణముగ నున్నది. కాబట్టి యిది 'డ' కారముకన్న వేరనియు నితర ద్రావిడ భాషలనుండి వచ్చినదనియు గ్రహింపదగును.

తమిళమున అఱి ధాతువునకు నాశనము చేయుట, పాడుచేయుట, ధ్వంసముచేయుట అను నర్థములు కలవు. తెలుగున వెంపఱి మొదలగువానిలో నీయఱి నిలిచియే యున్నది. కాని ప్రాచీన కాలమున, నీ అఱి ధాతువు కన్నడ భాషలో అళిగా మాఱినది. దాని ననుసరించి తెలుగున 'అడి' అయినది. అందుచేతనే తెలుగులిపిలో, సహజవర్ణమగు 'డ' కారమునకు, ఇతర భాషాపరిణామ మూలమున వచ్చిన యీ 'డ' కారమునకు లిపి భేదము కలిగినది. రేనాటి చోళుల ప్రాచీన శాసనములో చోఱ -చోడ - ఏఱు - ఏదు - అని యీ యక్షరమగుపడుచున్నది.

నన్నయ ఈ యక్షరమును వాడుక చేయలేదు.

అఱిచిన - బొడిచిన - చెడు నెప్పుడు. అని తెనుగున గల సహజ 'డ' కారముతో ప్రాసలో వ్రాసియున్నాడు. (భార. ఆది. 1.138)

నన్నయతరువాత శాసనములలో నియక్షరము లేదు. ఈ యక్షరమునకును, ఈరూపముతో నుండు ఇతరాక్షరములకు గల భేదమును ఈ క్రింద చూపుచున్నాను.

2. వలపలిగిలక  :- "ప్రాచీన లేఖనమున బ్రాహ్మీలిపిలో J అను రీతిగను నంతకంతకు అను రీతిగను రేష ముండెడిది. అది ఇతర వర్ణముతో కలిసినపుడు, వర్ణముల మీద నిల్చుటలో కాలక్రమమున J, S,O అను రీతిని పరిణమించినది. రేఫముమీద తలకట్టుపోయిన "c." అనునాకారము గిలకవలె నుండుటచే దానికి గిలక యను పేరువచ్చెను. ఉ: శ్రీ దమ్ము౯ (యుద్ధమల్లుని బెజవాడ శాసనపు తుది పంక్తి.) నాగర లిపిలో నేటికిని నిట్లే గిలకయున్నది. ॥ ఇట్టి తలమీది గిలక తలమీది యనునాసికలిపి యనుస్వారరూపమున వలపలికి దిగినట్లే కాలక్రమమున వర్ణము వలపలికి దిగి '౯' అను రూపములోనికి పరిణామము చెందినది. ఈసందర్భమున నింకొక విషయము చెప్పవలసియున్నది.

అనుస్వారము ప్రాచీన కాలమున ద్వివిధముగా వ్రాయబడెడిదిగాన, నది ద్వివిధముగా వలపలికిని, దాపలికిని దిగుట సంభవించెను. గిలకయన్ననో వలపలికే దిగినది. అర్క= అక్క౯. అను నాసికాక్షరములకు బదులుగా పరాక్షరము తలపై వ్రాయబడెడి యనుస్వారము దాపలికి దిగుచు వచ్చెను. (రాముణ్ణు = రాముడు - రాముండు) తక్కినచోటులందలి తలమీది యనుస్వారము వలపలికి దిగుచు వచ్చెను. ఉ: వశము = వంశము. రేఫము వలపలి కే దిగుటచేతనే దానికి 'వలపలిగిలక' యను పేరు వచ్చెను." (వైయాకరణ పారిజాతము, పుట 277)

ప్రాచీనులగు నన్నయాది మహాకవులును, నన్నెచోడ, పాల్కురికి సోమనాథాది శివకవులును నీ వలపలిగిలక సంప్రదాయమును చక్కగా పాటించినారు. రేఫ సంయుక్తాక్షరము లన్నియు, వలపలిగిలక సంప్రదాయముచే తొలుత ద్విత్వాక్షరములుగా వ్రాసి ఆవెనుక రేఫోచ్చారణ చిహ్నమగు వలపలిగిలక వ్రాయుదురు. ఉచ్చారణములో మనకు రేఫధ్వని వినబడుచున్నను వ్రాతలో రేఫకన్నా ద్విత్వాక్షర ధ్వనికే ప్రాధాన్యము.

ధర్మము - అని యిట్లు వ్రాసిన రకారధ్వని మనకు స్పష్టముగ తెలియును. కాని ధమ్మ౯ము అని వలపలిగిలక వ్రాసిన మకారమునకే ప్రాధాన్యము.

ఇచట ముఖ్యముగ మనము పరిశీలింపవలసిన దేమనగా, పైవ్రాతలు, ప్రాసవిషయమున సరిపోవచ్చునుగాని యతి విషయమున సరిపోవు. వలపలిగిలక సంప్రదాయము ననుసరించిన రేఫకు యతియెట్లు పొసగును ?

ఈక్రింది యుదాహరణమువలన పైవిషయము స్పష్టమగును.